Eye Care Tips for Computer Users :ప్రస్తుతం మన జీవితంలో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు భాగంగా మారిపోయాయి. కొందరి ఉద్యోగాలు అయితే, వీటి మీదే ఆధారపడి ఉంటున్నాయి. తరచూ అంతర్జాలంతో గడిపేవారూ గంటల తరబడి పీసీల ముందు కూర్చుంటున్నారు. ఇలా ఎక్కువసేపు డిజిటల్ పరికరాల తెరను చూస్తే కళ్లు ఒత్తిడికి గురై అలసిపోవచ్చని నేత్రవైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు చూపు కూడా దెబ్బతినొచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా కంప్యూటర్‌తో పనిచేసేవారు కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిదని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- మరీ ప్రకాశవంతమైన లైట్ల వెలుగులో పనిచేస్తే కష్టపడి చూడాల్సి ఉంటుంది. ఫలితంగా కళ్లు త్వరగా, బాగా అలసిపోతాయి. కాబట్టి తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి.
- తల పైన నేరుగా కాంతి పడినా, కిటికీ నుంచి ప్రకాశవంతమైన ఎండ పడినా స్క్రీన్ చూసేటప్పుడు కళ్లకు ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల వీటిని నివారించుకోవాలి. వీలైతే గచ్చుకు లైట్లు (ఫ్లోర్ ల్యాంప్స్) అమర్చుకోవాలి.
- ఒకవేళ కిటికీ తెరవటం తప్పనిసరైతే పక్క వైపు నుంచి కాంతి పడేలా చూసుకోవాలి. కిటికీకి ఎదురుగా గానీ కిటికీకి వీపు చేసి గానీ కూర్చోవద్దు. కర్టెన్లు వేస్తే బయటి వెలుగు తగ్గించుకోవచ్చు.
- డిస్‌ప్లే మీద యాంటీగ్లేర్ స్క్రీన్ బిగిస్తే కళ్లకు హాయిగా ఉంటుంది. ఒకవేళ కళ్లద్దాలు ధరిస్తే యాంటీ రిఫ్లెక్టింగ్ పూత ఉన్నవి తీసుకోవాలి. ఇది తెర నుంచి ప్రతిఫలించే కాంతిని కళ్లకు అంతగా చేరకుండా అడ్డుకుంటుంది.
- ఒకవైపు ప్రింట్ తీసుకున్న పేజీని, మరోవైపు కంప్యూటర్ తెరను మార్చి మార్చి చూడాల్సి వస్తే తెర పక్కన స్టాండ్‌కు పేజీని అమర్చుకోవాలి. స్టాండు మీద తగినంత వెలుతురు పడేలా చూసుకోవాలి. మీరు డెస్క్ ల్యాంప్‌ను వాడుతున్నట్టయితే దీన్నుంచి వచ్చే కాంతి.. కళ్ల మీద, కంప్యూటర్ తెర మీద గానీ పడకుండా చూసుకోవాలి.
- ముఖ్యంగా అదేపనిగా కంప్యూటర్ తెరలను చూడటం మంచిది కాదు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి.. 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను కనీసం 20 సెకండ్ల పాటు చూడాలి. ఫలితంగా కంట్లోని కండరాలు వదులుగా మారి అలసట తగ్గుతుంది. 2018లో Journal of the American Optometric Associationలో ప్రచురితమైన "The effects of the 20-20-20 rule on eye strain and productivity" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
- ఇంకా చేసే పని నుంచి తరచూ విరామం తీసుకోవాలి. ప్రతి గంటకూ కనీసం 10 నిమిషాల సేపు విశ్రాంతి తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. కంప్యూటర్ మీద పనిచేయటం వల్ల తలెత్తే మెడ, వీపు, భుజాల నొప్పి తగ్గటానికిది సాయపడడమే కాకుండా.. కళ్ల మీద ఒత్తిడి తగ్గిస్తుంది.
- డిస్‌ప్లే సెటింగ్స్ మార్చుకోవడం వల్ల కళ్లకు ప్రయోజనం ఉంటుంది. చుట్టుపక్కల పరిస్థితులకు అనుగుణంగా డిస్‌ప్లే బ్రైట్‌నెస్ మార్చుకోవాలి. వెబ్ పేజీలో తెల్ల భాగాన్ని చూసినప్పుడు కాంతి వస్తున్నట్టు అనిపిస్తే చాలా బ్రైట్‌గా ఉందని.. మసకగా, బూడిద రంగులో కనిపిస్తే డార్క్‌గా ఉందని అర్థం చేసుకోవాలి. టెక్స్ట్‌సైజు, కాంట్రాస్ట్‌నూ సౌకర్యవంతంగా ఉండేలా అడ్జస్ట్ చేసుకోవాలి.
- ఇంకా దూరం వస్తువులను 10-15 సెకండ్ల పాటు చూసి, వెంటనే దగ్గర వస్తువుల మీద 10-15 సెకండ్ల సేపు దృష్టి పెట్టాలి. ఇలా పది సార్లు చేస్తే.. తదేకంగా స్క్రీన్‌ను చూసినప్పుడు బిగుసుకున్న కండరాలు వదులవుతాయి.
- ముఖ్యంగా తరచూ కంటి రెప్పలను ఆడిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కళ్లు పొడి బారకుండా, చికాకు పడకుండా ఉంటాయి. ఒకవేళ కళ్లు తడారితే డాక్టర్‌ను సంప్రదించాలి. కృత్రిమ కన్నీటి చుక్కలతో ఉపశమనం కలుగుతుంది. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి నిద్రపోతున్నప్పుడు కళ్లు మూత పడినట్టుగా నెమ్మదిగా 10 సార్లు రెప్పలను మూయాలి.
- కంప్యూటర్ తెరకూ కళ్లకూ మధ్య 20 నుంచి 24 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. తెర మధ్య భాగం కళ్లకు సుమారు 10 నుంచి 15 డిగ్రీల దిగువన ఉండేలా కూర్చోవాలి. ఫలితంగా తల, మెడ మరీ కిందికి లేదా పైకి లేకుండా చూసుకోవచ్చు. కళ్ల మీద అతిగా భారం పడకుండా కాపాడుకోవచ్చు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.