ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

గోదారోళ్ల 'ఎండు మెత్తళ్ల ఆవకాయ పచ్చడి' - ఇవి కలిపి పెడితే ఏడాదంతా నిల్వ ఉంటుంది - DRY FISH AVAKAYA PICKLE

ఎండు చేపల పచ్చడితో రెండు ముద్దలు ఎక్కువే తింటారు - సింపుల్​ టిప్స్​తో ఇలా చేసేయండి

dry_fish_pickle_recipe
dry_fish_pickle_recipe (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2025, 3:28 PM IST

DRY FISH PICKLE RECIPE :నాన్ వెజ్ ప్రియులకు ఎండు చేపలంటే ఎంతో ఇష్టమైన వంటకం. వాటిని వేడి చేస్తున్నపుడు వచ్చే వాసన కారణంగా చాలా మంది ఎండు చేపలకు దూరంగా ఉంటారు తప్ప అవంటే ఇష్టం లేక కాదు. నెలలో ఒకట్రెండు సార్లు ఎండు చేపలు తినడం ఎంతో ఆరోగ్యకరమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఇవాళ ఎంతో ఆరోగ్యకరమైన హెల్దీ ఎండు చేపల పచ్చడి రెసిపీ మీకోసం.

"గుత్తి వంకాయ మసాలా కర్రీ" - కుక్కర్లోనే అద్దిరిపోయేలా ఇలా ఈజీగా చేసేయండి!

వారాంతపు మార్కెట్​లో ఎండు చేపలు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. రకరకాల చేపలతో పాటు చందమామలు, ఎండు రొయ్యలు ఇంటికి తెచ్చేసుకుంటాం. కాస్త ఉల్లిపాయలు, టమోటా తరుగు కలిపి వండుకునే ఈ కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఏడాదంతా నిల్వ ఉండేలా ఎండు చేపల పచ్చడి మీ కోసం.

ఎండు (వట్టి) చేపల ఆవకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు

  • మెత్తళ్లు (చేపలు) - పావుకిలో
  • ఆవాలు - 100 గ్రాములు
  • జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
  • మెంతులు - 1 టేబుల్ స్పూన్
  • ధనియాలు - 1 టేబుల్ స్పూన్
  • దాల్చిన చెక్క - 2 ఇంచులు
  • స్టార్ పువ్వు - 1
  • లవంగాలు - 10
  • యాలకులు - 5
  • గసగసాలు - 1 స్పూన్ (ఆప్షనల్)
  • వెల్లుల్లి - 20 రెబ్బలు
  • నిమ్మకాయలు - 2 (రసం కోసం)
  • కారం - కప్పున్నర
  • ఉప్పు - తగినంత

తయారీకి ముందుగా

గోదావరిలో పట్టిన చేపలకు కాస్త ఇసుక ఉంటుంది. అందుకే వాటిని నాలుగైదు సార్లు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక కడాయిలో నీళ్లు వేడి చేసుకుని చేపలను అందులో శుభ్రంగా కడగాలి. గోరు వెచ్చని నీటిలో శుభ్రం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.

పచ్చడి తయారీకి మసాలా పొడి అవసరం

ముందుగా కడాయి తీసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, లవంగాలు, యాలకులు, గసగసాలు వేసుకుని వేయించుకోవాలి. సువాసన వచ్చే వరకు వేపుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. (రోట్లో రుబ్బితే ఇంకా మంచిది)

మరో వైపు పెద్ద కడాయిలో వేరుశనగ నూనె పోసుకుని శుభ్రం చేసుకున్న మెత్తళ్లను ఫ్రై చేసుకోవాలి. నూనెలో మంచి రంగు వచ్చే వరకు వేయించాలి. పూర్తిగా మాడిపోకుండా 90శాతం పచ్చిదనం పోయే వరకు వేయిస్తే చాలు.

వేయించిన మెత్తళ్లను ఓ గిన్నెలోకి తీసుకుని అవి ఫ్రై చేయగా మిగిలిన నూనె(చల్లారాక) కలుపుకోవాలి. చేపలన్నింటికీ నూనె బాగా పట్టించాలి.

ఆ తర్వాత పొట్టుతీసిన 20 వెల్లుల్లి రెబ్బలు కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడిని కలపాలి. కారం, తగినంత ఉప్పు వేసుకుని చేపలకు పట్టేలా చేతితో కలుపుకోవాలి. చివరగా నిమ్మకాయ రసం తీసి కలుపుకోవాలి. ఇప్పుడు రుచి చూసి కావల్సినంత కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. గాజు సీసాలో పెట్టుకుంటే ఇలా చేసిన పచ్చడి ఏడాదంతా నిల్వ ఉంటుంది.

పక్కా కొలతలతో 'చికెన్ పచ్చడి' ఇలా పెట్టండి - 3 నెలలు నిల్వ పెట్టుకోవచ్చు!

పక్కా కొలతలతో అదిరే "గోంగూర చికెన్ పచ్చడి" - ఇలా పెడితే నెల రోజులపాటు నిల్వ!

ABOUT THE AUTHOR

...view details