తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోరూరించే "పొట్లకాయ పెరుగు పచ్చడి" - ఇలా చేసి పెట్టారంటే నచ్చని వారూ ఇష్టంగా తినడం పక్కా! - POTLAKAYA PERUGU PACHADI RECIPE

పొట్లకాయను చూసి ముఖం చాటేస్తున్నారా? - ఈ రెసిపీ చేసి పెట్టారంటే తినని వారూ మళ్లీ మళ్లీ కావాలంటారు!

HOW TO MAKE SNAKE GOURD RAITA
Potlakaya Perugu Pachadi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2024, 4:40 PM IST

Potlakaya Perugu Pachadi Recipe in Telugu :చాలా మంది అంతగా తినడానికి ఇష్టపడని కూరగాయల్లో ఒకటి పొట్లకాయ. ఇక పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, అలాంటి వారు కూడా తినే ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. పొట్లకాయ పెరుగు పచ్చడి. దీని కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన పనిలేదు. చాలా ఈజీగా, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వారు కూడా ఈ రెసిపీని తక్కువ టైమ్​లో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం, రోటీ.. దేనిలోకైనా ఇది చాలా రుచికరంగా ఉంటుంది! ఇంతకీ, ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • మెంతులు - అరటీస్పూన్
  • ఆవాలు - అరటీస్పూన్
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • మినప్పప్పు - 1 టీస్పూన్
  • శనగపప్పు - 1 టీస్పూన్
  • ఎండుమిర్చి - 2
  • కరివేపాకు - 1 రెమ్మ
  • పొట్లకాయ తరుగు - 300 గ్రాములు
  • పసుపు - పావుటీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పచ్చిమిర్చి - 4
  • అల్లం తరుగు - 1 టీస్పూన్
  • పెరుగు - అరలీటర్
  • ఉల్లిపాయ - 1(మీడియం సైజ్​ది)

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా లేత పొట్లకాయనుతీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే, ఉల్లిపాయను సన్నగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడక్కాక మెంతులు వేసుకొని కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
  • మెంతులు రంగు మారాక ఆవాలు వేసుకొని చిటపటమనిపించాలి. అప్పుడు జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని తాలింపుని ఎర్రగా వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, ఎండుమిర్చిని తుంపి వేసుకొని మరికాసేపు వేయించుకోవాలి.
  • తాలింపు మిశ్రమం మంచిగా వేగిందనుకున్నాక ముందుగా తరిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత పసుపు, ఉప్పు వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మంట మీద ముక్కలను బాగా మగ్గనివ్వాలి. ఇందుకోసం కనీసం 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు సమయం పట్టొచ్చు.
  • అలా మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి గరిటెతో కలుపుతుండాలి. లేదంటే అడుగు పట్టేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • ఆలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు పొట్లకాయ ముక్కలు బాగా మగ్గాయనుకున్నాక.. మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కలిపి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఆపై పాన్​ని దింపుకొని మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • అనంతరం ఒక మిక్సింగ్ జార్​లో పెరుగునుతీసుకొని చిక్కగా చిలుక్కోవాలి. ఆ తర్వాత అందులో పూర్తిగా చల్లారిన పొట్లకాయ కూరను వేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని మరోసారి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "పొట్లకాయ పెరుగు పచ్చడి" రెడీ!

ABOUT THE AUTHOR

...view details