Natural Remedies for Chapped Lips :ముఖానికి చిరునవ్వే అందం. ఆ నవ్వుకు మంచి రంగుతో ఉండే దొండపండు లాంటి పెదాలే స్పెషల్ ఎట్రాక్షన్. కానీ, కొన్ని పరిస్థితుల్లో ముఖ్యంగా చలికాలం లిప్స్ తేమను కోల్పోయి పొడి బారి నిర్జీవంగా కనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే, ఇదే సమయంలో కొందరిలో వాటిలో ఉండే కెమికల్స్ కారణంగా పెదాలు నల్లగా మారుతాయనే ఆందోళన ఉంటుంది. కాబట్టి, అలాకాకుండా కొన్ని నేచురల్ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా పెదాలను మృదువుగా, తాజాగా ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
వాటర్ త్రాగడం :చలికాలం చాలా మంది వాటర్ తక్కువగా తాగుతుంటారు. పెదాలు పొడిబారడానికి ఇది ఒక కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి, సీజన్ ఏదైనప్పటికీ డైలీ పగటిపూట తగినంత వాటర్ తాగాలి. ఫలితంగా బాడీ హైడ్రేటెడ్‌గా ఉండడమే కాకుండా పెదాలు పొడిబారకుండా చూసుకోవచ్చంటున్నారు.
తేనె :దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. అలాగే ఇది ఒక నేచురల్ హైడ్రేటింగ్ ఏజెంట్. కాబట్టి, లిప్స్ డ్రైగా మారినప్పుడు కొద్దిగా తేనెనునేరుగా పెదాలపై అప్లై చేసి కాసపు ఆగి వాష్ చేసుకోవాలి. దాంతో పెదాలు కోమలంగా, ఆరోగ్యంగా తయారవుతాయంటున్నారు.
కొబ్బరి నూనె : కోకోనట్ ఆయిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి డ్రై లిప్స్ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి, వింటర్లో రాత్రి పడుకునే ముందు లేదా రోజులో పలుమార్లు పెదాలకు కొబ్బరి నూనెను అప్లై చేయడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు.
నెయ్యి లేదా వెన్న :ఇవి కూడా చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీరు డ్రై లిప్స్ ఇబ్బందిపడుతున్నట్లయితే రాత్రి పడుకునే ముందుగా పెదాలపై కొద్దిగా నెయ్యి లేదా వెన్న రాయండి. ఇవి నేచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేసి పెదాలు మృదువుగా మారడంతో మంచి రంగులోకి రావడానికి తోడ్పడుతుందంటున్నారు నిపుణులు.
వేప నూనె : డ్రై లిప్స్, పగిలిన పెదాల ప్రాబ్లమ్ తగ్గించడంలో వేప నూనె కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అందుకు తోడ్పడతాయి. కాబట్టి వింటర్లో పెదాలకు వేప నూనెను వాడడం ద్వారా మంచి ప్రయోజం ఉంటుంది.