Gold Theft Case Solved: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం అత్మకూరు అండర్ పాస్ వద్ద ఈ నెల 15వ తేదీ జరిగిన అయిదు కిలోల బంగారం చోరీ కేసును పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల మేరకు, మంగళగిరికి చెందిన దీవి రాము విజయవాడలో జ్యువెల్లరీ దుకాణం నిర్వహిస్తున్నారు. అందులో మేనేజర్‌గా పని చేసే దీవి నాగరాజు రోజు ఈనెల 15వ తేదీన రాత్రి సుమారు 4 కోట్ల విలువైన 5 కేజీల బంగారు ఆభరణాలను బ్యాగ్‌లో పెట్టుకుని స్కూటీపై వస్తున్నాడు. ఆ సమయంలో ఆత్మకూరు బైపాస్‌లోని అండర్ పాస్ వద్ద గుర్తు తెలియని యువకులు స్కూటీకి తగిలించిన బ్యాగ్ లాక్కుని పారిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌లతో పాటు బాధితుడి కదలికలపైనా పోలీసులు దృష్టి పెట్టారు. నాగరాజు తన స్నేహితులతో కలిసి చోరీకి వ్యూహరచన చేసినట్లు వెల్లడైంది. తనకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని, చెల్లికి వివాహం చెయ్యాలంటూ తన స్నేహితులైన నవీన్, లోకేశ్, భరత్, సాయి అనే నలుగురు స్నేహితులను నమ్మించి ఈ చోరీ కథ నడిపించాడు. ఆభరణాలు చోరీ చేసేందుకు తనకు సహకరించాలని కోరాడు. మొదట వారు పోలీసులకు భయపడి నిరాకరించారు. దీంతో నాగరాజు మీకేం ఇబ్బంది లేదని, అసలు కేసు లేకుండా చూసుకుంటానని వారిని ఒప్పించాడు.
ఈ వ్యవహారంలో భరత్ కీలకంగా వ్యవహరించాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం వారు నాగరాజు బైక్‌ను భరత్, మరో వ్యక్తి అడ్డగించి బంగారం బ్యాగ్‌తో ఉడాయించారు. దాన్ని స్థానికంగా నివాసం ఉండే లోకేశ్ ఇంట్లో ఉంచారు. నేరవిభాగం ఏఎస్పీ సుప్రజ పర్యవేక్షణలో డీఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి రూరల్ పోలీసులు సంయుక్తంగా ఈ కేసు దర్యాప్తు చేపట్టి, ఆరు రోజుల వ్యవధిలోనే చోరీకి గురైన బంగారంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
మొదటి నుంచీ పోలీసుల అనుమానం: ఈ కేసులో మొదటి నుంచీ పోలీసులు నాగరాజును అనుమానిస్తూనే ఉన్నారు. తొలుత బైక్‌పై బంగారు ఆభరణాలను తీసుకెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బ్యాగ్ లాక్కుని పారిపోయారని నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్లో స్కూటీ ముందు భాగంలో ఉన్న బ్యాగులో బైక్‌పై వచ్చేవారు తీయడం కష్టంగా ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక దుకాణదారులను ప్రశ్నించగా, అలాంటి ఘటన ఏమీ జరగలేదంటూ చెప్పుకొచ్చారు. నాగరాజు చోరీ జరిగిన రాత్రి 8:30 నుంచి 9:15 గంటల వరకు ఇతరులతో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులకు తెలిసింది. దీంతో కేవలం కొద్ది రోజుల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదించారు.
5 కేజీల బంగారం దొంగతనం - ఆ ముగ్గురు ఎవరు ? - ఆరా తీస్తున్న పోలీసులు
రూ.10వేలు ఇవ్వలేదని- యజమాని భార్యకు చెందిన 12 తులాల నగల చోరీ