How to Make Bread Rolls Recipe :మనలో చాలా మంది ఇంట్లో మిల్క్ బ్రెడ్ ఉంటే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేసుకోవడమో.. లేదా పాలు, టీ కాచుకుని వాటిలో తినడమో చేస్తుంటారు. మరికొందరు కమ్మగా బ్రెడ్ హల్వా కూడా చేసుకుని తృప్తిగా తింటుంటారు. అయితే.. ఎప్పడూ ఒకేలా కాకుండా ఈ సారి కాస్త కొత్తగా బ్రెడ్‌తో "బ్రెడ్ రోల్స్" చేసేయండి. ఈ విధంగా బ్రెడ్ రోల్స్ చేస్తే సాయంత్రం బెస్ట్ ఈవెనింగ్ స్నాక్ రెడీ అయిపోతుంది. వీటిని చేయడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. నిమిషాల్లోనే వేడివేడిగా రెడీ అవుతాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా బ్రెడ్ రోల్స్ తింటారు. మరి, సింపుల్‌గా బ్రెడ్ రోల్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- మిల్క్‌బ్రెడ్ స్లైసులు -6
- బంగాళదుంపలు - 3
- ఉల్లిపాయ తరుగు-పావు కప్పు
- క్యాప్సికం తురము- 2 టేబుల్సూన్లు
- పచ్చిమిర్చి-2
- కారం- అర చెంచా
- చాట్ మసాలా-అర చెంచా
- జీలకర్ర పొడి - 1 టీ స్పూన్
- చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్
- మిరియాలు పొడి - అర టీస్పూన్
- గరం మసాలా - అర టీస్పూన్
- కొత్తిమీర తరుగు కొద్దిగా
- కార్న్ ఫ్లోర్ -2 టేబుల్‌స్పూన్లు
- బ్రెడ్ క్రంప్స్-పావు కప్పు
- ఉప్పు రుచికి సరిపడా
- నీరు
- నూనె- సరిపడా
తయారీ విధానం :
- ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి మెత్తగా ఉడికించుకోవాలి. ఆపై వాటిపైన పొట్టు తీసేసి.. చేతితో మెత్తగా మెదుపుకోవాలి.
- అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికం, క్యారెట్ సన్నగా తురుముకోవాలి.
- ఇప్పుడు బ్రెడ్ స్లైసులను తీసుకొని.. వాటి అంచులను కట్ చేసుకోవాలి. ఆపై వాటిని ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.
- బ్రెడ్ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి బంగాళదుంప మిశ్రమం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికం, క్యారెట్, కొత్తిమీర తరుము, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
- అలాగే కారం, చాట్ మసాలా, జీలకర్ర పొడి, చిల్లీ ఫ్లేక్స్, మిరియాలు పొడి, గరం మసాలా వేసి మిక్స్ చేయాలి.
- పిండి కాస్త గట్టిగా మారిన తర్వాత చేతికి కాస్త నూనె రాసుకోవాలి. ఆపై కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని బులెట్స్ మాదిరిగా రోల్ చేసుకోవాలి.
- ఇలా పిండితో అన్ని బులెట్స్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- తర్వాత ఒక చిన్న గిన్నెలోకి కార్న్‌ఫ్లోర్ మిశ్రమం తీసుకుని, కొన్ని నీళ్లు కలపాలి. మిశ్రమం ఉండలు లేకుండా ఉండాలి.
- ఆపై ఒక ప్లేట్లోకి బ్రెడ్ క్రంప్స్ పొడి తీసుకోండి.
- ఇప్పుడు సిద్ధం చేసుకున్న బులెట్స్ కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో డిప్ చేసి.. బ్రెడ్ క్రంప్స్లో రోల్ చేయండి.
- బులెట్స్ అన్నింటినీ డీప్ ఫ్రై కోసం ఇలా రెడీ చేసుకోని ప్లేట్లో సిద్ధం చేసుకోవాలి.
- ఇప్పుడు బ్రెడ్ రోల్స్ డీప్ ఫ్రై చేయడం కోసం స్టౌపై కడాయి పెట్టి ఆయిల్ పోయండి.
- ఆపై ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న బ్రెడ్ రోల్స్‌ని తీసి కాగుతున్న నూనెలో వేసుకోవాలి.
- మంటను అడ్జస్ట్ చేసుకుంటూ అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి.
- ఆవిధంగా ఫ్రై చేసుకున్నాక.. వాటిని టిష్యూ పేపర్ మీదికి తీసుకోవాలి.
- ఆపై వాటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ "బ్రెడ్ రోల్స్" మీ ముందుంటాయి!
- వేడివేడిగా ఈ బ్రెడ్ రోల్స్‌ను టమాటా సాస్ లేదా నచ్చిన చట్నీతో తింటే ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.