Best Tips to Cooking Mutton in Telugu:సండే వచ్చిందంటే మెజార్టీ జనాల ఇళ్లలో నాన్ వెజ్ ఘుమఘుమలు అద్దిరిపోతాయి. ఇక మాంసాహారం అంటే ఫస్ట్ అందరి చూపు రేట్ తక్కువగా ఉండే చికెన్ వైపే ఉంటుంది. అయితే బర్డ్ ఫ్లూ కారణంగా చాలా మంది చికెన్ తినడం మానేస్తున్నారు. ఫలితంగా చేపలు, మటన్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు ముదురు మాంసాన్ని ప్రజలకు అమ్ముతుంటారు. మటన్ దొరికిందన్న ఆనందంలో అది లేతదా? ముదిరిందా అని చూసుకోరు. ఇక ఇంటికి వెళ్లి కుక్కర్లో వండితే ఎన్ని కూతలు వచ్చినా ముక్క సరిగా ఉడకదు. దీంతో మళ్లీ మళ్లీ వండాల్సిన పరిస్థితి. అలాంటి సిట్యుయేషన్ రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుందట. ఇలా చేస్తే ఎంత ముదిరిన మాంసం అయినా చక్కగా, మెత్తగా ఉడికిపోద్ది. ఫలితంగా ఇష్టంగా ఆరగించేయొచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.
నిమ్మరసం :దాదాపు అందరి ఇళ్లలో నిమ్మకాయలు ఉంటాయి. అయితే మటన్ ముక్క మెత్తగా ఉడకడంలో నిమ్మరసం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని పాకశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. లెమన్ జ్యూస్ యాసిడ్ లక్షణాలను కలిగి ఉంటుందని, దీంతో మటన్ ముక్కలు చక్కగా ఉడుకుతాయంటున్నారు. అంతేకాదు కర్రీకి మంచి ఫ్లేవర్ కూడా వస్తుందని చెబుతున్నారు. నిమ్మరసం ప్లేస్‌లో వెనిగర్ వాడినా ఉపయోగం ఉంటుందని సూచిస్తున్నారు.
ఉప్పు :సాధారణంగా మటన్ ఉడికించేటప్పుడు ఉప్పు వేస్తుంటారు. అయితే కుక్ చేసే సమయంలో కాకుండా ముందే ఉప్పు వేస్తే మటన్ మంచిగా ఉడుకుతుందని చెబుతున్నారు. అంటే మటన్‌ను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఆపై అందులో కాస్త రాళ్ల ఉప్పు వేసి కలిపి ఓ గంట సేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత కర్రీ వండుకుంటే చాలా త్వరగా, మెత్తగా ఉడుకుతుందని అంటున్నారు.
చాయ్ డికాషన్ :మటన్ చక్కగా ఉడికించడంలో చాయ్ డికాషన్ పనిచేస్తుందని అంటున్నారు. చక్కెర వేయకుండా డికాషన్ మరగబెట్టండి. ఇప్పుడు జాలితో టీపొడి మొత్తం వడకట్టండి. ఆ తర్వాత డికాషన్ వాటర్‌ను, క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ గిన్నెలో పోసిఒక గంటపాటు నానబెట్టండి. ఆ తర్వాత మీ పద్ధతిలో కుక్ చేస్కుంటే మటన్ చాలా చక్కగా ఉడుకుతుంది. ఈ డికాషన్‌లో ఉండే ట్యానిన్లు మాంసం ముక్కలను మెత్తగా ఉడికేలా చేస్తాయని చెబుతున్నారు.
బొప్పాయి : మటన్ ముక్కలు మెత్తగా కుక్ కావడానికి బొప్పాయి మంచి ఉపాయం అని అంటున్నారు నిపుణులు. కర్రీలో బొప్పాయి ఆకు లేదంటే పచ్చి బొప్పాయి ముక్కలు వేసుకుంటే కర్రీ చాలా బాగా ఉడుకుతుందని అంటున్నారు. బొప్పాయిలో ఉండే పెపైన్ అనే పదార్థం మాంసం ముక్కల్లోని బంధాలు విడిపోవడానికి కారణం అవుతుందని, దీంతో ముక్కలు మెత్తగా ఉడుకుతాయని చెబుతున్నారు.