How to Make Nuvvula Karam Podi :డైలీ టిఫెన్స్లోకి రకరకాల చట్నీలు ప్రిపేర్ చేసుకుంటుంటాం. కానీ.. కొన్నిసార్లు చట్నీ తయారీకి తగిన సమయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ కారం పొడి ఉంటే.. ఎలాంటి చట్నీల అవసరమే ఉండదు. ఇడ్లీ, అట్టు, ఉప్మా, దోశ.. ఇలా దేనిలోకి తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది. అదే.. "నువ్వుల కారం పొడి". దీన్ని టైమ్ ఉన్నప్పుడు ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకుంటే నెల రోజులపాటు నిల్వ ఉంటుంది! మరి.. ఆ టేస్టీ కారం పొడిని ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- తెల్ల నువ్వులు - అర కప్పు
- గుంటూరు మిర్చి - 8 నుంచి 10
- బ్యాడిగి మిర్చి - 10 నుంచి 12
- ఎండుకొబ్బరి ముక్కలు - పావు కప్పు
- మినప పప్పు - పావు కప్పు
- శనగపప్పు - పావు కప్పు
- జీలకర్ర - అర టేబుల్‌స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- వెల్లుల్లి రెబ్బలు - 15 నుంచి 20
- బెల్లం తురుము - 1 టేబుల్ స్పూన్
- చింతపండు - గోలి సైజంత
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా స్టౌపై పాన్ పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలి.
- అయితే.. నువ్వులను త్వరగా వేయించుకుంటే కారంపొడి అంత టేస్టీగా ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి.. లో-ఫ్లేమ్ మీద గరిటెతో కలుపుతూ అవి కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇందుకు సుమారు 15 నుంచి 18 నిమిషాల సమయం పట్టొచ్చు.
- ఆవిధంగా వేయించుకున్నాక నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
- తర్వాత అదే పాన్‌లో.. గుంటూరు, బ్యాడిగి ఎండుమిర్చి వేసి అవి ఒక పొంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అయితే, బ్యాడిగి మిర్చి వాడడం వల్ల కారం పొడికి మంచి రంగు, పరిమళం వస్తుంది. అలాగే.. కారం మితంగా ఉంటుంది. అదే.. మీరు కాస్త స్పైసీ ఉండాలనుకుంటే గుంటూరు మిర్చిని పెంచుకోవచ్చు.
- అనంతరం అదే పాన్‌లో.. ఎండుకొబ్బరి ముక్కలు, మినప పప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని, లో-ఫ్లేమ్‌లో లైట్ గోల్డెన్ రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత.. అందులో ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పప్పులు పూర్తిగా ఎర్రగా వేగేంత వరకు రోస్ట్ చేసుకోవాలి.
- పప్పులన్నీ ఇలా వేగడానికి 25 నుంచి 30 నిమిషాల టైమ్ పట్టొచ్చు. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మొదటగా వేయించుకొని పక్కన ఉంచుకున్న ఎండుమిర్చి, చల్లారిన పప్పుల మిశ్రమం వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత అందులో ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న నువ్వులలో రెండు చెంచాలు పక్కకు తీసి మిగతా వాటిని వేసుకోవాలి. అలాగే.. బెల్లం, చింతపండు వేసుకొని మరోసారి ఆ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- ఆవిధంగా మిక్సీ పట్టుకున్నాక చివరగా పక్కకు తీసుకున్న రెండు చెంచాల నువ్వులు అందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే.. అద్దిరిపోయే "నువ్వుల కారం పొడి" రెడీ!
- ఇలా నువ్వులు కలుపుకోవడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడా అవి పంటికి తగులుతూ కారం పొడి చాలా రుచికరంగా అనిపిస్తుంది!