Dosa And Idli Batter Fermenting Tips in Winter:చాలా మంది ఎక్కువగా ఇష్టపడి తినే టిఫిన్ వెరైటీలలో దోశ, ఇడ్లీ ముందు వరుసలో ఉంటాయి. అయితే, వీటిని తయారు చేసుకోవాలంటే పిండి బాగా పులవడం చాలా అవసరం. పిండి ఎంత బాగా పులిస్తే వంటలో రుచి అంత మంచిగా వస్తాయి. అదే పిండి సరిగా పులియలేదంటే దోశ, ఇడ్లీలు గట్టిగా వస్తుంటాయి. ముఖ్యంగా చలికాలంలో పిండి ఎక్కువగా పులవదు. అయితే, కొన్ని చిట్కాలు ఫాలో అయితే వింటర్లో కూడా ఇడ్లీ, దోశ పిండి చక్కగా పులుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి, ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా.
సరైన మోతాదులో తీసుకోవాలి:ముందుగా ఇడ్లీ, దోశ కరెక్ట్‌గా రావాలంటే పిండిని సరిగా రెడీ చేసుకోవడం చాలా అవసరం. అంటే పిండి తయారీ కోసం నానబెట్టుకునే ఇడ్లీ రవ్వ, మినప్పప్పు, దోశకి బియ్యం వంటివి ఎంత మోతాదులో తీసుకోవాలో తెలిసుండాలి. అలాకాకుండా ఎక్కువైనా, తక్కువైనా పిండి సరిగా పులియదు. అలా పులియక పోతే దోశ, ఇడ్లీలు చక్కగా రావు. కాబట్టి కావాల్సిన పదార్ధాలు సరైన మోతాదులో తీసుకోవాలి.
మెంతులు, మరమరాలు:చలికాలం దోశ, ఇడ్లీ పిండి సరిగా పులియాలంటే అవి నానబెట్టేటప్పుడు ఒక టీస్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టుకోండి. అలాగే కొన్ని మరమరాలూ కలపాలి. ఫలితంగా పిండి బాగా పులియడమే కాకుండా ఇడ్లీలు, దోశలు చక్కగా వస్తాయి.
ఇలా మిక్సీ పట్టుకోండి:చాలా మంది పిండి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ కలుపుతుంటారు. అయితే, వింటర్లో పిండిని మిక్సీ పట్టుకునేటప్పుడు గోరువెచ్చగా ఉండే నీటిని కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి త్వరగా పులుస్తుందట.