IRCTC Maha Kumbh Punya Kshetra Yatra :ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అతి పెద్దది కుంభమేళా. కుంభమేళా సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేయడం ముక్తి, మోక్ష మార్గమని చాలా మంది భక్తులు విశ్వసిస్తారు. కుంభమేళాలో పవిత్ర స్నానంతో మనస్సు, ఆత్మ శుద్ధి అవుతుందని నమ్ముతారు. అందుకే కొన్ని లక్షల మంది భక్తులు పవిత్ర గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడానికి వస్తుంటారు. మరి మీరు కూడా కుంభమేళాకు వెళ్దామనుకుంటున్నారా? అయితే అందుబాటు ధరలోనే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అవకాశం కల్పిస్తోంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా కుంభమేళాతో పాటు వారణాసి, అయోధ్య చూసేందుకు అవకాశం కల్పిస్తోంది. మరి ఈ యాత్ర ఎప్పుడు మొదలవుతుంది? ధర ఎంత? ఏయే ప్రదేశాలు చూడొచ్చు? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
"మహా కుంభ పుణ్యక్షేత్ర యాత్ర" పేరుతో ఐఆర్సీటీసీ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు ఉంటుంది. ఈ టూర్ హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు. టూర్ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి ఇదే స్టేషన్లలో దిగొచ్చు.
ప్రయాణం ఇలా సాగుతుంది:
- మొదటి రోజున మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా మహా కుంభ పుణ్యక్షేత్ర యాత్ర ప్రారంభమవుతుంది. భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోటలో రైలు ఎక్కొచ్చు.
- రెండో రోజు తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా ప్రయాణించి మూడో రోజు ఉదయం 8 గంటలకు వారణాసి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి అక్కడ చెకిన్ అయ్యి లంచ్ పూర్తి చేస్తారు. సాయంత్రం గంగా హారతి వీక్షించి.. ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
- నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ప్రయాగరాజ్ బయలుదేరుతారు. అక్కడ ప్రయాగరాజ్‌లోని హోటల్లో చెకిన్ అయిన తర్వాత లంచ్ ఉంటుంది. ఆ తర్వాత కుంభమేళా దగ్గరకు వెళ్తారు. ఆ రోజంతా అక్కడే ఉండి ఆ రాత్రికి ప్రయాగరాజ్‌లోని టెంట్ సిటీలో స్టే చేస్తారు.
- ఐదో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత వారణాసి బయలుదేరుతారు. అక్కడ హోటల్లో చెకిన్ అయిన తర్వాత కాశీ విశ్వనాథ్, కాశీ విశాలక్ష్మీ, అన్నపూర్ణ దేవి ఆలయాలను దర్శించుకుంటారు. ఆ రాత్రికి అక్కడే డిన్నర్ చేసి స్టే చేస్తారు.
- ఆరో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి అయోధ్యకు బయలుదేరుతారు. అక్కడ శ్రీరామ జన్మభూమి, హనుమాన్ ఆలయాలను దర్శించుకుంటారు. ఆ రాత్రికి అయోధ్య నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ఆ రాత్రి ప్రయాణం ఉంటుంది.
- ఏడో రోజు మొత్తం ప్రయాణం ఉంటుంది.
- ఎనిమిదో రోజు విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం, భువనగిరి మీదుగా సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.