Nellore Rasam Recipe in Telugu : ఆంధ్రా భోజనం అనగానే గోంగూర, ఆవకాయ పచ్చళ్లు గుర్తొస్తాయి. భోజనం చివర్లో సాంబార్, రసం తప్పనిసరి. ఆంధ్రాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఫుడ్ ఉంటుంది. రాయలసీమలో రాగి సంకటి, ఉత్తరాంధ్ర, కోనసీమలో చేపల ఇగురు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆవకాయ ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో నెల్లూరులో ఎంతో ఫేమస్ అయినటువంటి రసం రెసిపీ గురించి ఇవాళ తెలుసుకుందాం.
'షుగర్ పేషెంట్లకు సూపర్ ఫుడ్'! - జొన్నపిండితో అప్పటికప్పుడు హెల్దీ దోసెలు
నెల్లూరు స్టైల్లో రసం తయారు చేస్తే అన్నం వదిలేసి రసమే తాగేస్తారు. అంత రుచిగా ఉంటుంది. తయారీ కోసం పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. పట్టుమని పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. వంటింట్లో లభించే నాలుగైదు పదార్థాలతోనే దీనిని రుచికరంగా చేసుకోవచ్చు. ఇలా సింపుల్ టిప్స్ పాటించి రసం తయారు చేస్తే మీ ఇంట్లో మీకు 100 మార్కులు గ్యారెంటీ! ఇంకెందుకు ఆలస్యం నెల్లూరు రసం తయారు చేసేద్దాం పదండి.
నెల్లూరు రసం తయారీకి కావల్సిన పదార్థాలు
- చింతపండు - నిమ్మకాయ సైజు
- టమోటా - మీడియం సైజు
- మిరియాలు - టీ స్పూన్
- జీలకర్ర - 1 1/2 టీ స్పూన్
- ధనియాలు - టీ స్పూన్
- మెంతులు - చిటికెడు
- ఎండు మిరపకాయలు - 6
- వెల్లుల్లి రెబ్బలు -10
- నూనె - పోపు కోసం తగినంత
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఇంగువ - కొద్దిగా
- పసుపు - కొద్దిగా
- ఉప్పు - తగినంత
- నీళ్లు - (పులుపు ఎక్కువ, తక్కువ కాకుండా)
- కొత్తిమీర తరుగు - ఒక చిన్న కట్ట
రసం తయారీ విధానం
- ముందుగా నిమ్మకాయ సైజులో చింతపండును తీసుకుని శుభ్రం చేసుకోవాలి.
- మీడియం సైజు గిన్నెలో చింతపండు వేసుకుని గ్లాసు నీళ్లు పోసుకోవాలి.
- ఇదే గిన్నెలో ఓ పండు టమోటాను వేసుకుని పక్కన పెట్టుకోవాలి
- మరోవైపు రసం పొడి కోసం మిరియాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, 3 ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేసుకుని రుబ్బుకోవాలి.
- మిక్సీకి బదులు రోట్లో రుబ్బుకుంటే అదనంగా రుచి వస్తుంది.
- రసం పొడి రెడీ అయ్యాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు, టమోటాను చేతితో బాగా పిసుక్కొని జ్యూస్ మాదిరిగా చేసుకోవాలి.
- ఇపుడు రసం తయారీ కోసం పొయ్యిపై గిన్నె పెట్టుకుని నూనె పోసుకోవాలి. వేడెక్కిన తర్వాత 3 ఎండు మిరపకాయలను తొడిమలతో సహా తుంచి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ముందుగా సిద్ధం చేసుకుని రసం పొడిని వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
- ఇపుడు పసుపు, ఇంగువ వేసుకుని వేయించాలి.
- పొడి నూనెలో బాగా వేగిన తర్వాత చింతపండు, టమోటా రసం పోసుకోవాలి.
- రుచికి సరిపడా ఉప్పుతో పాటు కావల్సినంత నీళ్లు పోసుకోవాలి.
- రుచి చూసి పులుపుకు తగ్గట్లుగా నీళ్లు అడ్జస్ట్ చేసుకోవాలి.
- పులుపు ఎక్కువ, తక్కువ కాకుండా చూసుకోవాలి.
- మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రసం ఒక పొంగు వచ్చేలా చూసుకోవాలి.
- ఎక్కువగా మరిగించకుండా ఒక పొంగు రాగానే కొత్తిమీర వేసుకుని దించుకుంటే సరిపోతుంది.
- ఈ రసం వేడివేడి అన్నంలో పోసుకుంటే అమృతమే.
మెత్తటి ముక్కలతో నోరూరించే మటన్ ఫ్రై - ఇలా చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది!
లేత వంకాయలతో కమ్మటి "వంకాయ మెంతికారం" - పప్పు, సాంబార్ అన్నంతో సూపర్ టేస్ట్!