Sweet Potato Cooking Tips :మహాశివరాత్రి పర్వదినాన శివయ్యను మనసారా ప్రార్థిస్తూ ఉపవాసాలు చేసే ఎక్కువ మంది భక్తులు తీసుకునే ఆహారాల్లో ఒకటి చిలగడ దుంప. వీటినే మొరంగడ్డ, స్వీట్ పొటాటో, గెనుసుగడ్డలు, రత్నపురి గడ్డలు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. పేరు ఏదైనా ఈ దుంపలు ఆహారప్రియులకు ఎంతో ప్రీతికరమైనవే కాకుండా ఆరోగ్యకరమైనవి కూడా. పిల్లలు నుంచి పెద్దల వరకు వీటిని చాలా ఇష్టంగా తింటుంటారు.
అయితే, చాలామంది చిలగడ దుంపల్నిఉడకబెట్టుకుని తింటుంటారు. ఇలా ఉడికించే క్రమంలో అందులో వాటర్, నూనె వంటివి యాడ్ చేసి కుక్ చేస్తారు. తద్వారా వాటిల్లో ఉండే పోషకాలు తొలగిపోయే ఛాన్స్ ఉంటుంది! అలాగే, రుచి కూడా తగ్గుతుంది. కాబట్టి, అలాకాకుండా చిలగడదుంపల్ని నీళ్లు, చుక్క నూనె లేకుండా ఉడికించుకోవచ్చని మీకు తెలుసా? లేదు అంటే ఈ స్టోరీ చదివి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు :
- చిలగడ దుంపలు - అర కేజీ
- బెల్లం తురుము - రెండున్నర స్పూన్లు
- నెయ్యి - 2 టీస్పూన్లు
- ఉప్పు - కొద్దిగా
శివరాత్రికి చిలగడదుంప తింటారా? రొటీన్‌గా ఉడకబెట్టకుండా వెరైటీగా హల్వా చేసుకోండిలా!
ఉడికించే విధానం :
- ఇందుకోసం ముందుగా చిలగడ దుంపలను ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత చేతితో రుద్దుతూ కడిగితే వాటికి ఉండే మట్టి, ఇతర మలినాలు సింపుల్‌గా తొలగిపోతాయి.
- చిలగడదుంపల్ని శుభ్రంగా కడిగిన తర్వాత వాటికి రెండు వైపులా ఉండే తొడిమలను కట్ చేసుకోవాలి. ఒకవేళ చిలగడ దుంపలు పెద్ద సైజ్‌లో ఉండి ఉడికించుకోవడానికి ఇబ్బందిగా ఉంటే చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించుకోవాలి.
- అలాగే, చిలగడదుంపలకు ఏమైనా పుచ్చులు ఉంటే వాటిని ఈ సమయంలోనే చాకుతో కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగి, చివర్లు కట్ చేసిన చిలగడదుంపలు వేసుకోవాలి. ఆపై అందులో బెల్లం తురుము, నెయ్యి యాడ్ చేసుకోవాలి.
- అలాగే, స్వీట్‌ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని అన్నీ చిలగడ దుంపలకు పట్టేలా ఒకసారి కలుపుకోవాలి.
- ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టౌపై ఉంచి లో ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆ విధంగా ఉడికించుకున్నాక కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి చూస్తే చాలు. అంతే, చుక్క నూనె, వాటర్ లేకుండా చిలగడదుంపలు చక్కగా ఉడికి ఉంటాయి.
- ఆపై వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక వీటిని పొట్టు తీయకుండా తినొచ్చు. లేదంటే పొట్టు తీసుకొని తిన్నా చాలా రుచికరంగా ఉంటాయి.
- మీరూ శివరాత్రి రోజు చిలగడదుంపలను తినాలనుకుంటే ఇలా ఉడికించి చూడండి. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు.
బంగాళాదుంపలు Vs చిలకడదుంపలు- షుగర్ పేషంట్లు ఏవి తినచ్చు?