Bakery Style Vanilla Sponge Cake :బేకరీల్లో కూల్ కేక్ మొదలు.. పఫ్స్ వరకు అన్నీ ఎంతో రుచికరంగా ఉండేవే. ఇక వివిధ ఫ్లేవర్లలో నోరూరించే కేకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చూసిన ప్రతి కేకు ముక్కనూ.. చటుక్కున నోట్లో వేసుకోవాలనిపిస్తుంటుంది ఎవరికైనా! అయితే.. ఈ బేకరీ ఐటమ్స్‌లో అందరికీ ఇష్టమైన వాటిలో స్పాంజ్ కేక్ కూడా ఒకటి. ఈ స్పాంజ్ కేకుల్లో వెనీలా ఫ్లేవర్లో ఉండే కేక్‌ని ఎక్కువ మంది ఇష్టంగా తింటారు.
అయితే.. స్పాంజ్ కేకుల రుచి ఎంత బాగున్నా కూడా.. తరచూ బేకరీల్లో చేసినవి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఇంట్లో చేసుకోవడమే బెటర్. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే చాలా ఈజీగా ఫ్లఫ్ఫీ స్పాంజ్ కేక్‌ని మీరు ఇంట్లోనే చేయచ్చు. మరి, ఇక ఆలస్యం చేయకుండా ఫ్లఫ్ఫీ స్పాంజ్ కేక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు? తయారీ విధానం ఏంటో ఓ లుక్కేయండి!
కావాల్సిన పదార్థాలు :
- గుడ్లు-4
- చక్కెర -150 గ్రాములు
- వెనీలా ఎక్స్ట్రాక్ట్-1 టీస్పూన్
- మైదాపిండి-130 గ్రాములు
- బేకింగ్ పౌడర్-1/2 స్పూన్
- ఉప్పు- చిటికెడు
- నూనె-50 గ్రాములు
తయారీ విధానం :
- ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఎగ్స్ పగలగొట్టి తీసుకోండి. ఇందులోనే పంచదార వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్ సాయంతో లైట్ క్రీమ్ కలర్ వచ్చేంత వరకు స్పీడ్‌గా బీట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసుకుని మరోసారి బీట్ చేసుకోవాలి.
- మిశ్రమంపైన నురగలు వచ్చేంత వరకు హ్యాండ్ బ్లెండర్తో బీట్ చేయాలి. ఆపై జల్లెడ తీసుకుని బేకింగ్ పౌడర్, మైదా పిండి వేసుకుని బౌల్లో జల్లించుకోండి.
- తర్వాత పిండిని గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్, ఉప్పు వేసి హ్యాండ్ బ్లెండర్ సాయంతో బీట్ చేసుకోండి. తర్వాత మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు కేక్ పాన్‌లో పూర్తిగా నెయ్యితో గ్రీస్ చేయండి. ఆపై పాన్‌లో బటర్ పేపర్ వేయండి. ఇందులో బీట్ చేసుకున్న మిశ్రమం పూర్తిగా వేసేసుకోండి.
- ఇప్పుడు ప్రీ హీటెడ్ ఓవెన్లో 150 డిగ్రీల దగ్గర.. లోవర్ రాడ్ మాత్రమే ఆన్ చేసి.. 35-40 నిమిషాలు బేక్ చేసుకోండి.
- ఆ తర్వాత కేక్ పాన్ ఓవెన్లో నుంచి బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వండి.
- ఇప్పుడు కేక్‌ని డీ మౌల్డ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు ఎంత సైజ్‌లో కావాలో ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది.
- ఎంతో మృదువుగా, రుచిగా ఉండే వెనీలా స్పాంజ్ కేక్ మీ ముందుంటుంది.
ఇవి కూడా చదవండి :
మీ పిల్లలకు కేక్స్ అంటే ఇష్టమా? - అయితే నోరూరించే ఎగ్‌లెస్ రవ్వ కేక్ ఇంట్లోనే తయారు చేసేయండిలా!
క్రిస్మస్ రోజు ఈ కేక్స్ చేయండి - ఫ్యామిలీతో తియ్యని వేడుక చేసుకోండి!