Garlic Rasam Recipe in Telugu : చలికాలం వాతావరణంలోని మార్పుల కారణంగా చాలా మందిని జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి. దాంతో నోటికి ఏమి తినాలనిపించదు. అయితే, అలాంటి టైమ్‌లో ఇలా "వెల్లుల్లి రసం" ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా రుచికరంగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. అంతేకాదు ఆయా సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది! పైగా ఈ చారు కోసం ఎక్కువ కష్టపడాల్సిన పనిలేదు. ఎవరైనా నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
- టమాటాలు - 2(మీడియం సైజ్‌వి)
- మిరియాలు - అరటీస్పూన్
- జీలకర్ర - 2 టీస్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు - గుప్పెడు
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- పచ్చిమిర్చి - 5
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావుటీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తాలింపు కోసం :
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- మెంతులు - చిటికెడు
- జీలకర్ర - అరటీస్పూన్
- ఆవాలు - అరటీస్పూన్
- ఎండుమిర్చి - 4
- కరివేపాకు - కొద్దిగా
- వెల్లుల్లి రెబ్బలు - 3
- ఇంగువ - చిటికెడు
చలికాలంలో అద్దిరిపోయే "కళ్యాణ రసం"- వేడివేడి అన్నంలో అమృతమే!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్లో చింతపండుశుభ్రంగా కడిగి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
- ఆలోపు రెసిపీలోకి కావాల్సిన టమాటాలను కాస్త మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి.
- చింతపండు బాగా నానిన తర్వాత అందులోని పిప్పిని వేరు చేసి రసాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా జీలకర్ర, మిరియాలు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరోసారి కచ్చాపచ్చాగా మిక్సీపట్టుకొని పక్కనుంచాలి.
- అనంతరం స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి.
- అవి వేగాక ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాముక్కలు వేసి సాఫ్ట్‌గా మారే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకునేటప్పుడే ఉప్పు, పసుపు వేసుకోవాలి.
- టమాటా ముక్కలు బాగా మగ్గాయనుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి లో ఫ్లేమ్ మీద రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి.
ఈ చలిలో వేడివేడిగా "చింతపండు చారు" - ఘాటుగా జుర్రుకోండిలా!
- ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం, ఒకటిన్నర లీటర్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్‌లోనే పులుపు, ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే పులుపు ఎక్కువగా ఉంటే మరికొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి.
- ఆపై కొత్తిమీర తరుగు వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలపాటు మరగనివ్వాలి.
- ఈలోపు మరో బర్నర్ మీద పోపుని రెడీ చేసుకోవాలి. ఇందుకోసం చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక మెంతులు వేసి వేయించాలి.
- అవి వేగాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి మంచిగా వేయించుకోవాలి.
- పోపు చక్కగా వేగాక దాన్ని మరుగుతున్న చారులో వేసి బాగా కలుపుకోవాలి.
- ఇక చివర్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, ఘుమఘుమలాడే "వెల్లుల్లి రసం" రెడీ!
నోటికి కమ్మగా ఉండే "జీలకర్ర రసం" - ఇలా చేసుకుని తిన్నారంటే అజీర్తి, గ్యాస్ సమస్యలు ఔట్!