Gutti Vankaya Dum Biryani: మీరు వంకాయతో ఎన్నో రకాల వంటలు చేసి ఉంటారు. కానీ బిర్యానీ మాత్రం ఎప్పుడూ ప్రయత్నించి ఉండరు. రెగ్యులర్‌గా చేసే బిర్యానీలా కాకుండా.. మసాలా స్టఫ్ చేసిన గుత్తి వంకాయలతో ఈ రెసిపీని వండుతారు. టేస్ట్ వేరే లెవల్ అంటే నమ్మాల్సిందే. ఒక్కసారి ఇంట్లో ట్రై చేశారంటే.. మళ్లీ మళ్లీ చేసుకుంటారు. మరి, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- గుత్తివంకాయలు - 8
- ఆలుగడ్డ ముక్కలు - ముప్పావు కప్పు
- క్యారెట్ తరుగు - పావు కప్పు
- బీన్స్ తరుగు - అర కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- సోయా - పావు కప్పు
- ఉల్లిపాయలు - 150 గ్రాములు
- ఉప్పు - ముప్పావు టీ స్పూన్
- గరం మసాలా - అర టీ స్పూన్
- కారం - అర టేబుల్ స్పూన్
- నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
- పుదీనా - కొద్దిగా
- కొత్తిమీర - కొద్దిగా
- బఠానీ - అరకప్పు
- నూనె - ఒక కప్పు
తయారీ విధానం
- ముందుగా గుత్తి వంకాయలను తీసుకుని అందులోని సుమారు 70శాతం గుజ్జును తీసేయాలి. (స్కూప్ చేసే పరికరం లేకపోతే స్పూన్‌తో చేసుకోవచ్చు)
- వీటిని పసుపు, ఉప్పు కలిపిన ఓ గిన్నెలో వేసి కాసేపు వదిలేయాలి
- మరోవైపు స్టౌ ఆన్ చేసి నీటిని మరగించండి. ఇందులో సన్నగా తరిగిన ఆలు ముక్కలు, క్యారెట్ తరుగు, బీన్స్ తరుగు, ఉప్పు, సోయా వేసి హై- ఫ్లేమ్‌లో 70శాతం ఉడికేదాకా మరగనివ్వండి.
- ఆ తర్వాత ఇందులోని నీటిని జల్లితో వడకట్టి కూరగాయలను పక్కకు పెట్టుకోవాలి.
- అనంతరం మరో కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలను దోరగా వేయించుకోవాలి.
- ఆ తర్వాత వీటిని చెంచాతో గట్టిగా ప్రెస్ చేసి మిగిలిన నూనె బయటకు తీయాలి.
- ఈ నూనెలోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయలను మెత్తగా అయ్యేవరకు ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం వంకాయలో పెట్టే మిశ్రమం తయారీ కోసం ఉడకబెట్టిన కూరగాయల్లో ఎర్రగా వేయించిన ఉల్లిపాయలను కొద్దిగా వేయాలి.
- అందులోనే రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, కారం, నిమ్మరసం, నెయ్యి, పుదీనా, కొత్తిమీర, ఫ్రోజెన్ బఠానీ వేసి కలపాలి. (పచ్చి బఠానీ అయితే కూరగాయలతోనే ఉడకబెట్టుకోవాలి)
- టేస్ట్ కోసం అవసరమైతే పనీర్ ముక్కలను కూడా ఇందులోనే వేసుకోవచ్చు.
- ఇవన్నీ వేసి బాగా కలిపాక.. ఈ మిశ్రమాన్ని వంకాయలో పెట్టి పక్కకు పెట్టుకోవాలి.
బిర్యానీ కోసం కావాల్సిన పదార్థాలు
- 2 కప్పుల బాస్మతి బియ్యం
- ఒక కప్పు పెరుగు
- ఒక టీ స్పూన్ గరం మసాలా
- ఒక టేబుల్ స్పూన్ కారం
- రుచికి సరిపడా ఉప్పు
- ఒక టీ స్పూన్ ధనియాల పొడి
- ఒక టీ స్పూన వేయించిన జీలకర్ర పొడి
- కొద్దిగా పుదీనా, కొత్తిమీర
- నిమ్మకాయ రసం
- అర టీస్పూన్ పసుపు
- 2 పచ్చిమిర్చీ ముక్కలు
- ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు
- 2 టేబుల్ స్పూన్ల నూనె
- ఒక టేబుల్ స్పూన్ నెయ్యి
- కొన్ని కాజు పలుకులు
- ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- 4 బిర్యానీ ఆకులు
- రెండున్నర ఇంచుల దాల్చిన చెక్క
- 2 అనాస పువ్వులు
- 2 మరాఠీ మొగ్గలు
- ఒక టేబుల్ స్పూన్ షాజీరా
- 7 లవంగాలు
- 5 యాలకలు
- కొద్దిగా పత్తర్ పూల్
- ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపేస్ట్
- రుచికి సరిపడా ఉప్పు
తయారీ విధానం
- బిర్యానీ కోసం గంట ముందే బాస్మతీ బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టాలి.
- ఆ తర్వాత ఓ బిర్యానీ హండీలో పెరుగు, గరం మసాలా, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ రసం, పసుపు, పచ్చిమిర్చీ ముక్కలు, ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు, నూనె, నెయ్యి వేసి బాగా కలపాలి.
- అందులోనే 3 టేబుల్ స్పూన్ల నీటిని వేసి గ్రేవీని పలుచగా చేసుకోవాలి.
- ఆ తర్వాత వంకాయలో పెట్టేందుకు తయారు చేసుకున్న మిశ్రమం, కాజు పలుకులు వేయాలి.
- అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసి.. స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను గిన్నెలో పెట్టాలి.
- ఇప్పుడు మరో గిన్నెలో రెండున్నర లీటర్ల నీటిని మరిగించాలి.
- ఇందులోనే బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వులు, మరాఠీ మొగ్గలు, షాజీరా, లవంగాలు, యాలకలు, పత్తర్ పూల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి.
- ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి హై ఫ్లేమ్‌లో 80శాతం ఉడికించాలి.
- ఇప్పుడు ఆ అన్నాన్ని జల్లిలో వడకట్టి హండీ గిన్నెలో వెదజల్లాలి.
- అన్నం ఉడికించిన నీటిలో అర చెంచా పసుపు వేసి కలిపి.. దానిని బిర్యానీ మొత్తం చల్లాలి.
- ఆ తర్వాత నెయ్యి, పావు కప్పు అన్నం ఉడికించిన నీటిని కూడా బిర్యానీ మొత్తం చల్లాలి.
- ఇలా చేశాక కొత్తిమీర తరుగు, ఎర్రగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి దమ్ బయటకిపోకుండా.. హై ఫ్లేమ్, లో ఫ్లేమ్‌లో చెరో 5 నిమిషాలపాటు ఉడికించాలి.
- ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి సుమారు 20 నిమిషాల పాటు పక్కకు పెట్టిన అనంతరం సర్వ్ చేసుకోవాలి.
"ఆంధ్ర స్టైల్ మటన్ మసాలా" కర్రీ - ఒక్కసారి ఇలా చేసి చూడండి! - టేస్ట్ అద్దిరిపోతుంది! - Mutton Curry Recipe
గణేష్ ఉత్సవాల వేళ కొబ్బరి చిప్పలు మిగిలిపోయాయా? - ఇలా పచ్చడి చేశారంటే అద్బుతమే! - Tasty and Spicy Coconut Chutney