Gobi 65 Recipe in Telugu :క్యాలీఫ్లవర్ పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయల్లో ఒకటి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దీన్ని కొందరు అంతగా తినడానికి ఇష్టపడరు. ఇక పిల్లలైతే దీని పేరు చెబితే చాలు క్యాలీఫ్లవర్ హా.. మమ్మీ అంటూ ముఖం చిట్లిస్తుంటారు. మీ పిల్లలు క్యాలీఫ్లవర్తినడానికి ఇష్టపడట్లేదా? అయితే, ఓసారి ఇలా "గోబీ 65" చేసి పెట్టండి. టేస్ట్ సూపర్‌గా ఉండే దీన్ని తిన్నా కొద్దీ ఇంకొంచం పెట్టు మమ్మీ అని అడిగి మరీ తింటారు! ఈ రెసిపీని అన్నంలోకి సైడ్ డిష్‌గా మాత్రమే కాదు.. డైరెక్ట్‌గా స్నాక్స్‌గా తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది. ఇంతకీ, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- క్యాలీఫ్లవర్ ముక్కలు - 1 కప్పు
- మైదా - 3 టేబుల్‌స్పూన్లు
- కార్న్‌ఫ్లోర్ - 3 టేబుల్‌స్పూన్లు
- బియ్యప్పిండి - 1 టేబుల్‌స్పూన్
- కారం - 1 టీస్పూన్
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్‌స్పూన్
- గరంమసాలా - 1 టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- నూనె - డీప్ ఫ్రైకి తగినంత
- పచ్చిమిర్చి - 3(నిలువుగా కట్ చేసుకోవాలి)
- కరివేపాకు - కొద్దిగా
ఇంట్లో క్యాలీఫ్లవర్ ఎవరూ తినట్లేదా? - ఇలా ఫ్రై చేస్తే మొత్తం ఖాళీ చేస్తారు!
తయారీ విధానం :
- ముందుగా క్యాలీఫ్లవర్ని గోబీ 65కి కావాల్సిన విధంగా ఒక కప్పు వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక బౌల్లో వేడి వాటర్ తీసుకొని అందులో వేసి ఒక నిమిషం పాటు ఉంచి ఆపై జల్లి గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా, కార్న్‌ఫ్లోర్, బియ్యప్పిండి, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరంమసాలా, కొత్తిమీరతరుగు వేసుకొని విస్కర్ సహాయంతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ మాదిరిగా కలుపుకోవాలి.
- అనంతరం ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు తీసుకొని అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్‌ని వేసి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనెవేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ముందుగా కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
- ఆపై మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ రెండు వైపులా ఎర్రగా మారేంత వరకు వేయించుకోవాలి. అందుకోసం 5 నిమిషాల సమయం పట్టొచ్చు.
- ఆవిధంగా వేయించుకున్నాక పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకొని కాసేపు వేయించుకొని ప్లేట్లోకి తీసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "గోబీ 65" రెడీ!
- మరి, నచ్చిందా.. అయితే, మీరూ ఓసారి క్యాలీఫ్లవర్ 65 ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు!
క్రిస్పీ క్రిస్పీగా కాలీఫ్లవర్ పకోడి - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!