Khakhra Recipe in Telugu : కొన్నిసార్లు మన వంటలు ఎంత బాగున్నా, ఇతర రాష్ట్రాల వాళ్లు ఏం తింటున్నారో, ఎలా చేసుకుంటున్నారో తెలుసుకోవాలనిపిస్తుంది. ఒకవేళ ఏమైనా వెరైటీగా అనిపించినా, రుచికరంగా ఉంటాయని భావించినా వాటిని ప్రిపేర్ చేయాలని ఆరాటపడుతుంటారు. మరి మీకు అలాంటి వంటలు చేయాలనే ఇంట్రస్ట్ ఉందా? అయితే ఓసారి గుజరాతీల ఫేమస్ వంటకం ఖాఖ్రా ట్రై చేయండి. పేరుకు తగ్గట్లుగానే ఈ రెసిపీ సరికొత్త టేస్ట్‌ని అందిస్తుంది. టీ తాగుతూ రెండు ఖాఖ్రాలు తింటే ఆ కిక్కు వేరే లెవెల్ ఉంటుంది. పిల్లలైతే క్రిస్పీగా, క్రంచీగా ఉండే వీటిని చాలా చాలా ఇష్టంగా తింటారు! పైగా దీనికోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన పనిలేదు. ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఈ సూపర్ టేస్టీ రెసిపీతయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- గోధుమపిండి - 2 కప్పులు
- శనగపిండి - పావు కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- పచ్చిమిర్చి పేస్ట్ - ఒకటిన్నర చెంచా
- వెల్లుల్లి ముద్ద - ఒకటిన్నర చెంచా
- ఆయిల్ - 3 టేబుల్‌స్పూన్లు
- పావ్‌భాజీ మసాలా - 1 టేబుల్‌స్పూన్
- మెంతి ఆకుల పొడి - చెంచా
- కారం - చెంచా
- పసుపు - అర చెంచా
- జీలకర్ర - అర చెంచా
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమపిండి, శనగపిండి, పావ్‌భాజీ మసాలా, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముద్ద, కారం, జీలకర్ర, పసుపు, మెంతి ఆకుల పొడి, ఆయిల్ ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీపిండిలా మళ్లీ మళ్లీ మిక్స్ చేసుకోవాలి. అంటే పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఆవిధంగా మిక్స్ చేసుకున్నాక 15 నిమిషాల పాటు పక్కనుంచాలి.
- అనంతరం పిండిని మరోసారి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత ఒక్కో ఉండను తీసుకొని చపాతీపీటపై గుండ్రంగా, పల్చటి రొట్టె మాదిరిగా చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పాన్ వేడయ్యాక దాని మీద నూనె వేయకుండా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్చటి రొట్టెను వేసి ఒకవైపు నార్మల్‌గా కాల్చుకున్నాక మరోవైపునకు తిప్పుకొని శుభ్రమైన వస్త్రంతో నొక్కినట్లు చేస్తూ రెండువైపులా మంచిగా కాల్చుకోవాలి.
- రెండు వైపులా చక్కగా కాలాయనుకున్నాక తీసి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే కరకరలాడే గుజరాతీ స్పెషల్ "ఖాఖ్రాలు" రెడీ!
- మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరూ ఓసారి ఈ వెరైటీ రెసిపీని ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉండే వీటిని ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు!