How to Make Prawns Pulao Recipe :బిర్యానీ తర్వాత ఎక్కువ ఇష్టంగా తినే రెసిపీల్లో పులావ్ ఒకటి. చికెన్, మటన్ పులావ్, వెజిటబుల్ పులావ్ ఇలా ఇందులో చాలా వెరైటీలున్నాయి. అయితే, చాలా మంది చికెన్, మటన్ పులావ్ రుచి చూసే ఉంటారు. అందుకే మీ కోసం రొయ్యలతో అద్దిరిపోయే పులావ్ రెసిపీ తీసుకొచ్చాం. ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా పులావ్ చేస్తే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు. అంత బాగుంటుందీ పులావ్ టేస్ట్. ఈ పులావ్ బ్యాచిలర్స్ కూడా సులభంగా చేసుకోవచ్చు! మరి ఇక ఆలస్యం చేయకుండా రొయ్యల పులావ్ ఎలా చేయాలో ఓ లుక్కేయండి.
కావాల్సిన పదార్థాలు:
- కప్పున్నర బాస్మతి బియ్యం
- రొయ్యలు - 300 గ్రాములు
- ఉల్లిపాయలు - 2(సన్నగా కట్ చేసుకోవాలి)
- నెయ్యి - 3 టేబుల్‌స్పూన్లు
- ఆయిల్ - టేబుల్‌స్పూన్
- నిమ్మరసం - అర స్పూను
- పెరుగు - పావు కప్పు
- టమాటా - 1
- పచ్చిమిర్చి - 4
- కొత్తిమీర తరుగు - అర కప్పు
- కరివేపాకు -2
- ఉప్పు - రుచికి సరిపడా
మసాలా పొడి కోసం :
- ఎండుమిర్చి - 5
- జీలకర్ర - టీస్పూన్
- దాల్చిన చెక్క- 1
- ధనియాలు - టేబుల్‌స్పూన్
- యాలకులు - 4
- లవంగాలు - 5
- మిరియాలు - అర టేబుల్‌స్పూన్
పులావ్‌లోకి కావాల్సిన మసాలా దినుసులు :
- యాలకులు - 4
- లవంగాలు - మూడు
- దాల్చిన చెక్క - చిన్న ముక్క
- అనాసపువ్వు - 1
- బిర్యానీ ఆకు - 1
- రాతి పువ్వు - కొద్దిగా
- జీలకర్ర - టీస్పూన్
- జాపత్రి కొద్దిగా
- మరాఠి మొగ్గ - 1
- నల్ల యాలకలు - 1
- మిరియాలు - 7
తయారీ విధానం :
- ముందుగా స్టౌపై పాన్ పెట్టి మసాలా కోసం అన్ని మసాలా దినుసులు వేసుకుని దోరగా వేయించుకోండి. ఇవి మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకుని చల్లారనివ్వండి. ఆపై మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
- అలాగే రొయ్యలు శుభ్రం చేసుకోండి. బాస్మతి బియ్యం కడిగి అరగంటపాటు నానబెట్టుకోండి.
- అనంతరం స్టౌపై పులావ్ చేయడం కోసం నూనె, నెయ్యి వేసి కరిగించండి. వేడివేడి నూనెలో పులావ్‌లోకి కావాల్సిన మసాలా దినుసులు వేసుకుని అరనిమిషం వేపండి. (జాపత్రి ఎక్కువగా వేయకండి. లేకపోతే పులావ్ ఘాటుగా మారిపోతుంది)
- ఆపై ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఈ సమయంలోనే కరివేపాకు వేసి వేపుకోవాలి.
- అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. ఇందులోనే టమాటా ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడేవరకు వేగనివ్వాలి. ఆపై శుభ్రం చేసిన రొయ్యలు వేసి 5 నిమిషాలు వేపండి. (సముద్రపు రొయ్యలు వాడే వారు పులావ్‌లో కాస్త ఉప్పు తక్కువగా వేసుకోండి)
- రొయ్యలు వేగిన తర్వాత బాస్మతి బియ్యం, పచ్చిమిర్చి చీలికలు, గ్రైండ్ చేసిన మసాలా పొడి, పెరుగు వేసి కలపండి.
- ఆపై ఇందులో వేడివేడి నీరు 3 కప్పులు పోసి కలపండి. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి అన్నం వండుకున్నట్లుగా ఉడికించుకోండి.
- పులావ్ పూర్తిగా ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు, నిమ్మరసం చల్లి ఒకసారి కలపండి. ఆపై స్టౌ ఆఫ్ చేసి 20 నిమిషాల పాటు అలా వదిలేయండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఘుమఘుమలాడే రొయ్యల పులావ్ మీ ముందుంటుంది
- ఈ రొయ్యల పులావ్ నచ్చితే మీరు ఓ సారి ట్రై చేయండి.
"చిట్టిముత్యాల వెజ్ బిర్యానీ" - బద్దకస్తులైన బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు!
నాటు కోడి పులుసు ఇలా చేయండి - ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు!