ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

ఆ స్వామి విగ్రహం నిలువెల్లా విషం - తొడ భాగంలో విభూతి పంపిణీ - PALANI MURUGAN TEMPLE HISTORY

స్వామి వారి దర్శనానికి ముందుగా రాక్షసుడికి నమస్కారం - కావడిలో పూలు, పండ్లు

palani_murugan_temple
palani_murugan_temple (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2025, 12:42 PM IST

PALANI MURUGAN TEMPLE HISTORY :సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనది పళనిలోని అరుల్‌ ముగు శ్రీ దండాయుధపాణి క్షేత్రం. తమిళనాడులోని దిండుగల్‌ జిల్లా పళనిలో కొలువైన ఈ క్షేత్రం మదురై నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఎతైన కొండలపై ఉంటుంది.

టీటీడీ మెనూలో మరో వంటకం - సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు

పురాణ గాథ

లోక సంచారి అయినటువంటి నారదుడు కైలాసాన్ని దర్శించి శివపార్వతులకు జ్ఞాన ఫలాన్ని ఇచ్చి దానిని వారిద్దరి కుమారులలో ఎవరో ఒకరికి అందించమని చెబుతాడట. అయితే, జ్ఞాన ఫలాన్ని పొందే అర్హత వినాయకుడు, కుమారస్వామిలో ఎవరికి ఉందో తెలుసుకోవడానికి కుమారులిద్దరినీ ముల్లోకాలను తిరిగి రమ్మని చెబుతారట. వెంటనే కుమార స్వామి (కార్తికేయుడు) తన నెమలి వాహనంపై లోకాల ప్రదక్షిణకు వెళ్లగా ఎక్కడికి వెళ్లినా అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడట. తిరిగి కైలాసాన్ని చేరుకున్న కార్తికేయుడు వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాల ప్రదక్షిణ పూర్తి చేశాడని జరిగిన విషయం తెలుసుకుంటాడు. దాంతో నిరాశగా కైలాసం వదిలి భూలోకం చేరుకుంటాడు. పళని ప్రదేశంలో ఎత్తైన కొండపై మౌన ముద్రలో ఉండిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పళని చేరుకుని ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని ­ఊరడిస్తాడు. సకల జ్ఞానాలకు నీవే ఫలానివి కుమారా అని పరమశివుడు బుజ్జగిస్తాడు. సకల జ్ఞాన ఫలం అంటే తమిళంలో 'పళం', నీవు అంటే 'నీ' ఈ రెండు కలిపి పళని అయ్యింది. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు తాను శాశ్వతంగా కొండపైనే కొలువుంటానని తల్లిదండ్రులను అడుగుతాడు. అందుకు సరేనని శివపార్వతులు తిరిగి కైలాసానికి వెళ్లిపోతారు.

ఆ స్వామి విగ్రహం నిలువెల్లా విషం - తొడ భాగంలో విభూతి పంపిణీ (ETV Bharat)

నవపాషాణాలతో విగ్రహం తయారీ

పళని సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని అత్యంత విషపూరితమైన నవపాషాణాలతో భోగార్‌ ముని తయారు చేయించారట. పూర్వ కాలంలో ఇక్కడ పళని స్వామి దేవతా మూర్తి తొడ భాగం నుంచి విభూతి తీసి భక్తులకు పంచడంతో స్వామి వారి విగ్రహం అరిగిపోతూ వచ్చిందట. దీంతో కొద్దికాలం తర్వాత అలా పంచడాన్ని నిలిపేయగా స్వామి వారి ఆలయాన్ని ఏడో శతాబ్దంలో కేరళ రాజు చీమన్‌ పెరుమాళ్‌ నిర్మించారు. పాండ్యులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

కావడి ఉత్సవాల విశిష్టత

ఇతిహాసయుగంలో జరిగిన దేవదానవ యుద్ధంలో చాలా మంది దానవులు చనిపోయారు. కానీ, ఇడుంబన్‌ అనే రాక్షసుడు మాత్రం తన అసుర గణాలను వదిలి సుబ్రహ్మణ్య స్వామి శిష్యుల్లో ఒకరైన అగస్త్య మహాముని పాదాక్రాంతుడవుతాడు. అప్పుడు అగస్త్య ముని ఇడుంబన్​లో అంతర్ముఖంగా ఉన్నటువంటి రాక్షస భావాలను పూర్తిగా తొలగించాలని భావిస్తాడు. ముందుగా అతడిని ఆది గురువు దక్షిణా మూర్తి, శంకరుడు ఉండే కైలాసానికి పంపించాలనుకుంటాడు. అతడిని పిలిచి 'కైలాసంలోని శివగిరి, శక్తిగిరి అనే రెండు కొండలను నేను ఎప్పటినుంచో ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాను. నువ్వు వాటిని ఒక కావిడిలో నేను ఉన్న చోటికి తీసుకురా' అని ఆజ్ఞాపిస్తాడు.

ముని ఆజ్ఞకు బద్ధుడైన ఇడుంబన్ కైలాసం వెళ్లి రెండు కొండలను కావడిలో పెట్టుకుని బయలుదేరుతాడు. పరమశివుడు అడ్డు చెప్పకుండా ఆ రాక్షసుడి అసురత్వం పోగొట్టే పని జ్ఞాన రాశి అయిన సుబ్రహ్మణ్యుడు చూసుకుంటాడని మౌనంగా ఉండిపోతాడు. ఇడుంబన్‌ సరిగ్గా పళని దగ్గరికి వచ్చే సరికి ఆ కొండలు మోయలేక కాసేపు కింద పెట్టి సేదతీరుతాడు. కాసేపటి తర్వాత కావడి ఎత్తుకుందామని ప్రయత్నించగా ఒక వైపు ఎక్కువ బరువు, ఇంకో వైపు తేలికవుతోంది. ఎంతసేపటికీ రెండువైపులా సమానం కాకపోవడంతో సుబ్రహ్మణ్య స్వామి చిన్న పిల్లాడి రూపంలో నవ్వుతూ కనిపిస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఆగ్రహంతో స్వామి వారి పైకి దూసుకెళ్లగా అప్పటికీ ఆయన నవ్వుతూనే ఉంటారు. 'నిన్ను చంపేస్తాను' అంటూ ఇడుంబన్ కొండమీదికి పరిగెత్తగా స్వామి వారు అతడిని రెండు గుద్దులు గుద్దుతారు. అప్పుడు ఇడుంబన్​కు స్వామి వారి మహిమ తెలిసి వరం కోరుకుంటాడు. కావడి వల్లనే తనకు వచ్చిన మహా అవకాశాన్ని భక్తులకు కూడా కల్పించాలని కోరుకుంటాడు. ఎవరైనా సుబ్రహ్మణ్యుడి ఆరాధన చెయ్యకపోయినా ఒక్కసారి పాలు, విభూతి, పూలు, తేనె, నెయ్యి పదార్థాలలో ఏదైనా ఒకటి కావడిలో భుజం మీద పెట్టుకొని పాదచారులై వస్తే అటువంటి వారికి ఆరాధన చేసిన ఫలితం అందివ్వాలి అని కోరుకుంటాడు. అప్పుడు స్వామి వారు కోరికను మన్నించి నా దగ్గరకు వచ్చే భక్తులంతా ముందుగా నీ దర్శనం చేసుకునే నా వద్దకు వస్తారని వరమిస్తారు. అందుకే స్వామి వారిని చేరే మార్గంలో ఇడుంబడికి భక్తులు నమస్కరించిన తరువాతే సుబ్రహ్మణ్యున్ని దర్శనం చేసుకుంటారు.

ఆలయం చేరే మార్గం

తమిళనాడులోని మధురైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిండుగల్‌ జిల్లాలో పళని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఉంది. విమానంలో హైదరాబాద్‌ నుంచి మధురై చేరుకుని అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గంలో ఆలయానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం ద్వారా హైదరాబాద్‌ నుంచి చెన్నై సెంట్రల్‌, లేదా మధురై చేరుకుని అక్కడి నుంచి కోయంబత్తూర్‌ వెళ్లే రైలు ఎక్కాలి. ఈ రైళ్లు పొల్లాచ్చి మీదుగా, పళని రైల్వేస్టేషన్‌ నుంచే వెళ్తాయి. పళని ఎక్స్‌ప్రెస్‌ తిరుచెందూర్‌ నుంచి మదురై మీదుగా వెళ్తుంది.

కాలినడక భక్తులకు కంకణాలు - 2, 3గంటల్లో శ్రీవారి దర్శనం!

శ్రీవారిని దర్శించుకున్న 2.25కోట్ల భక్తులు - హుండీ ఆదాయం ఎంతో తెలిస్తే షాక్!

ABOUT THE AUTHOR

...view details