How to Make Sajja Vadalu :సిరి ధాన్యాలతో ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతుంటారు. కానీ.. వాటిని తినడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్లు సిరి ధాన్యాలతో తీయని వడలు ఇలా తయారు చేసుకోండి. మిలెట్స్‌తో "తీయని వడలా" ఎలా అని ఆలోచిస్తున్నారా? సజ్జలతో అండి. ఈ స్టోరీలో చెప్పిన విధంగా సజ్జలతో వడలు చేసుకుంటే.. ఎంతో రుచికరంగా వస్తాయి. మరి, ఇక ఆలస్యం ఎందుకు? కమ్మని సజ్జ వడలు చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- సజ్జలు- కేజీ
- బెల్లం-అరకేజీ
- యాలకులు-20
- ఎండుకొబ్బరి -1
- నీరు -సరిపడా
- నూనె-సరిపడా
తయారీ విధానం :
- ముందుగా సజ్జలను శుభ్రంగా నీటిలో కడగాలి. తర్వాత వాటిని పొడి వస్త్రంపై వేయాలి. పూర్తిగా ఆరనివ్వాలి.
- ఇప్పుడు సజ్జలనుమిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మొత్తం సజ్జ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు ఎండుకొబ్బరిని చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై మిక్సీ గిన్నెలో కొబ్బరి ముక్కలు, యాలకులు వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.
- కొబ్బరి పొడిని సజ్జ పిండిలో వేసుకుని బాగా మిక్స్ చేయాలి.
- ఆ తర్వాత స్టౌపై కడాయి పెట్టి బెల్లం వేసి, గ్లాసు నీరు పోయండి. బెల్లం కరిగిన తర్వాత పాకం పూర్తిగా చల్లారనివ్వండి.
- ఆపై పాకం జాలి గరిటె సహాయంతో సజ్జ పిండిలో పోసుకుని కలుపుకోండి.
- వడలు చేయడం కోసం పిండిలో అవసరమైనంత నీరు పోసుకుంటూ.. పిండిని పూర్తిగా కలుపుకోవాలి. (వడల కోసం పిండి మరీ గట్టిగా కాకుండా.. పల్చగా లేకుండా ఉండాలి.)
- ఇప్పుడు స్టౌపై వడలు ఫ్రై చేయడం కోసం ముకుడు పెట్టండి.
- ఇందులో సరిపడా ఆయిల్ పోసి వేడి చేయండి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని వడలు చేసుకోండి.
- వీటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేయండి. స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వడలను బ్రౌన్ కలర్లో వేయించి ప్లేట్లోకి తీసుకోండి. అంతే ఇలా మిగిలిన పిండితో వడలు చేసుకుంటే సరిపోతుంది.
- ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి తినడం ద్వారా రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
- నచ్చితే మీరు కూడా ఇలా హెల్దీగా వడలను ఓ సారి ట్రై చేయండి.
"మసాలా వడ" అద్దిరిపోయే స్నాక్ - ఇలా చేస్తే సూపర్ క్రిస్పీగా వస్తుంది!
ఆలుగడ్డతో అద్దిరిపోయే వడలు పది నిమిషాల్లోనే! - ఇలా ప్రిపేర్ చేస్తే వహ్వా అంటారు!