Dussehra 2024 Special Sweet Recipes : దసరా పండగకు గారెలూ, జంతికలు లాంటి పిండి వంటకాలు ఎలాగూ ఉంటాయి. వాటితోపాటూ ఏదైనా స్వీటు కూడా ఉండాలిగా. మరి అవి కాస్త వెరైటీగా ఉండి నోరూరిస్తే ఎలా ఉంటుంది? అందుకే.. ఈ దసరా(Dussehra 2024) వేళ మీకోసం కొన్ని స్పెషల్ స్వీట్ రెసిపీలు పట్టుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేయండి!
రవ్వ జిలేబీ :
కావాల్సిన పదార్థాలు :
- ఒక కప్పు - బొంబాయి రవ్వ
- పావు కప్పు - మైదా
- అర కప్పు - తాజా పెరుగు
- అర చెంచా - బేకింగ్ పౌడర్
- చిటికెడు - ఆరెంజ్‌ఫుడ్ కలర్
- ఒకటిన్నర కప్పు - పంచదార
- సగం చెక్క - నిమ్మకాయ
- అర చెంచా - యాలకుల పొడి
- వేయించేందుకు సరిపడా - నూనె
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా స్టౌ ఆన్ చేసి కడాయి పెట్టుకొని చక్కెర, పావు కప్పు వాటర్ పోసుకొని మరిగించుకోవాలి.
- చక్కెర కరిగి తీగపాకంలా వస్తున్నప్పుడు దింపుకొని నిమ్మరసం, యాలకులపొడి వేసి కలిపి మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, మైదా, ఆరెంజ్‌ఫుడ్ కలర్, బేకింగ్ పౌడర్, పెరుగు వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ విధంగా మిక్స్ చేసుకున్నాక అందులో పావు కప్పు వాటర్ పోసి కలుపుకోవాలి. ఆపై గిన్నె మీద మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి.
- ఇరవై నిమిషాలు అయ్యాక మరోసారి ఈ మిశ్రమాన్ని కలిపి.. కోన్‌లా మడిచి రంధ్రం చేసిన ప్లాస్టిక్ కవరులోకి తీసుకుని కాగుతున్న నూనెలో జిలేబీల్లా(Jalebi)వేసుకుని వేయించుకోవాలి.
- తర్వాత వాటిని ముందు చేసిపెట్టుకున్న చక్కెర పాకంలో వేసి అయిదారు నిమిషాలయ్యాక తీసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే 'రవ్వ జిలేబీ' రెడీ!
దసరా స్పెషల్ టేస్టీ కజ్జికాయలు - ఈ టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు!
మూంగ్‌దాల్ లడ్డు :
కావాల్సిన పదార్థాలు :
- ఒక కప్పు - పెసరపప్పు
- కప్పు - చక్కెరపొడి
- పావు కప్పు - నెయ్యి
- అర చెంచా - యాలకుల పొడి
- డ్రైఫ్రూట్స్ పలుకులు - అన్నీ కలిపి పావుకప్పు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా స్టౌపై కడాయి పెట్టుకొని పెసరపప్పును దోరగా వేయించుకోవాలి. తర్వాత వేడి చల్లారాక దాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం మీరు గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పొడి, చక్కెర పొడిని విడివిడిగా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడి అయ్యాక.. అందులో పెసరపప్పు పొడి, చక్కెర పొడి, యాలకుల పొడి వేసి వేయించుకోవాలి.
- ఈ మిశ్రమం ముద్దలా అవుతున్నప్పుడు డ్రైఫ్రూట్స్ పలుకులు వేసి అన్నింటినీ బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేసుకోవాలి.
- ఇక చివరగా వేడి కాస్త చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లా(Laddu)చుట్టుకుంటే సరిపోతుంది. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే "మూంగ్‌దాల్ లడ్డూలు" రెడీ!
దసరా స్పెషల్ : బూందీతో ఎప్పుడూ లడ్డూనేనా! - ఈసారి కొత్తగా మిఠాయి చేసుకోండి!
పాల బూరెలు :
కావాల్సిన పదార్థాలు :
- 3 కప్పులు - బియ్యప్పిండి
- 2 కప్పులు - బెల్లం తురుము
- ఒకటిన్నర కప్పులు - పాలు
- ఒక కప్పు - మైదాపిండి
- చిటికెడు - ఉప్పు
- రెండు - యాలకులు
- వేయించడానికి సరిపడా - నూనె
తయారీ విధానం :
- ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక వెడల్పాటి బేసిన్లో బియ్యప్పిండి, యాలకుల పొడి, కరిగించిన బెల్లం, మైదా పిండి, పాలు, ఉప్పు వేసి కాస్త జారుగా పిండిని కలపాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక.. ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా గరిటెతో తీసుకుని కాగిన నూనెలో బూరెల్లా వేసి వేయించుకొని తీసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "పాల బూరెలు" రెడీ!
తిన్నాకొద్దీ తినాలనిపించే టేస్టీ "పప్పు చెక్కలు" - పిండి కలపడంలోనే సీక్రెట్ అంతా!