తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

కరకరలాడే మహారాష్ట్ర స్పెషల్ "కొత్తిమీర వడలు" - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా! - రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం! - KOTHIMBIR VADI RECIPE

కొత్తిమీరతో అద్దిరిపోయే ఈవెనింగ్ స్నాక్ రెసిపీ - ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!

Maharashtra Special Kothimbir Vadi
Kothimbir Vadi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2024, 10:49 PM IST

Maharashtra Special Kothimbir Vadi :చాలా వరకు మనం కొత్తిమీరను రుచికోసమో సువాసనకోసమో కూరల్లోనో, సాంబారు, రసాల్లోనో వేస్తుంటాం. నాన్​వెజ్ వంటకాల్లో అయితే ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. అలాకాకుండా ఈసారి డిఫరెంట్​గా కొత్తిమీరతో ఈ స్నాక్ రెసిపీ ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉండి ఇంటిల్లిపాది ఎంతో ఇష్టంగా తింటారు. అదే.. మహారాష్ట్ర స్టైల్ "కొత్తిమీర వడలు".

అయితే.. ఈ రెసిపీని మహారాష్ట్రలో "కొతింబిర్ వాడి" అని పిలుస్తారు. కొతింబిర్ అంటే.. కొత్తిమీరఅని అర్థం. అలాగే వాడి అంటే.. వడ అనుకునేరు కానీ అది కాదు దాని అర్థం. వాడి అంటే.. ఇక్కడ ఒక ముక్క లేదా ముద్ద అనే అర్థం వస్తుంది. అయితే, వీటిని ప్రిపేర్ చేసుకునే విధానం సగం వడలు చేసినట్లుగా ఉండడంతో తెలుగు వారి సౌకర్యం కోసం "కొత్తిమీర వడలు" అని పిలుచుకుంటుంటాం. ఇంతకీ.. ఈ సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • పల్లీలు - పావు కప్పు
  • శనగపిండి - ఒకటిన్నర కప్పు
  • ఇంగువ - పావు చెంచా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్​ స్పూన్
  • కారం - 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - తగినంత
  • ఆవాలు - అర టీస్పూన్
  • కొత్తిమీర తరుగు - ఒకటిన్నర కప్పు

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా కొత్తిమీరను కాడలతో సహా సన్నగా ఒకటిన్నర కప్పు పరిమాణంలో తరుక్కొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని పల్లీలను దోరగా వేయించుకోవాలి. ఆపై వాటిని మిక్సీ జార్​లో వేసుకొని మరీ మెత్తని పొడిలా కాకుండా కాస్త బరకగా రవ్వ మాదిరిగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం.. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, ఇంగువ, ఫ్రెష్​గా రుబ్బుకున్న అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
  • ఆపై అందులో తగినన్ని వాటర్(ఒకటిన్నర కప్పు వరకు) యాడ్ చేసుకొని శనగపిండిలో గడ్డలు ఏర్పడకుండా 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి.
  • ఆవిధంగా పిండిని బీట్ చేసుకున్నాక.. గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పల్లీల పొడిని వేసుకొని మరో రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై.. పాన్ పొట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఆవాలు వేసి చిట్లనివ్వాలి. ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న సన్నని కొత్తిమీర తరుగు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక.. అందులో బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి.
  • తర్వాత స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మిశ్రమం మొత్తం కలిసేలా గరిటెతో కలుపుతూ గట్టి చలిమిడి ముద్దలా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందుకోసం 15 నుంచి 18 నిమిషాల వరకు టైమ్ పట్టొచ్చు. కచ్చితంగా పిండి ముద్ద గట్టిగా ఉండాలి. లేదంటే.. నూనెలో వేయించుకునేటప్పుడు వడలు విరిగిపోతాయనే విషయం గుర్తుంచుకోవాలి. ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక స్టౌ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి.
  • అనంతరం ఒక స్టీల్ ప్లేట్​ను బోర్లించి ఆయిల్​ అప్లై చేసుకుని.. చల్లార్చుకున్న పిండి ముద్దను ఉంచి ముందుగా చేతితో చిన్నపాటి ఊతప్పం మాదిరిగా స్ప్రెడ్ చేసుకోవాలి.
  • ఆపై దాన్ని చేతితో స్క్వేర్ షేప్​లో అనుకొని చపాతీరోలర్ సహాయంతో ఆ మిశ్రమం అన్నీ వైపులా సమాంతరంగా ఉండేలా రోల్ చేసుకోవాలి. అయితే, మరీ పల్చగా కాకుండా కాస్త మందంగానే ఉండేలా చూసుకోవాలి.
  • ఆవిధంగా స్క్వేర్ షేప్​లో ప్రిపేర్ చేసుకున్నాక.. మీరు కావాలనుకున్న పరిమాణంలో ముందుగా కత్తితో గాట్లు పెట్టుకొని ఆ తర్వాత స్క్వేర్స్​గా కట్ చేసుకోవాలి.
  • అలా కట్ చేసుకున్నాక.. ఒక్కొక్క పీస్ తీసుకొని మరోసారి వాటి అంచులను చేతితో తట్టండి. ఇలా అంచులను టాప్ చేసుకోవడం ద్వారా ఎక్కడైనా కొత్తిమీర కారణంగా బయటకు తేలినటువంటి రంధ్రాలు ఉంటే మూసుకుపోతాయి.
  • ఇప్పుడు స్టౌపై.. పాన్ పెట్టుకొని వేయించుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక.. ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడీలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి.
  • ఆపై స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వాటిని జల్లీ గంటెలోకి తీసుకొని కాసేపు ఉంచి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే మహారాష్ట్ర స్పెషల్ "కొత్తిమీర వడలు" రెడీ!

ఇవీ చదవండి :

ఎప్పుడైనా "టమాటా బజ్జీలు" తిన్నారా? - ఇలా ఓసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి! - మళ్లీ మళ్లీ కావాలంటారు!

"మసాలా వడ" అద్దిరిపోయే స్నాక్ - ఇలా చేస్తే సూపర్ క్రిస్పీగా వస్తుంది!

ABOUT THE AUTHOR

...view details