తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోటికి కమ్మగా, పుల్లగా ఉండే "చింతకాయ పచ్చడి" - ఈ కొలతలతో పెడితే ఏడాది పైనే నిల్వ!

ఈ కొలతలతో "చింతకాయ నిల్వ పచ్చడి" పెట్టండి - టేస్ట్ అద్దిరిపోతుంది!

CHINTHAKAYA PACHADI Recipe
Chinthakaya Nilava Pachadi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2024, 12:11 PM IST

Chinthakaya Nilava Pachadi Recipe :చాలా మంది ఇంట్లో ఎంత మంచి కూర వండినా సరే.. ఒక ముద్ద పచ్చడితో తినడానికి ఇష్టపడుతుంటారు. అది ఊరగాయ కావొచ్చు లేదా అప్పటికప్పుడు చేసుకునే మరేదైనా పచ్చడి కావొచ్చు. దీనిని దృష్టిలో పెట్టుకొనే కొందరు ఆవకాయ, ఉసిరి, చింతకాయలతోనిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, కొంతమంది చింతకాయ నిల్వ పచ్చడి ఎంత మంచిగా పెట్టినా త్వరగా బూజు పడుతుందని ఫీల్ అవుతుంటారు. అయితే, ఈసారి చింతకాయలతో నిల్వ పచ్చడిని పెట్టుకునేటప్పుడు ఈ కొలతలు ఫాలో అవ్వండి. పచ్చడి పర్ఫెక్ట్​గా కుదరడమే కాకుండా ఏడాది పైనే నిల్వ ఉంటుంది! పైగా టేస్ట్​ కూడా అద్దిరిపోతుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పచ్చి చింతకాయలు - 1 కేజీ
  • దొడ్డు ఉప్పు - 200 గ్రాములు
  • పసుపు - 1 టేబుల్​స్పూన్
  • వేయించిన మెంతుల పొడి - 1 టేబుల్​స్పూన్

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా చింతకాయలను ఈనెలు తీయకుండా రెండు, మూడుసార్లు శుభ్రంగా కడగాలి. ఆపై వాటిని ఒక పొడి క్లాత్​తో శుభ్రంగా తుడిచి ఫ్యాన్ కింద మరో క్లాత్​పై పరచి ఒక అరగంటపాటు అరనివ్వాలి. అనంతరం చింతకాయల చివరన కొద్దిగా కట్ చేసి అన్నింటి ఈనెలను తీసేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు రోలు, రోకలిని శుభ్రంగా కడిగి ఏమాత్రం తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత రోట్లో చింతకాయలను తుంపి వేసుకొని రుబ్బుకోవాలి. అలా రుబ్బుకునేటప్పుడు కొన్ని కొన్ని చింతకాయలు, కొద్ది కొద్దిగా దొడ్డు ఉప్పు, పసుపు వేసుకుంటూ పచ్చడిని దంచుకోవాలి. ఒకవేళ ఉప్పు ఎక్కువ అవుతుందనుకుంటే మీ రుచికి సరిపడా వేసుకోవాలి.
  • ఈ క్రమంలోనే చాలా మందికి మిక్సీలో రుబ్బుకోవచ్చు కదా అనే సందేహం వస్తుంది. కానీ మిక్సీలో వేసుకుంటే చింతకాయలలో ఉన్న విత్తనాలు కూడా నలిగి పచ్చడి కాస్త వగరుగా అనిపిస్తుంది. అందుకే మిక్సీ కంటే రోట్లో రుబ్బుకుంటేనే పచ్చడిరుచికరంగా వస్తుందని గుర్తుంచుకోవాలి.
  • అలాగే ముందుగానే పచ్చడిని మరీ మెత్తగా దంచుకోకుండా కచ్చాపచ్చాగా ఉండేలా దంచుకొని గాజు సీసా లేదా జార్​లోకి తీసుకోవాలి. అనంతరం ఆ జార్​కి తడి తగలకుండా ఒక వారం పక్కన పెట్టి ఊరనివ్వాలి.
  • వారం తర్వాత ఆ పచ్చడిని కొద్దికొద్దిగా రోట్లో వేసుకొని దంచుకోవాలి. అలా దంచుకునేటప్పుడు స్పూన్ సహాయంతో పచ్చడిలో ఉన్న ఈనెలు, గింజలు వంటివన్నీ తీసేసుకొని మెత్తగా దంచుకోవాలి. అలా పచ్చడి మొత్తాన్ని దంచుకొని ఒక బౌల్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం బౌల్​లోకి తీసుకున్న పచ్చడిలో వేయించిన మెంతుల పొడి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత పచ్చడిని గాలి చొరబడని గాజు సీసా లేదా జాడీలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇలా చింతకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే కనీసం ఏడాదికి పైనే తాజాగా నిల్వ ఉంటుంది!
  • ఇక మీకు తినాలనిపించినప్పుడు జాడీలో నుంచి కొద్దిగా తీసుకొని తాలింపు పెట్టుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "చింతకాయ పచ్చడి" మీ ముందు ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details