తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

గోళ్లు కొరుకుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా? మరి ఎలా వదిలించుకోవాలి? - NAIL BITING HABIT SIDE EFFECTS

-మీకు తరచూగా గోళ్లు కొరికే అలవాటు ఉందా? -మితిమీరితే ఇతర ఇబ్బందులకూ దారితీస్తుందట!

NAIL BITING HABIT SIDE EFFECTS
NAIL BITING HABIT SIDE EFFECTS (Getty Images)

By ETV Bharat Lifestyle Team

Published : Feb 17, 2025, 3:52 PM IST

Nail Biting Habit Side Effects:మనలో చాలా మంది ఏమీ తోచనప్పుడో, దేన్నయినా నిశితంగా గమనిస్తున్నప్పుడో గోళ్లు కొరుకుతుంటారు. అయితే, ఎప్పుడో ఒకసారంటే ఏమో గానీ ఇదొక అలవాటుగా, విడవలేని ప్రవర్తనగానూ మారితేనే సమస్యగానే భావించాలట. దీనిని అనికోఫేజీ లేదా అనికోఫేజియా అంటారని.. ఇంకా తేలికగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమస్య వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? దీనిని ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గోళ్లు కొరకటం సాధారణంగా బాల్యంలో మూడేళ్ల వయసులోనే ప్రారంభం అవుతుంది. ఇంకా పిల్లల్లో సుమారు 20% మంది అదేపనిగా గోళ్లు కొరుకుతుంటారని అంచనా వేస్తున్నారు. పెద్దగా అవుతున్నకొద్దీ కొందరు ఈ సమస్యను వదిలించుకుంటారు. కానీ చాలామందికి పెద్దయ్యాకా కొనసాగుతూ వస్తుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులు గోళ్లు కొరకటం చూసి పిల్లలకూ అలవడొచ్చు. (నేషనల్ హెల్త్ రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఉపశమనంగా మొదలై:సాధారణంగా గోళ్లు కొరకటమనేది ఉపశమనం కోసం చేస్తుంటారు. ముఖ్యంగా చిరాకు, ఆందోళన, ఒత్తిడి, ఒంటరితనం వంటి భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఇలా చేస్తుంటారు. కొందరు గోళ్లను మాత్రమే కొరికితే మరికొందరు మొదలు వరకూ కొరుకుతారు. ఫలితంగా గోరు కింద చర్మం ఎర్రగా మారి.. నొప్పి, వాపూ తలెత్తొతుంది. ఇంకా గోళ్లు పెళుసుగా, వంకర టింకరగా అవుతాయని నిపుణులు అంటున్నారు. మరి కొందరు కొరకటానికి గోళ్లు మిగలకపోతే చుట్టుపక్కల చర్మాన్నీ నమలడం వల్ల చేతులు చూడటానికి ఎబ్బెట్టుగా కనిపిస్తాయి.

ఇన్‌ఫెక్షన్లు కూడా:మన నోట్లో బోలెడన్ని బాక్టీరియా, వైరస్‌లు ఉంటాయి. ఇవి లాలాలజం ద్వారా వేలి కొసలకు, గోరు అడుగు భాగంలోకి చేరతాయి. వేళ్లు అదేపనిగా తడిగా ఉండటం వల్ల బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లే కాకుండా ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లూ తలెత్తొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లకు చికిత్స చాలా కష్టమని.. తరచూ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటే యాంటీబయాటిక్‌, యాంటీ ఫంగల్‌ మందులు వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వివరిస్తున్నారు. ఒకవేళ గోళ్లు గట్టిగా ఉన్నట్టయితే కొరికినప్పుడు పళ్లూ దెబ్బతినొచ్చని అంటున్నారు. నోట్లోనూ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తొచ్చని.. ఒకవేళ పొరపాటున గోళ్లను మింగితే అవి జీర్ణం కావని వెల్లడిస్తున్నారు. ఫలితంగా జీర్ణాశయంలో, పేగుల్లో చికాకు కలిగిస్తాయని పేర్కొన్నారు. పేగులతో పాటు బ్యాక్టీరియా లోపలికి వెళ్తే ఇన్‌ఫెక్షన్లకూ దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు.

