Psychiatrist Advice on Relationship :యుక్త వయసులో ప్రేమలో పడడం ఒక మధురమైన అనుభూతి. అయితే, వివిధ కారణాల వల్ల కొంతమంది లవ్‌కి మధ్యలోనే బ్రేకప్ పడుతుంది. అలాంటి టైమ్‌లో కొందరు ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇబ్బంది పెట్టలేక మరొకరిని వివాహం చేసుకుంటుంటారు. మరికొందరు ప్రేమించిన అమ్మాయి దూరమయిందని డిప్రెషన్లోకి వెళ్లడం, సూసైడ్ చేసుకోవడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు మ్యారేజ్ తర్వాత కూడా మళ్లీ ప్రేమించిన వారితో కాంటాక్ట్‌లో ఉంటారు. ఇదే విషయం చేసుకున్న భార్యకు తెలిసి లోలోపల చాలా మదనపడుతుంటుంది. అచ్చం అలాంటి పరిస్థితే ఓ మహిళకు ఎదురైంది. ఇంతకీ ఆమె సమస్య ఏంటి? దానికి మానసిక నిపుణులు ఎలాంటి సలహా ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం.
ఇదీ సమస్య..
'నాకు వివాహం అయ్యి 20 సంవత్సరాలు. మా మ్యారేజ్కంటే ముందే ఆయనకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది. మధ్యలో విడిపోయారట. ఎలా జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు వారు మళ్లీ మాట్లాడుకుంటున్నారు. చాలాసార్లు మా వారి ఫోన్లో మెసేజ్‌లు చూశాను. ఆయన్ని ఇదే విషయం గురించి అడిగితే అది ఫ్రెండ్షిప్ మాత్రమే అంటున్నారు. పెళ్లయిన ఇన్ని సంవత్సరాలకు మళ్లీ ఈ ప్రాబ్లమ్ వస్తుందని ఊహించలేదు. నాకేమో ఆయనే ప్రపంచం. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావడం లేదు?' అంటూ మానసిక నిపుణుల సహాయం కోరుతోంది ఆ మహిళ. ఈ సమస్యకు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ మండాది గౌరీదేవి ఎలాంటి సమాధానం ఇచ్చారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
యుక్తవయసులో ఉన్నప్పుడు అమ్మాయిలూ అబ్బాయిలూ జీవిత భాగస్వాముల గురించి కలలు కంటుంటారు. ఒకరినొకరు ఇష్టపడడం, పెళ్లి గురించి ఆలోచించడం లాంటివీ జరుగుతుంటాయి. అయితే, ఒకరికొకరు సరిపోము అన్న భావన వచ్చో లేదా మరే ఇతర కారణాల వల్లనో వివాహం జరగకపోవచ్చు. అంతమాత్రాన వారిమధ్య ఏదో ఉందనుకోవడం సరికాదు అంటున్నారు డాక్టర్ మండాది గౌరీదేవి.
"మీకు మ్యారేజ్ అయి 20ఏళ్లు అయ్యిందంటున్నారు. ఈ ప్రయాణంలో మీ భర్త మిమ్మల్ని బాధపెట్టినట్లుగానో, ఇద్దరిమధ్యా గొడవలు జరిగినట్లుగానో మీరు చెప్పలేదు. ఒకవేళ మీ ఆయన చెప్పినట్లుగానే అది స్నేహమే అయిండొచ్చేమో ఒకసారి ఆలోచించండి. వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడుతుందనే భావన మీకు ఉంటే ఆవిడతో మీరు కూడా స్నేహపూర్వకంగా మాట్లాడి చూడండి. అప్పుడు నిజం ఏంటో తెలుస్తుంది." - డాక్టర్ మండాది గౌరీదేవి (మానసిక నిపుణురాలు)