How to Make Chicken 65 Recipe : సండే వచ్చిందంటే చాలు.. నాన్‌వెజ్ ప్రియులకు పండగే. ఇక చాలా మందికి ఆదివారం ముక్క లేనిదే అసలు ముద్ద దిగదు. కచ్చితంగా చికెన్ లేదా మటన్‌తో ఏదైనా వంటకం చేసుకుని తింటారు. అయితే, చికెన్తోఎప్పుడూ ఒకేలా బిర్యానీ, ఫ్రై, కర్రీ కాకుండా కాస్త కొత్తగా స్ట్రీట్ స్టైల్లో చికెన్ 65 ట్రై చేద్దాం. ఈ స్టోరీలో చెప్పినట్లు చేస్తే చికెన్ 65క్రిస్పీగా, టేస్ట్ ఎంతో బాగుంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా స్ట్రీట్ స్టైల్లో చికెన్ 65 ఎలా చేయాలో ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- చికెన్ ముక్కలు - అరకిలో
- అల్లం వెల్లుల్లి పేస్టు- 2 టీస్పూన్లు
- కారం -2 టీస్పూన్లు
- గరం మసాలా-టీస్పూన్
- ధనియాల పొడి- టీస్పూన్
- జీలకర్రపొడి- టీస్పూన్
- పసుపు - పావు టీస్పూన్
- నిమ్మరసం కొద్దిగా
- కార్న్‌ఫ్లోర్ (మొక్కజొన్న పిండి)- 2 టేబుల్ స్పూన్లు
- గుడ్డు- ఒకటి
- పెరుగు-పావుకప్పు
- పచ్చిమిర్చి- నాలుగు
- కరివేపాకు- ఐదారు రెబ్బలు
- ఉప్పు- తగినంత
- ఫుడ్ కలర్-చిటికెడు(రెడ్ కలర్)
- నూనె: వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
- ముందుగా చికెన్ ముక్కలను నీటిలో శుభ్రంగా కడగాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
- ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, జీలకర్రపొడి, పసుపు, నిమ్మరసం, కరివేపాకులు కొన్ని వేసి బాగా మిక్స్ చేయాలి.
- మసాలాలు చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి.
- ఆపై కార్న్‌ఫ్లోర్ వేసి మిక్స్ చేయాలి. (కార్న్‌ఫ్లోర్‌కి బదులుగా మైదా లేదా బియ్యం పిండి ఉపయోగించవచ్చు).
- ఇప్పుడు పెరుగు, ఫుడ్ కలర్ వేసి కలపండి. చికెన్ కోటింగ్ కాస్త గట్టిగా ఉండాలి. అవసరమైతే కొద్దిగా కార్న్‌ఫ్లోర్ వేసుకోవచ్చు.
- మ్యారినేట్ చేసుకున్న చికెన్ గంటపాటు ఫ్రిడ్జ్‌లో ఉంచండి.
- తర్వాత బాగా బీట్ చేసిన సగం ఎగ్ వేసుకుని కలుపుకోండి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టి నూనె పోయండి. నూనె వేడయ్యాక స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చికెన్ ముక్కలను ఒక్కోటిగా వేస్తూ ఫ్రై చేసుకోండి.
- చికెన్ ముక్కలు సగానికి పైగా వేపుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి కాస్త చల్లారనివ్వాలి. తర్వాత మళ్లీ నూనెలో వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా రెండుసార్లు చికెన్ 65 ఫ్రైచేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి.
- తర్వాత నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకులు ఫ్రై చేసుకుని చికెన్ 65 ప్లేట్లో వేసుకోండి. అంతే ఇలా చేసుకుంటే క్రిస్పీ చికెన్ 65 రెడీ.
- నచ్చితే ఇలా ఓ సారి చికెన్ 65 ట్రై చేయండి.
పార్టీ స్పెషల్ : ఫుల్ టేస్టీ వెల్లుల్లి కోడి వేపుడు - తిని తీరాల్సిందే!
"బెంగాలీ స్టైల్ చికెన్ కర్రీ" - ఇలా వండితే ఇంట్లో అందరూ ఆహా అనాల్సిందే!