Dressing Tips for Flight Passengers : సాధారణంగా జర్నీ చేసేటప్పుడు ధరించే దుస్తుల విషయంలో చాలా మంది ఫ్యాషన్, కంఫర్ట్ ఈ రెండింటికీ ఎక్కువ ప్రియార్టీ ఇస్తుంటారు. అందులోనూ విమాన ప్రయాణమంటే ఇంకాస్త ట్రెండీగా కనిపించేలా దుస్తుల్ని సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలోనే కొంతమంది షార్ట్స్ ధరించి జర్నీ చేస్తుంటారు. కానీ, వీలైనంత వరకు విమానాలలోప్రయాణించేటప్పుడు అలాంటి దుస్తులు ధరించకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. అంతేకాదు, అలాంటివి ధరించడం వివిధ రకాల అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. మరి, అందుకు గల కారణాలేంటి? విమాన ప్రయాణంలో డ్రస్సింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
షార్ట్స్ ధరించకపోవడమే బెటర్!
చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కంఫర్ట్‌గా ఉంటాయని షార్ట్స్, మినీ బాడీకాన్స్ వంటివి ధరిస్తుంటారు. అయితే, విమాన ప్రయాణంలో అవి సౌకర్యవంతంగా ఉండడం అటుంచితే వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే అలాంటి పొట్టి దుస్తులుధరించడం వల్ల చాలావరకు చర్మం బయటికి ఎక్స్‌పోజ్ అవుతుంది. వాస్తవానికి విమానాల్లో కొన్ని వందల మంది ప్రయాణించడం వల్ల అందులో ఉండే సీట్లు, వాటికి అనుసంధానమైన హ్యాండ్‌రెస్ట్, ఫుట్‌రెస్ట్ వంటివి వివిధ క్రిములకు ఆలవాలంగా మారుతాయి.
అప్పుడు మీరు తిరిగి అదే సీట్లో కూర్చోవడం, అవే ఉపరితలాలపై మీ కాళ్లు, చేతులు తగలడం వల్ల అక్కడి బ్యాక్టీరియా, క్రిములు స్కిన్ పైకి చేరతాయి. ఇవి చేతులు, ముక్కు, నోటి ద్వారా బాడీలోకి ప్రవేశించి వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు, షార్ట్స్ వంటి పొట్టి దుస్తులు వేసుకోవడం వల్ల తొడలకు అంటుకున్న బ్యాక్టీరియా వెజైనా దగ్గరికి చేరే అవకాశాలూ లేకపోలేదంటున్నారు. ఫలితంగా వెజైనల్ ఇన్ఫెక్షన్లు, ప్రత్యుత్పత్తికి సంబంధించిన సమస్యలూ తలెత్తే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. కాబట్టి, విమాన ప్రయాణంలో అటు సౌకర్యానికి, స్టైల్‌కి ప్రాధాన్యమిస్తూనే ఇటు ఆరోగ్యానికీ నష్టం వాటిల్లకుండా దుస్తులు ధరించడం మంచిదంటున్నారు.