తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఇత్తడి కుందులు నల్లగా మారాయా? - ఈ టిప్స్ పాటిస్తే దీపావళి వేళ బంగారంలా మెరుస్తాయి! - BRASS LAMPS CLEANING TIPS

-ఇత్తడి కుందులపై నూనె, జిడ్డు మరకలు -ఇలా క్లీన్​ చేస్తే పూర్తిగా మాయం

Clean Brass Lamps
How To Clean Brass Lamps (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2024, 10:35 AM IST

How To Clean Brass Lamps :దీపావళి అంటే గుర్తొచ్చేది టపాసులు, మిఠాయిలు, వెలుగులు పంచే దీపాలూ. చీకటిని పారదోలుతూ చెడు మీద గెలిచిన మంచికి గుర్తుగా పండగను జరుపుకుంటారు. కొత్తబట్టలూ, పిండివంటలూ, తీయని మిఠాయిలు.. అన్ని పండగల్లో ఉన్నా ఈ వెలుగుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించేవి మాత్రం అందమైన దీపాలు మాత్రమే. అయితే, పండగనాడు ఇంటిని దీపాలతో శోభాయమానంగా అలంకరించడం ఆచారంగా వస్తోంది.

ఈ క్రమంలోనే ఇంట్లో దీపాలు వెలిగించడానికి వివిధ రకాల కుందుల్ని ఉపయోగిస్తుంటాం. ఇంట్లో పూజ కోసం చాలా మంది ఇత్తడి కుందుల్ని ఎంచుకుంటారు. అయితే, రోజూ పూజ కోసం ఉపయోగించే ఇత్తడి కుందులు తరచూ శుభ్రం చేసినా.. కొన్నాళ్లకు నల్లగా మారుతుంటాయి. అలాగే ఆయిల్​ పూర్తిగా తొలగిపోకపోవడం వల్ల వాటిపై జిడ్డు పేరుకుపోతుంది. అయితే, ఇత్తడి దీపపు కుందుల్ని ఇంట్లో ఉండే పదార్థాలతో కొత్త వాటిలా తళతళా మెరిపించడానికి కొన్ని చిట్కాలను ట్రై చేయాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వెనిగర్‌, నిమ్మరసం :ఈ రెండు సమానంగా ఒక గిన్నెలోకి తీసుకుని మిశ్రమంలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని కుందులపై పూసి రుద్దుతూ శుభ్రం చేయాలి. ఇందులోని ఆమ్ల గుణాలు ఇత్తడి కుందులపై ఉన్న జిడ్డు, నల్ల మరకల్ని తొలగిస్తాయి.

టూత్‌పేస్ట్‌తో : ముందుగా ఇత్తడి కుందుల్ని సబ్బు/డిటర్జెంట్‌తో క్లీన్​ చేయాలి. తర్వాత కొద్దిగా టూత్‌పేస్ట్‌ తీసుకొని దాన్ని కుందులపై పరచుకునేలా అప్లై చేయాలి. కొద్దిసేపు అలా పక్కన పెట్టి.. పొడి వస్త్రంతో రుద్దుతూ తుడిచేస్తే అవి కొత్తవాటిలా మెరుస్తాయి.

వెనిగర్‌, ఉప్పుతో : దీపాలు వెలిగించడానికి వాడే ఆయిల్​, వాతావరణంలోని ఆక్సిజన్ కారణంగా.. ఇత్తడి దీపపు కుందులు నల్లగా, జిడ్డుగా మారిపోతుంటాయి. అయితే, వీటిని శుభ్రం చేయడానికి వెనిగర్‌ చక్కగా పనిచేస్తుంది. ముందుగా గిన్నెలో మూడు టేబుల్‌స్పూన్ల వెనిగర్‌లో టేబుల్‌స్పూన్‌ ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కుందులకు పట్టించి కొద్దిసేపు అలాగే వదిలేయాలి. తర్వాత స్క్రబ్బర్‌తో నెమ్మదిగా, మృదువుగా రుద్దుతూ కుళాయి వాటర్​ కింద క్లీన్​ చేస్తే అవి కొత్తవాటిలా మెరుస్తాయి. చివరగా వీటిని పొడి వస్త్రంతో తుడిచి కాసేపు ఆరబెట్టాలి.

నిమ్మరసంతో :ఒక కాటన్‌ బాల్‌ని నిమ్మరసంలో ముంచి ఇత్తడి కుందులపై లేయర్‌లా పూసి కొద్దిసేపు బాగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో క్లీన్ చేస్తే తళతళా మెరిసిపోతాయి.

టమాట కెచప్‌తో : టమాట కెచప్‌ని ఇత్తడి కుందులపై లేయర్‌లా పూసి మృదువైన టూత్‌బ్రష్‌తో గుండ్రంగా రుద్దుతూ క్లీన్​ చేయాలి. తర్వాత నీటితో కడిగి పొడి గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది. కెచప్‌లోని ఆమ్ల గుణాలు వాటిపై పేరుకున్న జిడ్డుదనం, నల్లటి మరకల్ని తొలగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

బియ్యప్పిండి లేదా శనగపిండితో : ఒక గిన్నెలో నీళ్లు, వెనిగర్‌, బియ్యప్పిండి లేదా శనగపిండి.. ఈ మూడింటినీ సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత కుందులకు పూర్తిగా ఈ మిశ్రమాన్ని మందపాటి లేయర్‌లా పూయాలి. పూర్తిగా ఆరిపోయాక సబ్బు లేదా డిటర్జెంట్‌తో కడగాలి. తర్వాత పొడి వస్త్రంతో తుడిచేస్తే సరిపోతుంది.

గోడలు మురికిగా మారాయా ? - ఈ టిప్స్​ పాటిస్తూ క్లీన్​ చేసి - దీపావళికి అందంగా మార్చండి!

చెక్క పాత్రల జిడ్డు, మరకలు పోవట్లేదా? - ఇలా చేస్తే ఈజీగా తొలగిపోయి నీట్​గా ఉంటాయి!

ABOUT THE AUTHOR

...view details