తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

"చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? - ఈ హెయిర్​ ప్యాక్స్​ తో చెక్​" - HAIR PACKS TO REDUCE DANDRUFF

- వింటర్​లో చుండ్రు సమస్య విపరీతం - తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్న నిపుణులు

Natural Hair Packs to Reduce Dandruff
Natural Hair Packs to Reduce Dandruff (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2024, 12:35 PM IST

Natural Hair Packs to Reduce Dandruff:ప్రస్తుతం చుండ్రు సమస్య అనేది కామన్​. కాలుష్యం, తీసుకునే ఆహారం, హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులు, జుట్టు, కుదుళ్లను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం.. ఇవన్నీ చుండ్రు సమస్యకు కారణమవుతుంటాయి. ఇక చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువవుతుందంటున్నారు నిపుణులు. ఫలితంగా జుట్టు నిర్జీవంగా మారిపోయి రాలిపోతుంటుందని చెబుతున్నారు. అయితే ఈ సమస్యకు ఇంటి చిట్కాలతోనే చెక్‌ పెట్టచ్చంటున్నారు. అవి ఏంటంటే..

మందారం:మందార ఆకులు, పువ్వుల్లో ఉండే గుణాలు జుట్టు సమస్యల్ని, ముఖ్యంగా చుండ్రును తగ్గించడంలో దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం.. నాలుగు టేబుల్‌ స్పూన్ల హెన్నా పొడిలో మందార ఆకుల పొడి, పువ్వుల పొడి కొద్దిగా వేసి, అందులో కొద్దిగా ఉసిరి పొడి, మెంతుల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా పెరుగు వేసుకుంటూ మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి పూర్తిగా ఆరనివ్వాలని.. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య ఇట్టే పరిష్కారమవుతుందంటున్నారు. అలాగే ఈ హెయిర్‌ప్యాక్ జుట్టు రాలడాన్ని తగ్గించి, ధృడంగా పెరిగేలా చేస్తుందని అంటున్నారు.

మెంతులు:జుట్టు ఆరోగ్యానికి మెంతులు ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే.. కొన్ని హెయిర్ ప్యాక్‌లలో కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. నాలుగు టేబుల్‌ స్పూన్ల హెన్నా పొడి, రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్‌స్పూన్ల పెరుగు, ఒక్కో టేబుల్‌స్పూన్ చొప్పున ఆలివ్ నూనె, వెనిగర్, మెంతిపొడిని వేసి బాగా కలుపుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకొని రెండుమూడు గంటల పాటు ఆరనిచ్చి.. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుందని.. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు సమస్య నుంచి త్వరలోనే ఉపశమనం పొందచ్చంటున్నారు. అలాగే మెంతి ఆకుల సారాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి తలస్నానం చేసినా చుండ్రు సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని నేషనల్​ లైబ్రరీ ఆఫ్​ మెడిసిన్​లో ప్రచురితమైంది(రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి).

పెరుగు, నిమ్మరసం: చుండ్రు సమస్యను తగ్గించడంలో పెరుగు, నిమ్మరసం కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం నాలుగు టేబుల్‌ స్పూన్ల హెన్నా పొడిలో రెండు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం.. కొద్దిగా పెరుగు వేసి పేస్ట్ అయ్యేంత వరకు కలుపుతుండాలి. ఆపై ఈ పేస్ట్​ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి అరగంట పాటు ఉంచుకోవాలంటున్నారు. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుముఖం పడుతుందని అంటున్నారు. ఈ చిట్కాను రెండు వారాలకోసారి పాటించమంటున్నారు.

ముఖ్య గమనిక :ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మునగ గింజల నూనెతో ఇలా ట్రై చేయండి- చుండ్రు, చర్మ సమస్యలు పరార్ అవ్వడం ఖాయం..!

ఈ ఆయుర్వేద చిట్కా ట్రై చేయండి - ఇక చుండ్రు కనిపించదు!

ABOUT THE AUTHOR

...view details