How to Make Tasty Upma at Home:ఉప్మా - ఈ పేరు చెప్పగానే చాలా మంది ముఖాల్లో చిరాకు కనిపిస్తుంది. ఇక ఇంట్లో అమ్మ చేస్తానంటే వద్దని ఇల్లు పీకి పందిరి వేస్తారు. కారణం ఉప్మా ముద్దలాగా ఉండి, తింటుంటే నాలుకకు అతుక్కున్నట్లు ఉంటుందని భావిస్తుంటారు. అయితే ఉప్మా ముద్దలాగా కాకుండా పొడిపొడిగా, తిన్న కొద్దీ తినాలనిపించే విధంగా ఉండాలంటే అందుకు కొన్ని సీక్రెట్ టిప్స్ పాటించాలి. అప్పుడు ఉప్మా వద్దన్న వారే వారంలో రెండు మూడు సార్లు చేయమని గోల చేస్తుంటారు. మరి ఉప్మాను ఎలా చేయాలి? అందుకు కావాల్సిన పదార్థాలు, ఉప్మా పర్ఫెక్ట్గా రావాలంటే పాటించాల్సిన టిప్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- బొంబాయి రవ్వ - 1 గ్లాస్
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 2
- టమాట - 1
- అల్లం ముక్క- చిన్నది
- కరివేపాకు - 2 రెమ్మలు
- పల్లీలు - పావు కప్పు
- జీడిపప్పు - 10
- నూనె లేదా నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- ఆవాలు, జీలకర్ర - 1 టీ స్పూన్
తయారీ విధానం:
- ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, టమాటలను సన్నగా కట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి.
- ఈలోపు మరో స్టవ్ మీద గిన్నె పెట్టి నీరు మరిగించుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ రవ్వకు రెండు గ్లాసుల నీరు తీసుకోవాలి. ఒకవేళ మీకు ఉప్మా కొంచెం జారుగా కావాలనుకుంటే మరికొన్ని నీళ్లు యాడ్ చేసుకోవచ్చు.
- ఇలా వేయించుకున్న రవ్వను ఓ ప్లేట్లోకి తీసుకుని అదే పాన్‌లో నెయ్యి లేదా నూనె వేసి పల్లీలు వేయించుకోవాలి.
- పల్లీలు వేగిన తర్వాత వాటిని తీసి జీడిపప్పు వేయించుకోవాలి. ఇలా రెండింటిని వేయించుకుని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో మరికొంచెం నెయ్యి పోసి ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి ఓ నిమిషం పాటు వేయించుకోవాలి.
- ఆ తర్వాత టమాట ముక్కలు వేసి మరికొంచెం సేపు మగ్గించుకోవాలి. టమాట ముక్కలు ఉడికిన తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరో నిమిషం పాటు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత మరిగించుకున్న నీటిని పోసుకోవాలి. నీరు పొంగుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి.
- నీరు మసులుతున్నప్పుడు వేయించుకున్న రవ్వను కొద్దికొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి.
- రవ్వ ఉడుకుతున్నప్పుడు వేయించిన పల్లీలు, జీడిపప్పు వేసి రవ్వను పూర్తిగా ఉడికించుకోవాలి. ఆపైన కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి.
- ఉప్మా పూర్తయ్యే సమయంలో చివరగా పైన నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఓ 5 నిమిషాల తర్వాత పల్లీ చట్నీ లేదా మామిడికాయ పచ్చడితో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఉప్మా రెడీ.