How to Wash Silk Saree at Home : పెళ్లి, ఏదైనా ఫంక్షన్‌కి వెళ్తే తప్పకుండా పట్టు చీర కట్టుకుంటారు చాలా మంది మహిళలు. అయితే, పట్టు చీర కట్టిన తర్వాత కొందరు తెలిసో తెలియకో చీరలను నార్మల్ వాష్ చేసేస్తుంటారు. దీనివల్ల వాటి నాణ్యత దెబ్బతినడంతోపాటు, మెరుపు కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా పట్టు చీరల విషయంలో కొన్ని టిప్స్ పాటించాలని సూచిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం.
డ్రై క్లీనింగ్:
చాలా మంది పట్టు చీర ఒక్కసారి కట్టగానే డ్రై క్లీనింగ్‌కు ఇస్తుంటారు. వాటిని ఒక్కసారి కట్టిన వెంటనే కాకుండా మూడు, నాలుగు సార్లు ధరించిన తర్వాత క్లీనింగ్‌కి ఇస్తే మంచిది. ఇలా చేయడం వల్ల వాటి నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే వాటి మెరుపు ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. అయితే, కొన్ని ఖరీదుగల సిల్క్ చీరలను మొదటి సారి డ్రైవాష్‌కి ఇవ్వాలి. ఆ తర్వాత నుంచి ఇంట్లో మీరు శుభ్రం చేసుకోవచ్చు.
లిక్విడ్‌లతో :
ప్రస్తుతం మార్కెట్‌లో దుస్తులు శుభ్రం చేసేందుకు రకరకాల లిక్విడ్ సోప్‌లు లభిస్తున్నాయి. నూలు వస్త్రాలకు వాటిని నేరుగా ఉపయోగించవచ్చు. కానీ కొత్తవాటికీ ముందుగా చీర లోపలి భాగాన్ని లిక్విడ్ వేసిన వాటర్లో ముంచి పరీక్షించండి. దానివల్ల ఏ ఇబ్బందీ లేదనిపిస్తేనే మొత్తం చీరకు వాడండి. చాలా మంది డిటర్జెంట్ పౌడర్, షాంపూలతో కొత్త చీరలను శుభ్రం చేస్తుంటారు. అలా చేసినప్పుడు గాఢత తక్కువగల ప్రొడక్ట్స్ ఎంచుకోండి.
మెరిసేదంతా బంగారం కాదండీ! - ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే బెస్ట్!
చేత్తోనే మేలు :
షిఫాన్, జార్జెట్ చీరలను డెలికేట్ వాష్ మోడ్‌లో పెట్టి వాషింగ్ మెషిన్‌లో వేయొచ్చు. కానీ నాణ్యత, ఎంబ్రాయిడరీ, రంగులు తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కొత్త చీరలు వేటినైనా చేత్తో ఉతికేందుకే ప్రాధాన్యం ఇవ్వండి.
రంగులు పోకుండా :
ఎక్కువగా కాటన్ చీరలు నీళ్లలో ముంచగానే రంగు వదులుతాయి. అలా కాకుండా ఒక బకెట్‌లో కళ్లుప్పు వేసి కరిగించాలి. ఆపై దాంట్లో పది నిమిషాలు దుస్తులు ఉంచిన తర్వాత వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల చీరల పైన ఎక్కువగా ఉన్న రంగు పోతుంది. తర్వాత నుంచి ఇక చీరలు రంగు వదలవు.
ఐరన్ ఇలా చేయండి!
ఎప్పుడైనా సరే పట్టు చీరల్ని ఐరన్ చేసేటప్పుడు ఐరన్‌బాక్స్ ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు. తక్కువ ఉన్నప్పుడే వాటిపై ఏదైనా క్లాత్ లేదా పేపర్ వేసి మెల్లిగా చీరలను ఐరన్ చేయాలి. అంతేకానీ, నేరుగా ఐరన్ చేస్తే పట్టు దెబ్బతింటుందని గుర్తుంచుకోండి.
మరికొన్ని చిట్కాలు!
- కొన్నిసార్లు ఏదైనా వేడుకకి హజరైనప్పుడు పట్టు చీరలను కొంత సమయం మాత్రమే కట్టుకుంటారు. వీటిని వాష్ చేయకుండా కాసేపు నీడలో ఆరబెట్టాలి. అనంతరం మడత పెట్టి దాచుకోవచ్చు. ఫలితంగా ఎక్కువ కాలం మన్నుతాయి.
- అలాగే రకరకాల రంగుల పట్టు చీరలను ఒకటే బకెట్‌లో ఉంచి ఎప్పుడూ వాష్ చేయకూడదు. దీనివల్ల ఒకదాని కలర్ ఇంకొక దానికి అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి, చీరలను విడిగా బకెట్లో నానబెట్టి ఉతకండి.
- అనుకోకుండా కొత్త చీరలపై ఏవైనా మరకలు ఉంటే ఆ ప్రాంతం వరకే క్లీన్ చేయాలి. అలా కాకుండా చీర మొత్తాన్ని ప్రతిసారీ వాష్ చేస్తే రంగు, నాణ్యత రెండూ దెబ్బతింటాయి.
- పట్టు చీరలను డైరెక్ట్‌గా ఎండలో ఆరబెట్టకూడదు. వాటిని వాష్ చేసిన తర్వాత నీటిని తీసేందుకు ఎక్కువగా మెలితిప్పడం, పిండడం వంటివి చేయొద్దు. దీనివల్ల అవి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది.
- ఈ టిప్స్ పాటించడం ద్వారా మీ పట్టు చీరలను ఎక్కువ రోజులు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బంగాళాదుంపలతో కమ్మటి కూరలే కాదు! - ఇలా ఇంట్లోని వస్తువులనూ మెరిపించవచ్చు!
అమ్మాయిలూ- ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ రోజూ ఉపయోగించకూడదట! అవేంటో తెలుసా?