Sleeping Mistakes cause Pimples: మనం సరిగ్గా నిద్రపోకపోతే కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా.. అందాన్నీ దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చర్మంలో సీబమ్ ఉత్పత్తి పెరిగి మొటిమలకు కారణం అవుతుందని వెల్లడిస్తున్నారు. అయితే ఇలా సరిగ్గా నిద్రపోకపోవడం వల్లే కాక.. నిద్ర విషయంలో మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కూడా మొటిమలొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాటిని మారుస్తున్నారా?
మనలో చాలా మంది దిండు కవర్లను ఎప్పటికప్పుడు మార్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కానీ ఈ నిర్లక్ష్యమే మొటిమలు రావడానికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మన పడుకునే సమయంలో చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియాతో పాటు మృతకణాలూ దిండు పైకి చేరతాయి. రోజూ ఈ ప్రక్రియ జరుగుతుంటుందని వెల్లడిస్తున్నారు. ఇదే దిండును రోజుల తరబడి ఉపయోగించడం వల్ల అవి చర్మ రంధ్రాల్లోకి చేరివాటిని మూసేస్తాయని.. ఫలితంగా మొటిమలు వస్తాయని వివరిస్తున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే కనీసం వారానికోసారి తప్పకుండా దిండు కవర్లను మార్చడం, దిండ్లను వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయడం, సిల్క్ బెడ్‌షీట్లు, దిండు కవర్లను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచిస్తున్నారు. అలాగే ఒకరు ఉపయోగించిన దిండ్లు మరొకరు వాడకుండా జాగ్రత్తపడడమూ ముఖ్యమేనని అంటున్నారు. ఇలాంటి జాగ్రత్తలతో మొటిమల సమస్యకు దూరంగా ఉండచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. 2020లో Journal of Cosmetic Dermatology ప్రచురితమైన "The impact of pillowcase hygiene on skin health" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మేకప్ తొలగించుకోకపోయినా..!
మనం నిద్రపోయే సమయంలో శరీరంలో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయులు పూర్తిగా పడిపోతాయి. ఫలితంగా చర్మంలో ఎక్కువ కొలాజెన్ ఉత్పత్తై చర్మాన్ని రిపేర్ చేస్తుందని.. దీంతో సౌందర్యం ఇనుమడిస్తుందని అంటున్నారు. అయితే ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావాలంటే నిద్రపోయే ముందు చర్మంపై ఎలాంటి మేకప్ ఉత్పత్తులు లేకుండా, క్రీమ్‌లు వాడకుండా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది ఓపిక లేదనో, నిర్లక్ష్యంతోనో మేకప్ తొలగించకుండా లేదంటే పైపైన తొలగించుకొని పడుకుంటారు. ఫలితంగా చర్మ రంధ్రాల్లో మేకప్ అవశేషాలు ఉండిపోయి మూసుకుపోవడం వల్ల మొటిమలు వస్తాయని అంటున్నారు. కాబట్టి ఈ సమస్య రాకుండా ఉండాలంటే మేకప్ పూర్తిగా తొలగించుకున్నాకే నిద్రపోవాలని నిపుణులు తెలిపారు. అప్పుడే చర్మానికి రక్తప్రసరణ కూడా మెరుగై శరీరం కాంతివంతంగా మారుతుందని పేర్కొన్నారు.
జుట్టుకు దట్టంగా నూనె!
ముఖ్యంగా కొంతమంది ఉదయాన్నే తలస్నానం చేయచ్చన్న ఉద్దేశంతో రాత్రి పడుకునే ముందే జుట్టుకు నూనె పెడుతుంటారు. అయితే ఈ అలవాటు క్రమంగా మొటిమలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కుదుళ్లలోని జిడ్డుదనం పరోక్షంగా ముఖ చర్మంపై సీబమ్ ఉత్పత్తిని పెంచుతుందని.. ఇలా అవసరానికి మించి ఎక్కువ నూనెలు ఉత్పత్తవడం వల్ల ముఖంపై మొటిమలొస్తాయని వివరిస్తున్నారు. కాబట్టి పడుకునే ముందు ఈ అలవాటును మానుకోమని సలహా ఇస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు జుట్టుకు నూనె పట్టించి.. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయడం మంచిదని అంటున్నారు. ఇలా చేయడం వల్ల మొటిమల ముప్పూ తప్పుతుందని వెల్లడిస్తున్నారు.