Annavaram Prasadam Recipe in Telugu :దేవాలయాల్లో ఒక్కో టెంపుల్కి ఒక్కో విశేషం ఉన్నట్టే భక్తులకు పంచే ప్రసాదాల్లోనూ ప్రత్యేకత ఉంటుంది. నార్మల్గా ఆలయాల్లో పులిహోరో, లడ్డూనో, చక్కెరపొంగలో ప్రసాదంగా పెడుతుంటారు. కానీ, అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లో ఇచ్చే ప్రసాదం మాత్రం వీటికి భిన్నంగా ఉంటుంది. నెయ్యి, యాలకుల వాసనలతో ఘుమఘుమలాడే తీయని ఆ ప్రసాదం తింటే కలిగే అనుభూతే వేరు. మరి, అంతటి రుచికరమైన ప్రసాదాన్ని ఇంట్లోనూ సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొలతలు ఫాలో అవుతూ చేసుకున్నారంటే టేస్ట్ అన్నవరం ప్రసాదానికి ఏమాత్రం తీసిపోదు! ఇంతకీ, ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- ఎర్ర గోధుమ రవ్వ - 1 కప్పు
- యాలకులు - 5
- జాజికాయ ముక్క - చిన్నది
- పటిక - కొద్దిగా
- పంచదార - కప్పు
- బెల్లం తురుము - 1 కప్పు
- నెయ్యి - ముప్పావు కప్పు
- కుంకుమ పువ్వు - 2 చిటికెళ్లు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా మిక్సీ జార్లో జాజికాయ, యాలకులు, పటిక, కుంకుమపువ్వు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కాస్త మందంగా ఉండే పాన్ పెట్టుకొని ఎర్ర గోధుమ రవ్వ వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ 10 నుంచి 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. రవ్వ చక్కగా వేగి రంగు మారి మంచి సువాసన రావాలి. ఆవిధంగా వేయించుకున్నాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి.
- అనంతరం స్టౌ మీద అదే పాన్ పెట్టుకొని 3 కప్పుల వాటర్ పోసుకొని హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. వాటర్ బాగా వేడెక్కి ఎసరు మరుగుతున్నప్పుడు.. అందులో ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న రవ్వను యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
- ఆపై పాన్ మీద మూతపెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద గోధుమ రవ్వ మెత్తగా ఉడికే ఉడికించుకోవాలి. ఇందుకోసం 15 నిమిషాల పాటు టైమ్ పట్టొచ్చు.
- ఆవిధంగా గోధుమ రవ్వ ఉడికిందనుకున్నాక.. అందులో చక్కెరవేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆపై మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. అందుకోసం 20 నుంచి 25 నిమిషాల సమయం పట్టొచ్చు.
- మిశ్రమం చక్కగా ఉడికి మంచి రంగులోకి వచ్చాక అప్పుడు అందులో బెల్లం తురుము యాడ్ చేసుకొని అది పూర్తిగా కరిగే వరకు ఉడికించుకోవాలి.
- బెల్లం పూర్తిగా కరిగిపోయి మిశ్రమంలో నీరు వదులుతున్నప్పుడు నెయ్యి వేసుకొని ఏ మాత్రం కదపకుండా మూతపెట్టి లో ఫ్లేమ్ మీద 5 నుంచి 6 నిమిషాల పాటు అలా ఉడకనివ్వాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక మిశ్రమం నెయ్యిలో మరిగి మంచి గోల్డెన్ కలర్లోకి వస్తుంది. అలా వచ్చాక అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న యాలకుల పొడి మిశ్రమాన్ని వేసుకొని బాగా కలిపి మూతపెట్టి లో ఫ్లేమ్ మీద మరో 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలు.
- అప్పుడు మిశ్రమంలో నెయ్యి పైకి తేలుతూ ఘుమఘుమలాడుతుంది. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "అన్నవరం ప్రసాదం" రెడీ!