తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఇడ్లీ/దోశ పిండి బాగా పులిసిపోయిందని పారేస్తున్నారా ? - ఇలా చేస్తే తాజాగా మారిపోతుంది! - Sour Idli Batter Use Tips - SOUR IDLI BATTER USE TIPS

How To Use Sour idli batter : ఇడ్లీ/దోశ పిండి బాగా పులిసిపోయిందని బయట పారేస్తున్నారా ? అయితే, ఈ కథనం మీ కోసమే! ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలు కలపడం వల్ల పిండిని ఎంచక్కా ఉపయోగించవచ్చని మీకు తెలుసా ? అదేలాగో ఇప్పుడు చూద్దాం.

idli batter
How To Use Sour idli batter (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 4:53 PM IST

Tips To Use Sour Idli Batter :టైమ్‌ లేకపోవడంతోనో, పదే పదే చేయడానికి ఓపిక లేకనో ఎక్కువ మంది మహిళలు వారం రోజులకి సరిపడా ఇడ్లీ, దోశ పిండి రుబ్బి ఫ్రిడ్జ్​లో స్టోర్​ చేసుకుంటారు. అయితే, ఇలా పిండి ఫ్రిడ్జ్​లో పెట్టినా కూడా కొన్నిసార్లు పులిసిపోతుంది. దీంతో చాలా మంది దానిని బయట పడేస్తుంటారు. మీరు కూడా ఇలానే ఇడ్లీ/దోశ పిండి బాగా పులిసిపోయిందని పారేస్తున్నారా ? అయితే, ఒక్క నిమిషం ఆగండి. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా పులిసిపోయిన ఇడ్లీ/దోశ పిండిని చక్కగా ఉపయోగించవచ్చు. ఆ టిప్స్​ ఏంటో ఇప్పుడు చూద్దాం.

అల్లం, పచ్చిమిర్చి పేస్ట్:​
ఇడ్లీ పిండి పులిసిపోతే దానిని వృథాగా పారేయకుండా అందులో కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి పేస్ట్​ కలపండి. దీనివల్ల పిండి పులుపు కొంత తగ్గుతుంది. అల్లం, పచ్చిమిర్చిలోని కొన్ని రకాల సమ్మేళనాలు పిండి పులుపును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ చిట్కాని మీరు దోశ పిండికి కూడా ఉపయోగించవచ్చు.

చక్కెర లేదా బెల్లం కలపండి :
పులిసిన ఇడ్లీ లేదా దోశ పిండిని ఉపయోగించే ముందు ఒక స్పూన్​ చక్కెర లేదా బెల్లం కలపండి. దీనివల్ల అవి చాలా రుచికరంగా వస్తాయి.

బియ్యం పిండి :
ఇడ్లీ పిండి బాగా పులిసిపోయినట్లుగా అనిపిస్తే.. ఈ సారి అందులో కాస్త బియ్యం పిండి యాడ్​ చేయండి. ఇలా చేయడం వల్ల పులుపు తగ్గుతుంది. బియ్యం పిండి కలపడం వల్ల రుచి తగ్గుతుందని కొంతమంది అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయి.

ఫ్రెష్​ పిండి కలపండి :
మీ దగ్గర ఫ్రెష్​ ఇడ్లీ లేదా దోశ పిండి ఉంటే దీనిని కాస్త పులిసిన పిండిలో కలపండి. ఇలా చేయడం వల్ల కూడా పిండిని వృథా కాకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ చిట్కాలు పాటిస్తే ఇడ్లీ/దోశ పిండి ఎక్కువగా పులియకుండా ఉంటుంది :

  • ఉప్పు అధికంగా ఉపయోగించడం వల్ల పిండి ఎక్కువగా పులుస్తుంది. కాబట్టి, ఉప్పు రుచికి సరిపడా మాత్రమే వాడాలని నిపుణులు చెబుతున్నారు.
  • టెంపరేచర్​ ఎక్కువగా ఉన్నప్పుడు పిండి నాలుగ్గంటల్లోనే పులిసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రి బయటే ఉంచకుండా.. మధ్యమధ్యలో పిండిని చెక్‌ చేస్తుండాలి. అదే చల్లటి వాతావరణం ఉన్నప్పుడు గంటలు గడిచినా అది పులవదు. అయితే, పిండి రెండింతలైందంటే అది చక్కగా పులిసినట్లు లెక్క. కాబట్టి, అప్పుడు పిండిని తీసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది.
  • పిండి బాగా కూల్​గా ఉందనో లేదంటే దోశలు వేయాలనుకున్న ప్రతిసారీ తీసి బయటపెట్టడం ఎందుకనో.. కొంతమంది నిద్ర లేవగానే పిండి గిన్నెను ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి బయట పెడుతుంటారు. దీనివల్ల కూడా పిండి ఎక్కువగా పులిసే ప్రమాదం ఉందట. కాబట్టి పిండిని అవసరమున్నప్పుడే ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • మోతాదుకు మించి మినప్పప్పు ఉపయోగించినా.. పిండి అధికంగా పులిసే అవకాశం ఉంటుందట! ఎందుకంటే మినప్పప్పు పులిసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కాబట్టి మినప్పప్పు ఎక్కువగా వేయకుండా చూసుకోవాలి.
  • మనం దోశలు రుచిగా, మృదువుగా రావడానికి మెంతులు వాడుతుంటాం. అయితే, ఇవి ఎక్కువగా వేయడం వల్ల కూడా పిండి అధికంగా పులిసిపోతుంది. కాబట్టి, వీటిని తక్కువగా ఉపయోగించండి.
  • ఈ చిట్కాలు పాటించడం వల్ల పిండి ఎక్కువగా పులిసిపోకుండా చూసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి :

ఫ్రిడ్జ్‌లో పెట్టినా ఇడ్లీ/దోశ పిండి పులిసిపోతుందా ? - ఈ టిప్స్‌ పాటిస్తే సరి - పైగా టేస్టీ కూడా!

ఇడ్లీల కోసం పప్పు రాత్రంతా నానబెట్టాల్సిన పనిలేదు! - అప్పటికప్పుడు దూదిలాంటి మెత్తటి ఇడ్లీలు చేసేయండి!

ABOUT THE AUTHOR

...view details