Poha Dhokla Recipe in Telugu : అటుకులతో ఎప్పుడంటే అప్పుడు కమ్మటి పోహా చేసుకుని తింటుంటాం. అలాగే అటుకులతో కేసరి, దోశ వంటివి కూడా చేస్తుంటారు కొందరు. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కొత్తగా పోహా డోక్లా చేసేయండి. ఈ అటుకుల డోక్లా మెత్తగా ఎంతో రుచికరంగా ఉంటుంది. పోహా డోక్లా ఉదయం బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా, ఈవెనింగ్ స్నాక్స్‌గా కూడా చేసుకోవచ్చు. పైగా ఈ డోక్లా చేయడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టదు! మరి, సింపుల్‌గా పోహా డోక్లా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- అటుకులు - కప్పు
- ఉప్మా రవ్వ - అరకప్పు
- చిలికిన పెరుగు - అరకప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- వాటర్ - సరిపడా
- వంటసోడా - చిటికెడు
- పచ్చిమిర్చి - 4
- అల్లం ముక్కలు - 2
తాలింపు కోసం :
- నూనె - రెండు టేబుల్ స్పూన్లు
- ఆవాలు - టీస్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ విధానం :
- ముందుగా ఒక బౌల్లోకి అటుకులు తీసుకుని శుభ్రంగా రెండుసార్లు కడగండి. ఆపై అటుకులు నీరు లేకుండా వడకట్టి మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. వీటిని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి.
- ఆపై అటుకుల మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి.
- ఇప్పుడు అటుకుల మిశ్రమంలో పెరుగు, ఉప్మా రవ్వ, పచ్చిమిర్చి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. తర్వాత పిండిలో నీళ్లు కలుపుకుంటూ ఇడ్లీ పిండిలా తయారు చేసుకోండి.
- చివర్లో వంటసోడా కలిపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలు అలా వదిలేయండి.
- ఇప్పుడు డోక్లా చేయడం కోసం స్టవ్‌పై పెద్ద గిన్నె పెట్టండి. ఇందులో 2 గ్లాసుల నీరు పోసి చిన్న స్టాండ్ వంటిది పెట్టండి.
- ఈలోపు అటుకుల మిశ్రమాన్ని స్టీల్ ప్లేట్ లేదా కేక్ పాన్‌లో నూనె రాసి సర్దండి.
- దీనిని పెద్ద గిన్నెలో ఉంచి మూతపెట్టండి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి 15 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. ఓ 5 నిమిషాల తర్వాత అటుకుల డోక్లా బయటకు తీయండి.
- ఇప్పుడు తాలింపు కోసం చిన్న గిన్నె పెట్టండి. ఇందులో నూనె వేసి వేడి చేయండి. ఆపై ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి.
- తాలింపు వేగాక అటుకుల డోక్లాలో వేసుకోండి. కత్తి సహాయంతో చిన్నచిన్న ముక్కలుగా కోసి సర్వ్ చేసుకుంటే టేస్టీ అటుకుల డోక్లా మీ ముందుంటుంది.
- ఈ అటుకుల డోక్లా నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ట్రై చేయండి.
పెసర్లు నానబెట్టడం, రుబ్బడం అవసరం లేదు! -ఈ పొడితో ఎప్పుడైనా "కమ్మటి పెసరట్టు" వేసుకోవచ్చు!
అద్దిరిపోయే చిట్టిచిట్టి "పెసర పునుగులు" - ఈ అల్లం చట్నీతో తింటే టేస్ట్ అదుర్స్!