KALIVI KODI IN TIRUMALA FOREST :అత్యంత అరుదైన కలివి కోడి (జార్డన్స్ కోర్సర్) శేషాచలం అటవీ ప్రాంతంలో జీవిస్తున్నట్లు 'ఐసర్' పరిశోధన శాస్త్రవేత్త వీరల్ జోషి వెల్లడించారు. తిరుపతిలోని IISER (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్)లో నిర్వహించిన 'బర్డ్ అట్లాస్-2' వేడుకల్లో ఆయన మాట్లాడుతూ శేషాచలం అటవీప్రాంతంలో కలివి కోడి ఉన్నట్లు కచ్చితమైన ఆధారాలు లభ్యమయ్యాయన్నారు. వేర్వేరుగా మొత్తం 6 ప్రాంతాల్లో ఆధారాలు దొరికాయని, మరో 12 ప్రాంతాల్లో కలివి కోడి తిరిగిన ఆనవాళ్లు గుర్తించామని వివరించారు. రాత్రివేళలో మాత్రమే కనిపించే అరుదైన ఈ పక్షి పొదల్లో దాగి ఉంటుందని, ఎగరలేదని తెలిపారు. పాదముద్రలు, అరుపుల ఆధారంగా మాత్రమే వీటిని గుర్తించాల్సి ఉంటుందని చెప్పారు.
రూ.40కోట్లు పలికిన 'నెల్లూరు ఆవు' - బహిరంగ వేలంలో ప్రపంచ రికార్డు
కలివి కోడి విశేషాలు
- కలివికోడి శాస్త్రీయ నామం 'జోర్డాన్ కొర్సర్'
- ఇది కంజు పక్షిలాగా కనిపించినా వాటికంటే పెద్దగా ఉంటుంది.
- 27 సెంటీ మీటర్ల పొడవైన ఈ పక్షి కూత 200 మీటర్ల దాక వినిపిస్తుందట.
- కలివి కోళ్లు ఎత్తైన ముళ్ల పొదల్లో నివాసం ఉంటాయి.
- గులకరాళ్లను సేకరించి వాటి మధ్యలో గుడ్లు పెడతాయి.
- ఇవి ముదురు గోధుమ రంగు, పొడవాటి కాళ్లు కలిగి ఉంటాయి.
- మెడలో వెండి గొలుసులు వేసుకున్నట్లుగా రెండు తెల్లటి చారలు ఉంటాయి.
- ఇతర పక్షుల మాదిరిగా ఇవి ఎగరలేవు.
- పగటిపూట నిద్ర, రాత్రి ఆహార సేకరణ వీటి లక్షణం
కోట్ల వ్యయం
వైఎస్సార్ కడప జిల్లాలోని నల్లమం, శేషాచలం కొండలు కలిసే బద్వేలు ప్రాంతాన్ని లంకమల అంటారు. ఈ ప్రాంతంలోనే సరిగ్గా 20ఏళ్ల కిందట చివరిసారిగా కలివి కోడి కనిపించింది. రాత్రిళ్లు మాత్రమే తిరిగే పక్షి కావడంతో నిశాచర పక్షి అని పిలుస్తుంటారు. దీని కూత 'ట్విక్ టూ, ట్విక్ టూ' అన్నట్లుగా ఉంటుందట. దాదాపు 200 మీటర్ల దూరం వరకు వినిపిస్తుందట. కలివి కోడి జాతి పూర్తిగా అంతరించిపోయిందని పక్షిశాస్త్ర నిపుణులు తేల్చగా శేషాచలం అడవుల్లో ఉన్నట్లు తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్సార్ జిల్లా రెడ్డిపల్లి సమీపంలోని చిట్టడవుల్లో వీటి జాడ కనిపించడంతో లంకమల్లేశ్వర అభయారణ్యం పేరిట 3 వేల ఎకరాలను రూ.28 కోట్లతో సేకరించి 177 కెమెరాలతో పరిశోధకులు అన్వేషిస్తున్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.50 కోట్ల వ్యయంతో రెండేళ్ల పాటు అలుపెరగని ప్రయత్నాలు జరిపినా ఫలితం కనిపించలేదని ఎస్వీ వర్సిటీ జువాలజీ విభాగం గతంలో వెల్లడించడం గమనార్హం.