How to Make Kajjikayalu at Home : సంక్రాంతి పండగ వేళ అందరూ ఇళ్లలో పిండివంటలు చేసే పనిలో ఉన్నారు. మురుకులు, కారా బూందీ, చక్రాలు ఇలా కరకరలాడే వాటితో పాటు తీయని స్వీట్లు కూడా చేసేస్తున్నారు. పండగకు ఎక్కువ మంది అరిసెలతో పాటు కజ్జికాయలు కూడా చేస్తుంటారు. పిల్లలు పెద్దలందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, కజ్జికాయలు ఎక్కువ శ్రమ లేకుండా కమ్మగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలు:
- మైదా పిండి - 2 కప్పులు
- బొంబాయి రవ్వ
- కరిగించిన నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
- టీస్పూన్ ఉప్పు
- ఎండు కొబ్బరి తురుము - కప్పు
- యాలకుల పొడి - 1 టీ స్పూన్
- నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
- బాదం -15
- జీడిపప్పు-10
- పిస్తా-10
- చక్కెర- అరకప్పు
తయారీ విధానం:
- ముందుగా ఓ పెద్ద బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, బొంబాయి రవ్వ, టీస్పూన్ ఉప్పు వేసుకోండి. (మీరు గోధుమ పిండి కూడా ఉపయోగించవచ్చు.) ఇప్పుడు నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత కొద్దికొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తని ముద్దలా కలిపి పక్కకు పెట్టుకోవాలి.
- అలాగే బాదం, జీడిపప్పు, పిస్తా సన్నగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి కరిగించండి. ఆపై వేడివేడి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించండి.
- కాసేపటికి అరకప్పు బొంబాయి రవ్వ వేసి కమ్మటి సువాసన వచ్చే వరకు రోస్ట్ చేయండి.
- ఇప్పుడు ఎండు కొబ్బరి తురుము వేసి వేపండి. స్టౌ ఆఫ్ చేసే ముందు యాలకుల పొడి వేసి మిక్స్ చేయండి.
- అనంతరం ఒక మిక్సీ జార్లో చక్కెర వేసుకుని మెత్తగా పొడి చేసుకోండి. చక్కెర పొడిని వేయించిన ఎండుకొబ్బరి మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
- ఇప్పుడు ముందే కలుపుకున్న మైదా పిండిని ముద్దను మరోసారి కలపండి. ఆపై చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ పల్చగా చపాతీగా తయారు చేసుకోవాలి.
- ఇప్పుడు కజ్జికాయలు చేసే మౌల్డ్ తీసుకుని అందులో కొద్దిగా పొడి పిండి చల్లి తయారు చేసుకున్న చపాతీ పెట్టండి.
- అందులో రెండు టేబుల్ స్పూన్ల కజ్జికాయల మిశ్రమాన్ని వేసి మౌల్డ్ అంచులకు లైట్‌గా తడి అంటించి క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేయండి.
- ఆ తర్వాత మిగిలిన పిండి తీసేసి మౌల్డ్ ఓపెన్ చేసి కజ్జికాయలను ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మిగిలిన కజ్జికాయలను కూడా అలానే రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి.
- ఆయిల్ వేడెక్కిన తర్వాత కజ్జికాయలను నెమ్మదిగా నూనెలో వేసి మంటను మీడియంలో పెట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
- రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే ఇలా సింపుల్‌గా మిగిలినా అన్ని కజ్జికాయలు వేయించుకుంటే సరి!
- ఎంతో కమ్మగా ఉంటే టేస్టీ కజ్జికాయలు మీ ముందుంటాయి.
- ఈ స్వీట్ రెసిపీ నచ్చితే మీరు కూడా సంక్రాంతికి ట్రై చేయండి.
పిండి లేకుండా చిలగడదుంపతో "గులాబ్జామున్" - నోట్లో వేసుకోగానే కరిగిపోతాయ్!
చిన్నతనంలో ఇష్టంగా తినే "చందమామ బిస్కెట్లు" - ఇలా చేస్తే స్వీట్ షాప్ టేస్ట్ ఇంట్లోనే!