తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఈ 10 రూల్స్ పాటిస్తే మీ పిల్లల ఫ్యూచర్ సూపర్! పేరెంటింగ్ టిప్స్ మీకు తెలుసా? - PARENTING TIPS FOR TEENAGERS

-పిల్లలను పెంచడానికి ఈ 10 సూత్రాలు పాటించాలట! -ఇవి పాటిస్తే మంచిదని నిపుణులు సలహాలు!

Parenting Tips for Teenage Daughter
Parenting Tips for Teenage Daughter (Getty Images)

By ETV Bharat Lifestyle Team

Published : Jan 20, 2025, 4:06 PM IST

Parenting Tips for Teenage Daughter:టీనేజ్​లోకి అడుగుపెట్టే సమయంలో అమ్మాయిల్లోనే కాకుండా.. అమ్మల్లోనూ ఆందోళన ప్రారంభమవుతుంది. పిల్లలకు ఏది ఎంతవరకూ చెప్పాలి? ఏది చెప్పకూడదు? ఇలా ఎన్నో సందేహాలు, అపోహలు మదిలో ఉంచాయి. ఎందుకంటే బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెడుతున్న ఈ దశ ఎంతో కీలకంగా భావిస్తుంటారు. ఇప్పుడు ఏర్పరచుకునే అలవాట్లు, జీవనశైలి సూత్రాలే వాళ్ల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది అని.. ఈ సమయంలో అమ్మలు ఓ 10 సూత్రాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. భావోద్వేగాలపరంగా
    పిల్లలు ప్రతి విషయాన్ని నేర్చుకునేదీ ఈ సమయంలోనేనని.. ఇంకా భావోద్వేగాల పరిణతి ఇప్పుడే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వారిని విమర్శిస్తూ, కఠినంగా వ్యవహరిస్తే కుటుంబంతోనే కాకుండా, తోటి పిల్లలతోనూ వాళ్లు ఎమోషనల్‌గా దూరమవుతారని నిపుణులు అంటున్నారు. ఫలితంగా తమ సమస్యలను చెప్పడానికీ ముందుకురాక ఇబ్బంది పడుతుంటారని వివరిస్తున్నారు. కాబట్టి, తప్పు సరిచేసేముందు వాళ్ల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో కుటుంబం, టీచర్లు వాళ్లను మరింతగా అర్థంచేసుకోవాల్సి ఉంటుందని వెల్లడిస్తున్నారు.
  2. అపోహలు తొలగిస్తేనే
    ముఖ్యంగా ఈ సమయంలో వచ్చే పీరియడ్స్.. శారీరకంగా, మానసికంగా అమ్మాయిల్లో చాలా మార్పులే తెస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, వాటి గురించి పీరియడ్స్‌ మొదలవ్వకముందే వారికి అర్థమయ్యేలా లాజికల్‌గా, మనసు నొప్పించకుండా వివరించాలని అంటున్నారు. అప్పుడే వారి మనసులో ఉన్న భయాలు, అపోహలూ తొలగిపోయి.. వస్తున్న మార్పులను అర్థం చేసుకుంటారని వివరిస్తున్నారు.
  3. శుభ్రతా ముఖ్యమే
    ఇక పీరియడ్స్‌ ప్రారంభమయ్యాక పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే.. ప్రతి 4-6 గంటలకొకసారి ప్యాడ్‌ మార్చుకునేలా చూడాలని వివరిస్తున్నారు. మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ వంటివి వాడుతుంటే వాటిని శుభ్రపరచడం, స్టెరిలైజ్‌ చేయడం వంటివి నేర్పించాలని చెబుతున్నారు. క్రమం తప్పకుండా స్నానం, దుస్తులు, లోదుస్తులు వంటివి మార్చుకోవడం అలవాటు చేయాలని వెల్లడిస్తున్నారు.
  4. ఎదుగుదలకు తగినట్లుగా
    ఎదిగే వయసులో ఉన్న అమ్మాయిలకు పోషకాహారం తప్పనిసరని చెబుతుంటారు. ఎంత బిజీగా ఉన్నా సరే.. పిల్లలకు మంచి ఆహారం అందించడం మాత్రం మర్చిపోవద్దని సలహా ఇస్తున్నారు. అధిక ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, లో ఫ్యాట్, లో కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం ఇవ్వాలని సూచిస్తున్నారు. దీని గురించి ఒకరోజు ముందుగానే ప్రణాళిక వేసుకుంటే వాటి తయారీ సులభం అవుతుందని అంటున్నారు.
  5. నీళ్లు తాగుతున్నారా?
    ఆహారం ఒక్కటే కాకుండా.. సరైన మోతాదులో నీళ్లు తీసుకోవడం కూడా ముఖ్యమేనని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది పిల్లలు చదువుల్లో పడి స్కూల్లో నీళ్లు తాగడం మర్చిపోతుంటారు. కాబట్టి, రోజుకి కనీసం 12గ్లాసుల నీళ్లు తాగేలా వారిని చూసుకోవాలని సూచిస్తున్నారు. చక్కెరలేని పండ్లరసాలూ తాగించాలని సలహా ఇస్తున్నారు. కాఫీ, టీ, కార్బొనేటెడ్‌ డ్రింక్‌లు, కృత్రిమ తీపి కలిగిన పానీయాలకూ దూరంగా ఉంచాలని హెచ్చరిస్తున్నారు.
