Tips for Glowing During Dussehra:పండగ, ఫంక్షన్, పార్టీ.. ఇలా అకేషన్ ఏదైనా కొంచెం స్పెషల్‌గా కనిపించాలనుకోవడం సహజం. అందుకే రోజూ కంటే మరింత అందంగా మెరిసిపోవాలనుకుంటాం ఆ రోజు. అందులోనూ దసరా అంటే దేవీ పూజ, దాండియా.. ఫ్రెండ్స్, బంధువులతో ఒక్కటే హడావిడి! మరి, ఈ పండగ వేళ ప్రత్యేకంగా కనిపించడానికి, అందరి చేత యూ ఆర్ లుకింగ్ బ్యూటీఫుల్ అనిపించేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవి ఫాలో అయితే మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారట!!
ముచ్చటైన మోము కోసం: అందం విషయంలో తొలి ప్రాధాన్యం ముఖానిదే. ముఖం, కళ్లు, పెదాలు.. కళగా ఉంటేనే ముఖ సౌందర్యం రెట్టింపవుతుంది. అందుకోసం ఈ చిట్కాలు పాటించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
- ముఖంపై కనుబొమ్మలు అట్రాక్షన్. అయితే అందంగా కనపడాలన్న ఆలోచనతో చివరి నిమిషంలో కనుబొమ్మలు సరిచేయడం, ముఖంపై గల అవాంఛిత రోమాలను తొలగించడం చేయకూడదంటున్నారు. కనుబొమ్మలు మరీ ఎక్కువగా పెరిగాయనుకుంటే చుట్టూ ఉన్న కొన్ని వెంట్రుకలను మాత్రం తొలగించి, మిగిలిన వాటిని కన్సీలర్ సహాయంతో చర్మం రంగులో కలిసేలా చేయాలట. తద్వారా సహజసిద్ధంగా కనిపించే అవకాశం ఉంటుందంటున్నారు.
- కళ్ల కింద నలుపు కూడా అందాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి కళ్ల కింద నలుపు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే చల్లని పాలలో దూదిని ముంచి కళ్లపై పెట్టుకుని కాసేపు రెస్ట్ తీసుకోండి. అదే సమయంలో అందుబాటులో ఉన్న ఏదైనా ఒక పండు గుజ్జునో లేక టమాట రసాన్నో ముఖానికి, మెడకి ప్యాక్‌లా వేసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే ఒకేసారి రెండు పనులూ పూర్తవుతాయి. అందంగాను కనిపిస్తారు.
- సరైన నిద్ర ముఖాన్ని మరింత కాంతివంతం చేస్తుందనే విషయం తెలిసిందే. అందుకే ఎంత హడావిడిగా ఉన్నా నిద్ర సమయాన్ని మాత్రం తగ్గించకూడదంటున్నారు.
- అందంగా కనిపించడంలో నవ్వు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే నవ్వినప్పుడు దంతాలు మెరవాలంటే కాస్త ఉప్పు, చిటికెడు వంటసోడా కలిపి దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే దంతాలు మిలమిలా మెరుస్తాయి.
- పెదాలు అందంగా కనిపించడానికి చక్కెరతో స్క్రబ్ చేసి, కడిగిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలని సూచిస్తున్నారు.
కురులకు: నేచురల్ హెయిర్ ప్యాక్స్ వేసుకుంటే కురులు బాగుంటాయి. కానీ అవి వేసుకోవడానికి టైం లేనప్పుడు.. నాలుగు విటమిన్-ఇ ట్యాబ్లెట్లను కత్తిరించి, అందులోని లిక్విడ్‌ని మీ జుట్టుకు సరిపడా కొబ్బరి నూనెలో కలిపి కుదుళ్ల నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. ఆపై ఒక ఐదు నిమిషాలు మర్దన చేసి ఇరవై నిమిషాల తర్వాత షాంపూ చేసుకోవాలి.