ఆత్మవిశ్వాసానికీ దెబ్బే:ఇలా తరచూ కొరకటం వల్ల గోళ్లు వికారంగా కనిపిస్తాయి. వేళ్ల మీద పుండ్లూ పడొచ్చని నిపుణులు అంటున్నారు. ఫలితంగా చేతులను దాచుకోవటానికి ప్రయత్నిస్తుంటారని.. నలుగురిలోకి రావటానికి ఇబ్బంది పడతారని చెబుతున్నారు. ఇంకా ఆత్మ విశ్వాసం తగ్గడమే కాకుండా.. ఇది కెరియర్‌ మీదా ప్రభావం చూపొచ్చని తెలిపారు.

గేలి చేస్తే లాభం లేదు:ఎలా మొదలైనా కూడా గోళ్లు కొరకటమనేది సమస్యాత్మక అలవాటని.. దీన్ని వదిలించుకోవటం అంత తేలిక కాదని నిపుణులు అంటున్నారు. కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే గోళ్లు కొరకటం ఆపేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఆటలాడేలా ప్రోత్సహించటం మంచిదని.. కరాటే వంటి యుద్ధవిద్యలు నేర్పించినా మేలని తెలిపారు. ఇలాంటివి గోళ్లు కొరకటం నుంచి మనసును మళ్లించి.. ఆందోళన తగ్గిస్తాయి, ఆత్మతవిశ్వాసం పెంచుతాయని పేర్కొన్నారు. ఏ విషయంలోనైనా ఆందోళన చెందుతున్నా, ఆదుర్దాగా ఉన్నా ధైర్యాన్ని కల్పించాలని సూచిస్తున్నారు. గేలి చేయటం, కొట్టటం, తిట్టటంతో ప్రయోజనం ఉండదని.. ఇవి అలవాటును మరింత ఎక్కువ చేసే ప్రమాదముందని వివరిస్తున్నారు.

వదిలించుకోవటమెలా?

  • ఎప్పటికప్పుడు పెరిగిన గోళ్లను కత్తిరించాలి. పొట్టిగా ఉంటే కొరకటానికి గోళ్లు అనువుగా ఉండక.. కొరకాలనే కోరికా తగ్గుతుంది.
  • గోళ్లకు చేదు రుచిని పూయొచ్చని.. ఇప్పుడు చేదు రుచితో కూడిన పాలిష్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది నోట్లోకి వెళ్లినా హాని చేయకుండా.. చేదుగా ఉండటం వల్ల కొరికినప్పుడు వికారంగా అనిపిస్తుంది.
  • ఇంకా గోళ్లకు టేపు చుట్టటం, చేతులకు గ్లౌజులు ధరించటమూ మేలు చేస్తాయి.
  • గోరు కొరకాలనిపించినప్పుడు మెత్తటి బంతిని నొక్కటం, ర్యూబిక్‌ క్యూబ్‌ ఆడటం వంటివి చేయాలి. దీంతో చేతులకు కావాల్సినంత పని దొరికి.. చేయి నోటికి దూరంగా ఉండటం వల్ల కొరకటం తగ్గుతుంది.
  • గోళ్లు కొరకటాన్ని ప్రేరేపించే ఆందోళన, ఒత్తిడి వంటి కారకాలను గుర్తించి.. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలి.
  • ముందుగా బొటనవేలు కొరకటం ఆపేయాలి. దీన్ని సాధిస్తే ఇతర వేళ్లకూ వర్తింపజేసి.. మొత్తమ్మీద గోరును అసలే కొరకొద్దనే లక్ష్యాన్ని పెట్టుకొని సాధన చేయాలి. ఇలా క్రమంగా అలవాటును మానుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? ముందే గుర్తిస్తే ఆ సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చట!

మీ పిల్లలకు జుట్టు విపరీతంగా రాలుతోందా? - ఇలా చేస్తే కురులు ఆరోగ్యంగా ఉంటాయ్!

ABOUT THE AUTHOR

...view details