How to Make Gongura Egg Porutu : గోంగూర ఈ పేరు చెప్పగానే మనలో చాలా మందికి నోరూరిపోతుంది. ఎక్కువ మంది గోంగూరతో పప్పు, పచ్చడి చేస్తుంటారు. అలాగే గోంగూర చికెన్, మటన్ రెసిపీలు కూడా వండుతారు. ఇవన్నీ ఎంతో రుచిగా ఉండేవే! అలాగని ఎప్పుడూ ఒకేలా తినాలన్నా కూడా కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. కాబట్టి, ఓసారి ఇలా 'గోంగూర కోడిగుడ్డు పొరటు' ప్రిపేర్ చేసుకోండి. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీతో అన్నం తినేకొద్దీ తినాలనిపిస్తుంది. పైగా గోంగూరతో చేసిన ఈ ఎగ్ పొరటు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ ఎగ్ పొరటు ఎలా తయారు చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- ఎర్ర గోంగూర ఆకులు - పావు కేజీ
- గుడ్లు-5
- కారం- సరిపడా
- గరం మసాలా - టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె -3 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర తరుగు- 100 గ్రాములు
- ఉల్లిపాయలు - 2
- పచ్చిమిర్చి - 3
- అల్లం-వెల్లుల్లి పేస్ట్ - టేబుల్‌స్పూన్
- పసుపు - పావు టీస్పూన్
తయారీ విధానం :
- ముందుగా గోంగూర ఆకులను తెంపి శుభ్రంగా నీటిలో కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయండి. ఆపై ఎగ్స్ అన్ని పగలగొట్టండి. ఇందులో కాస్త ఉప్పు, కారం వేసి ఫ్రై చేసుకోండి.
- ఎగ్స్ మిశ్రమం మరీ చిన్నగా కాకుండా పెద్ద ముక్కలుగా ఉడికించి ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేయండి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేపండి.
- అనంతరం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి.
- ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి త్వరగా రావడానికి కాస్త ఉప్పు వేయండి. ఇప్పుడు కరివేపాకులు, పసుపు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి.
- ఆపై కట్ చేసిన గోంగూర ఆకులు, కొత్తిమీర వేసి కలపండి. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి గోంగూర ఆకులు 10 నిమిషాలు మగ్గించుకోండి.
- ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా వేసి మిక్స్ చేయండి.
- ఒక రెండు నిమిషాల తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కోడిగుడ్డు పొరటు వేసి కలపండి.
- ఇప్పుడు పైన కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టౌ ఆఫ్ చేయండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర కోడిగుడ్డు పొరటు మీ ముందుంటుంది.
- నచ్చితే ఇలా ఓ సారి ట్రై చేయండి.
'తొక్కలో పచ్చడి' మీరెప్పుడైనా తిన్నారా? తెలుగు వారి స్పెషల్ రెసిపీ ఒక్కసారి టేస్ట్ చేయండి!
ఈ 'మసాలా ఎగ్ పులుసు' ఎప్పుడైనా తిన్నారా? బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు!