తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

గుడ్డు లేకుండా అద్దిరిపోయే "బ్రెడ్​ ఆమ్లెట్" - ఇలా ప్రిపేర్ చేస్తే ఇంకా కావాలంటారు!

- ఎగ్​ తినని వారికి సూపర్ స్నాక్​

Pure Veg Bread Omelette Recipe
Pure Veg Bread Omelette Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 7 hours ago

Pure Veg Bread Omelette Recipe :మనలో చాలా మందికి ఇష్టమైన స్నాక్స్​లో బ్రెడ్​ ఆమ్లెట్​ ఒకటి. ఇంట్లో గుడ్లు, బ్రెడ్​ ఉంటే చాలు క్షణాల్లో టేస్టీగా బ్రెడ్​ ఆమ్లెట్​ చేసుకుని తింటుంటాం. అయితే.. కొంతమంది ఎగ్​ ముట్టుకోరు. ఇలాంటి వారు టేస్టీగా "ప్యూర్​ వెజ్​ బ్రెడ్ ఆమ్లెట్​" రుచిని ఆస్వాదించవచ్చు. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే నిమిషాల్లోనే వేడివేడి కమ్మటి బ్రెడ్​ ఆమ్లెట్​మీ ముందుంటుంది. వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • శనగపిండి - ఒకటిన్నర కప్పు
  • బ్రెడ్ స్లైసెస్ - 4 లేదా 5
  • బియ్యం పిండి - 1/2 కప్పు
  • చాట్ మసాలా - అర టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • మిరియాల పొడి - పావు టీస్పూన్
  • బేకింగ్ పౌడర్ - టేబుల్​ స్పూన్
  • పసుపు - పావు టీస్పూన్
  • టమాటా తరుగు - 3 టేబుల్​స్పూన్లు
  • ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • పచ్చిమిర్చి తరుగు - 1 టేబుల్​స్పూన్
  • కొత్తిమీర తరుగు - 3 టేబుల్​స్పూన్లు
  • బటర్- తగినంత (మీరు నూనె కూడా వాడుకోవచ్చు)

తయారీ విధానం :

  • ముందుగా ఒక మిక్సింగ్​ బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, చాట్ మసాలా వేసుకోవాలి.
  • అలాగే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, బేకింగ్ పౌడర్, మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. (ఈ రెసిపీకి బేకింగ్ పౌడర్ మాత్రమే ఉపయోగించాలి. బేకింగ్ సోడా కాదు)
  • తర్వాత ఆ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసుకుంటూ.. నాలుగు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి.
  • ఆ విధంగా మిక్స్ చేసుకున్నాక.. అందులో టమాటా ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఆపై మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • తర్వాత ఆ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని బటర్ కొద్దిగా వేసుకోవాలి.
  • ఆపై ఒక శాండ్​విచ్ బ్రెడ్ స్లైస్ ఉంచి బాగా కాల్చుకోవాలి. తర్వాత రెండోవైపు కూడా బ్రెడ్​పై కొద్దిగా బటర్ వేసుకొని క్రిస్పీగా కాల్చుకోవాలి.
  • ఇలానే మిగతా బ్రెడ్ స్లైస్​లను కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మరోసారి స్టౌపై పాన్ పెట్టుకొని ఒక టీస్పూన్ బటర్ వేసుకోవాలి.
  • ఆపై ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్దిగా పోసుకుని పాన్ మొత్తం సర్దుకోవాలి. (మరీ పల్చగా స్ప్రెడ్ చేయకుండా.. కొద్దిగా మందంగానే ఉండేలా చూసుకోవాలి.)
  • ఆపై అంచుల వెంట అక్కడక్కడ కొద్దిగా బటర్ వేసుకొని స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి నిదానంగా రోస్ట్ చేసుకోవాలి.
  • తర్వాత పిండి మధ్యలో కాస్త తడిగా ఉన్నప్పుడు.. ముందుగా కాల్చుకున్న ఒక బ్రెడ్ స్లైస్​ను​ ఉంచి అంచులను 4 పక్కల లోపలికి ఫోల్డ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు రెండువైపులా కాస్త బటర్ వేసుకొని కాల్చుకోవాలి.
  • ఇదేవిధంగా మిగతా పిండి, బ్రెడ్ స్లైస్​లను కాల్చుకుంటే సరిపోతుంది.
  • అంతే.. ఇలా చేస్తే ఎంతో టేస్టీగా ఉండే 'ప్యూర్ వెజ్ బ్రెడ్ ఆమ్లెట్' మీ ముందుంటుంది.

ABOUT THE AUTHOR

...view details