Protein Rich Foods for Energy:ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఒత్తిడి, అలసటతో సతమతమవుతుంటారు చాలా మంది. ఇలాంటి బిజీ లైఫ్‌స్టైల్‌తో ఎదురయ్యే అలసటను దూరం చేసుకొని చురుగ్గా ఉండాలంటే ప్రొటీన్లతో నిండిన ఆహార పదార్థాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీర కండర వ్యవస్థను దృఢం చేస్తాయని.. ఫలితంగా అలసట దూరమవుతుందని అంటున్నారు. అంతేకాకుండా ఈ పోషకాలు గుండె ఆరోగ్యాన్ని, రోగ నిరోధకశక్తిని పెంపొందించేందుకూ దోహదం చేస్తాయని తెలిపారు. ఇలా ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుందని.. ఫలితంగా బరువునూ అదుపులో ఉంచుకోవచ్చని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నట్స్: ప్రొటీన్లతో నిండిన బాదంపప్పు, పిస్తా, అక్రోట్ వంటి గింజలను రోజూ మితంగా తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇవి ముఖ్యంగా గుండెకు మేలు చేస్తాయని.. వీటిని సలాడ్లు, ఉడికించిన కూరగాయలతో కూడా కలుపుకొని తినొచ్చని సూచిస్తున్నారు. అయితే నట్స్‌లో క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మితంగానే తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. 2023లో Nutrients జర్నల్‌లో ప్రచురితమైన "Nuts and Cardiovascular Disease Outcomes: A Review of the Evidence and Future Directions" అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
పాలు, పాల పదార్థాలు: కండరాల నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు.. పాలు, పాల పదార్థాల్లో పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇవి రక్తపోటు అదుపులో ఉంచడానికీ తోడ్పడతాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తక్కువ కొవ్వులుండే పాల పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు.
సోయాబీన్స్: సోయాబీన్స్‌లో ప్రొటీన్ల మోతాదు ఎక్కువగా ఉంటుందని.. ఇంకా వీటిని సోయా పాలు, సోయా పేస్ట్, టోఫూ రూపంలోనూ తీసుకోవచ్చని అంటున్నారు. మామూలు పాలలో మాదిరిగానే సోయా పాలలోనూ ప్రొటీన్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇవి కొంతమందికి పడకపోవచ్చని.. అలాంటి వారు వైద్యులను సంప్రదించి తీసుకోవాలని సూచిస్తున్నారు.