Resignation Time Mistakes to Avoid: మనం ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, కొత్త సంస్థలో ఉద్యోగమొచ్చినా, కొన్నాళ్ల పాటు కెరీర్‌కు విరామమివ్వాలనుకున్నా ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయడం సహజమే! అయితే ఈ సమయంలో కొంతమంది ప్రస్తుతం తాము పనిచేస్తున్న సంస్థతో ఇకపై తమకు ఎలాంటి సంబంధం ఉండదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఉన్నతాధికారులతో ఇంతకు ముందున్నంత వినయంగా కాకుండా.. ప్రతి విషయంలోనూ వాళ్ల పట్ల నిర్లక్ష్యపూరిత ధోరణిని ప్రదర్శిస్తుంటారు. అయితే ఇవి ఉత్తమ ఉద్యోగికి ఉండాల్సిన లక్షణాలు కాదని నిపుణులు అంటున్నారు. సంస్థను వీడుతున్నప్పటికీ అది వృత్తిధర్మంగా, హుందాగానే ఉండాలే తప్ప.. ఇటు మీరు ఇబ్బంది పడుతూ, అటు ఇప్పటిదాకా మీతో పాటు పనిచేసిన సహోద్యోగులు, యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజీనామా చేసినా, ప్రస్తుత సంస్థను వీడుతున్నా.. ఉద్యోగులు తమ కెరీర్ ఉన్నతి కోసం కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అబద్ధాలు వద్దు!
ఉద్యోగం మారడానికి, మానేయడానికి పలు వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలు ఉంటాయి. అయితే ఈ క్రమంలో తాము ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నామంటే సంస్థ ఒప్పుకుంటుందో, లేదోనని.. కొంతమంది అబద్ధాలు చెబుతుంటారు. వేరే సంస్థలో ఉద్యోగం వచ్చినా.. ఇంటి బాధ్యతల రీత్యా కెరీర్‌కు విరామం ఇవ్వాలనుకుంటున్నట్లు అబద్ధాలు ఆడుతుంటారు. వాస్తవంగా ఏళ్ల కొద్దీ అనుభవం ఉన్న ఉద్యోగిని అంత సులభంగా వదులుకోవడానికి ఏ సంస్థా ఒప్పుకోదు. కాబట్టి ఈ విషయంలో మీరు మీ సంస్థ, పైఅధికారులతో పారదర్శకంగా వ్యవహరించడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా మీరు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారన్న విషయాలు కూడా అందరికీ సులభంగా తెలిసిపోతాయి.
కృతజ్ఞతా భావం ముఖ్యం!
మనం సంస్థలో పదేళ్లు పనిచేసినా, ఏడాది పనిచేసినా.. యాజమాన్యం, సహోద్యోగులతో ఓ స్నేహపూర్వకమైన అనుబంధం ఏర్పడుతుంది. అయితే వేరే ఉద్యోగంలోకి మారుతున్నామన్న కారణంతో ఇకపై వాళ్లతో మనకు సంబంధం లేదన్నట్లుగా ఏదో పైపైన వీడ్కోలు చెప్పడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఓరోజు మీ టీమ్, పైఅధికారులతో చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. మీరు ఈ సంస్థలో చేరినప్పట్నుంచి పని విషయంలో గడించిన అనుభవం గురించి, ఈ క్రమంలోనే మిమ్మల్ని ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు తెలపాలని సలహా ఇస్తున్నారు. సహోద్యోగులు-బాస్‌తో మీకు ఎదురైన అనుభవాలు, అనుభూతులు పంచుకోవాలని అంటున్నారు. వీలైతే అందరికీ ఓ చిన్న ట్రీట్ ఇవ్వండం వల్ల స్నేహపూర్వకంగానే సంస్థ నుంచి మీరు బయటికి వెళ్లినట్లవుతుంది. అలాగే భవిష్యత్తులో మళ్లీ తిరిగి ఇదే సంస్థలోకి రావాలనుకున్నా.. ఇలాంటి పాజిటివిటీ మీకు ప్లస్ అవుతుందని చెబుతున్నారు.