  6. హార్మోనుల్లో మార్పులు
    ముఖ్యంగా టీనేజ్‌ పిల్లలను ఇబ్బందిపెట్టే మరో సమస్య మొటిమలు. ఇవే వారిలో ఆత్మన్యూనతకూ దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి, ఇందుకు కారణం హార్మోనుల్లో మార్పులే అని పిల్లలకు అర్థమయ్యేలా చెబుతూనే వాటి గురించి జాగ్రత్తలూ వివరించాలని తెలిపారు. వాటిని గిల్లడం, వత్తడం లాంటివి చేయనీయకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. పీహెచ్‌ సమతుల్యత ఉన్న ఫేస్‌వాష్‌ను రోజుకి రెండుసార్లు వాడాలని.. ఆయిల్‌ ఫేస్‌క్రీములకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. మఖ్యంగా అమ్మాయిల్లో అండర్‌ ఆర్మ్స్, ప్రైవేట్‌ భాగాల్లోని అవాంఛిత రోమాలు చెమట, ఇన్ఫెక్షన్లకూ దారితీయొచ్చని.. కాబట్టి, షేవింగ్, వ్యాక్సింగ్‌ వంటి పద్ధతులను పిల్లలకు వివరించాలని చెబుతున్నారు. ఇకపోతే, బ్రెస్ట్‌ ఎదుగుదల, బ్రా వేసుకోవడం లాంటి విషయాలు వాళ్లకు పూర్తిగా కొత్తగా ఉంటుంది. అందుకే వాళ్లలో వచ్చే ఈ మార్పులన్నింటి గురించి సిగ్గుపడకుండా, సౌకర్యంగా మనతో మాట్లాడగలిగేలా చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.
  7. వ్యాయామంతో
    సిగ్గు, బిడియం వల్ల టీనేజ్‌ పిల్లలు ఆటలకు దూరం అవుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి, ఆ ఫీలింగ్స్‌ను పోగొట్టి వాళ్లు బయటకు వచ్చేలా ప్రోత్సహించాలని నిపుణులు అంటున్నారు. అందుకోసమే స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, వాకింగ్, రన్నింగ్‌ ఇలా ఏదో ఒకదాన్లో భాగమయ్యేలా చూడాలని చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాయామం అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో పిల్లలకు జీవనశైలి వ్యాధులు రాకుండా ఉంటాయని వివరిస్తున్నారు.
  8. ప్రశాంతంగా
    శరీరంలో వచ్చే మార్పులు ఒకవైపు, చదువు మరోవైపు ఫలితంగా పిల్లల్లో ఒత్తిడి కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే, రోజుకి ఒక గంటైనా వాళ్లు ప్రశాంతంగా కూర్చొనేలా సమయమివ్వాలని అంటున్నారు. ఇది వాళ్ల గురించి వాళ్లు ఆలోచించుకునేందుకు సాయపడుతుందని తెలిపారు. డ్రాయింగ్, పెయింటింగ్, కథల పుస్తకాలు, క్రియేటివ్‌ క్రాఫ్ట్‌వర్క్‌ వంటివి చేసేలా పిల్లలను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. అప్పుడే మానసికంగా బ్యాలెన్స్‌డ్‌గా ఉండగలుగుతారని వివరిస్తున్నారు.
  9. గాఢ నిద్ర ఉంటే
    రాత్రిపూట కనీసం 7గంటలపాటు గాఢనిద్ర ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రించేటప్పుడు తాజా, పరిశుభ్రమైన దుస్తులు వేసుకునేలా చూడాలని అంటున్నారు. పడుకునే ముందు కాఫీ, టీలు వంటివి ఇవ్వకూడదని సూచిస్తున్నారు. ఇంకా పరీక్షల సమయంలో రాత్రంతా మేలుకుని చదవకుండా ముందు నుంచే సన్నద్ధమయ్యేలా చూడాలని.. ఇవన్నీ నిద్ర నాణ్యతను పెంచేవని వివరిస్తున్నారు.
  10. అదీ చెప్పాలి
    ఇవేకాకుండా.. టీనేజ్‌ పిల్లలకు వారి పరిధి మేరకు సెక్స్‌ ఎడ్యుకేషన్‌ గురించి అవగాహన కల్పించడమూ ముఖ్యమేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్‌ లాంటి వాటి గురించీ తెలియజేయాలని సూచిస్తున్నారు. అప్పుడే వాళ్లు చైల్డ్‌ అబ్యూజింగ్‌ లాంటివి ఎదుర్కోకుండా ఉంటారని.. ఫలితంగా ఇలాంటి విషయాల గురించి ధైర్యంగా మనతో మాట్లాడతారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ABOUT THE AUTHOR

...view details