Pachi Mirchi Karam Podi Recipe in Telugu:మనకు ఎండు మిర్చి కారం పొడి తెలుసు. నల్ల కారం పొడి తెలుసు. హోటల్లో దొరికే కారం పొడి కూడా తెలుసు. కానీ.. పచ్చి మిర్చికారం పొడి గురించి మీకు తెలుసా? ఇది సరికొత్తగా ఉండడమే కాదు.. టేస్ట్ కూడా అంతకు మించి అనేలా ఉంటుంది. ఈ కారం పొడి అన్నంలోగానీ లేదా ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్లలో గానీ అద్దిరిపోతుంది. ఒక్కసారి తయారు చేస్తే సుమారు 20 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే మాత్రం 2 నెలల వరకు టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం..? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానమేంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
- ఒక కప్పు పుట్నాలు
- పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు
- ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర
- 15 పచ్చిమిరపకాయలు
- 2 టేబుల్ స్పూన్ల నూనె
- ఒక కప్పు కరివేపాకు
- పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు
- రుచికి సరిపడా ఉప్పు
తయారీ విధానం
- ముందుగా పచ్చిమిరపకాయల తొడిమలు తీసి శుభ్రంగా కడిగి.. తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి.
- ఆ తర్వాత కరివేపాకును శుభ్రంగా కడిగి నీరు ఆరిపోయేంతవరకు గాలికి ఆరబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెను పెట్టుకుని అందులో పుట్నాలు వేసి లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. (రంగు మారకుండా ఓవర్‌గా రోస్ట్ కాకుండా చూసుకోవాలి)
- అనంతరం ఎండు కొబ్బరి ముక్కలు లో-ఫ్లేమ్‌లో వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- గిన్నె వేడిగా ఉన్న సమయంలోనే స్టౌ ఆఫ్ చేసుకుని జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. (స్టౌ ఆన్ చేసి వేయించుకుంటే టేస్ట్ మారిపోతుంది)
- ఇప్పుడు మిక్సీలో ఎండు కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పుట్నాలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి, పుట్నాలు- జీలకర్ర పొడి, ఉప్పును వేసి బాగా కలపాలి.
- ముందుగా ఆరబెట్టుకున్న పచ్చి మిర్చిని మీడియం సైజులో ముక్కలు చేసుకోవాలి.
- మరోవైపు స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె పోసి వేడి చేసుకోవాలి.
- నూనె వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేసి లో ఫ్లేమ్‌లో క్రిప్సీగా రంగు మారేంతవరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకుని క్రిప్సీగా అయ్యేవరకు లో ఫ్లేమ్‌లోనే వేయించుకుని స్టౌ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీలో వెల్లుల్లిని వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇందులోనే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి- కరివేపాకు మిశ్రమాన్ని వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిలో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే పచ్చి మిర్చీ కారం పొడి రెడీ.
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అద్దిరిపోయే రెసిపీ - తమిళనాడు స్పెషల్ "గుంట పొంగనాలు" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!
బ్యాచిలర్ మటన్ పులావ్ కుక్కర్లో!- వంటరాని వారు కూడా చేసుకోవచ్చు