Carrot Coconut Soup Recipe in Telugu :వాతావరణం చల్లగా మారిన వేళ చాలా మందికి వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది. అందులో చిన్నా, పెద్దా అందరూ నచ్చే చిక్కనైన, చక్కనైన సూప్‌లు జుర్రితే భలే ఉంటుంది కదా! ఈ క్రమంలోనే ఎక్కువ మంది చలికాలం వెచ్చదనం కోసం టమాటా, కార్న్, చికెన్ సూప్ వంటి రకరకాల సూప్‌లను ప్రిపేర్ చేసుకొని ఆస్వాదిస్తుంటారు. అలాంటి వారికోసమే ఒక అద్దిరిపోయే సూప్ రెసిపీ తీసుకొచ్చాం. అదే, క్యారెట్ కొబ్బరి సూప్. దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకుని తాగారంటే ఆహా ఏమి రుచి అనడం పక్కా! అంతేకాదు, నోటికి ఏమి రుచించనప్పుడు ఈ సూప్‌ని తాగినా మంచి రిలీఫ్ కలుగుతుంది. పైగా క్యారెట్, కొబ్బరిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మరి, ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ సూప్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- 3 కప్పులు - క్యారెట్ తురుము
- అర కప్పు - చిక్కటి కొబ్బరి పాలు
- 1 టేబుల్‌స్పూన్ - అల్లం తరుగు
- 1 టేబుల్‌స్పూన్ - నెయ్యి
- అర కప్పు - ఉల్లి తరుగు
- రుచికి సరిపడా - ఉప్పు
- చారెడు - కొత్తిమీర, ఉల్లికాడల తరుగు
- చెంచా - మిరియాల పొడి
- ఒకటి - బిర్యానీ ఆకు
చలికాలంలో "మునగ సూప్"తో జలుబు, దగ్గు తగ్గుతాయట!- ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా రెసిపీలోకి 3 కప్పుల పరిమాణంలో క్యారెట్ తురుముని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. అలాగే, సన్నని ఉల్లిపాయ, అల్లం తరుగుని రెడీగా ఉంచుకోవాలి. కొత్తిమీర, ఉల్లికాడలను సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడెక్కాక బిర్యానీ ఆకు, ముందుగా తరిగి పెట్టుకున్న సన్నని అల్లం, ఉల్లి తరుగు వేసుకొని వేయించుకోవాలి.
- అవి వేగాయనుకున్నాక క్యారెట్ తురుము, తగినంత ఉప్పు, మిరియాల పొడి, 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని కలిపి మరిగించుకోవాలి.
- ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఉడికిన తర్వాత గరిటెతో మెత్తగా మాష్ చేసుకోవాలి. ఆరేడు నిమిషాల తర్వాత అందులో కొబ్బరి పాలు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆపై స్టౌ ఆఫ్ చేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లికాడల తరుగు వేసి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరమైన ఘుమఘుమలాడే "క్యారెట్ కొబ్బరి సూప్" రెడీ!
చలికాలంలో జలుబు, దగ్గును పోగొట్టే "జింజర్ గార్లిక్ సూప్" - వేడివేడిగా ఎంతో హాయిగా ఉంటుంది!