How To Remove Stains From Clothes: మనం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న దుస్తులపై మరకలు పడితే చాలా బాధ పడతాం. ఇందులో కొన్ని మరకలు ఉతికితే పోతాయి గానీ.. మరికొన్ని మాత్రం ఎంత ప్రయత్నించినా వదలవు. అయితే.. ఈ చిట్కాలు ప్రయత్నిస్తే ఎలాంటి మొండి మరకనైనా ఈజీగా వదిలించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం..? ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
- మనకు అనుకోకుండా దెబ్బలు తగిలినప్పుడు ఆ రక్తం దుస్తుల మీద పడుతుంది. ముఖ్యంగా మహిళలు అయితే పీరియడ్స్ టైమ్‌లో ఈ మరకలు సాధారణంగానే అంటుతాయి. వీటిని వదిలించడానికి.. హైడ్రోజన్ పెరాక్సైడ్ బాగా పనిచేస్తుందట. రక్తం మరక మీద హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి నానబెట్టిన తర్వాత డిటర్జెంట్ సోప్‌తో ఉతికితే మరకలు పోతాయని నిపుణులు చెబుతున్నారు.
- మనం వివిధ పనులు చేసే సమయంలో దుస్తులపై ఇనుప తుప్పు మరకలు పడుతుంటాయి. ఇలాంటప్పుడు అర బకెట్ నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ పొడి ఉప్పు వేసి దుస్తులను నానబెట్టాలట. ఆ తర్వాత మరకలపై నిమ్మరసం వేసి డిటర్జెంట్ సబ్బుతో బాగా ఉతికితే మరకలు పోతాయని నిపుణులు చెబుతున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా తుప్పు మరకలను తొలగించడానికి బాగా పనిచేస్తుందని వివరించారు.
- తినేటప్పుడు పొరపాటున వివిధ ఆహార పదార్థాలు బట్టలపై పడుతుంటాయి. ఇలానే కెచప్ మరక పడితే దాన్ని డిటర్జెంట్‌తో ఉతికితే సరిపోతుందని.. బ్రష్‌ను ఉపయోగించి మరక ఉన్న చోట రుద్దితే మరక వెంటనే తొలగిపోతుందని అంటున్నారు. చాక్లెట్ మరకలు పడితే బట్టల సోడా కలిపిన నీటిలో మరకను నానబెట్టి.. తర్వాత డిటర్జెంట్‌తో ఉతికితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
- ఇంకా పచ్చడి మరకలు పడితే వెనిగర్ లేదా నిమ్మరసంలో మరకను ముంచి కాసేపు ఉంచి.. ఆ తర్వాత డిటర్జెంట్‌తో క్లీన్ చేస్తే సరిపోతుందని నిపుణలు తెలిపారు.
- ఒకవేళ దుస్తులపై లిప్ స్టిక్ మరకలు పడితే దానిపై గ్లిజరిన్ రాసి అరగంట తర్వాత ఉతకాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మరక సులభంగా పోతుందని వివరించారు. మరకలపై నిమ్మకాయ ముక్కను రుద్దడం వల్ల ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
- విద్యార్థులు, ఉద్యోగులు విధులు నిర్వర్తించే క్రమంలో బట్టలపై ఇంక్ మరకలు పడుతుంటాయి. ఇలాంటప్పుడు మరకలపై పేపర్ టవల్‌తో అద్ది, తర్వాత హెయిర్ స్ప్రే చల్లి.. కాసేపటి తర్వాత ఉతికితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
NOTE:పైన పేర్కొన్న అంశాలు పలువురు నిపుణులు, పరిశోధనలు ప్రకారం అందించినవే. వీటిని పాటించడం, పాటించకపోవడం వారి వ్యక్తిగత విషయం.