What Each Hug Means: మనకు సంతోషమైనా, బాధేసినా బిగి కౌగిలింతతో మనసులోని భావాల్ని ఎదుటివారితో పంచుకునే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనసులోని భావోద్వేగాలు అదుపులోకి వస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. మరి, నిజంగానే కౌగిలింతకు అంత పవర్ ఉందా? అంటే అవుననే చెబుతున్నారు పరిశోధకులు. మనిషి మూడ్‌ను మార్చేసే శక్తి హగ్‌లో ఉందని ఇప్పటికే పరిశోధనలు శాస్త్రీయంగా నిరూపించాయి. ఇంకా కౌగిలింత వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గి రక్త పోటును అదుపు చేస్తుందని నిపుణులు చెబుుతన్నారు. Western Journal of Nursing Researchలో ప్రచురితమైన The Effects of Hugging on Physiological and Psychological Responses" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. ఈ నేపథ్యంలోనే ఏ కౌగిలింతకు ఏ అర్థముందో నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
వెనక నుంచి హత్తుకుంటే:ఒక వ్యక్తి మిమ్మల్ని వెనక నుంచి హత్తుకున్నారంటే మీ రక్షణ గురించి వాళ్లు ఎంతో నిబద్ధతతో ఉన్నారని అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. సహజంగా ప్రేమికులు లేదా భార్యభర్తల్లోనే ఇలాంటి కౌగిలింతలు ఎక్కువగా కనిపిస్తుంటాయని చెబుతున్నారు. ఒకవేళ మాటల్లో చెప్పలేకపోతున్నా, ఓ వ్యక్తి మిమ్మల్ని వెనకాల నుంచి గట్టిగా హత్తుకున్నారంటే వారికి మీపై ఎంతో ప్రేమ, నమ్మకం ఉన్నాయని అర్థమని వివరిస్తున్నారు.
బిగి కౌగిలింత:మనకు ఇష్టమైన వ్యక్తిని ఎన్నో రోజుల తర్వాత కలుసుకోవడమో లేక వారిని విడిచి వెళ్లడానికి ఇష్టపడనప్పుడో గట్టిగా కౌగిలించుకుంటాం. దీనినే బేర్ హగ్/బిగి కౌగిలింత అని పిలుస్తుంటారు. ఒక వ్యక్తి మిమ్మల్ని ఇలా గట్టిగా హగ్ చేసుకుంటే వారికి మీపై ఎంతో ప్రేమ ఉందని అర్థం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇది కేవలం ప్రేమికులు, భార్యాభర్తలు, తల్లీపిల్లల మధ్యే కాకుండా.. స్నేహితులు, బంధువుల మధ్య కూడా ఉంటుందని వివరిస్తున్నారు.
వీపు నిమరడం:మనం కౌగిలించుకున్న తర్వాత వీపుపై నిమరడం చాలా మందికి అనుభవమే ఉంటుంది. ఇలా హగ్ చేసుకుంటున్నారంటే వారు మీ సంరక్షకులని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సహజంగా తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్లు చిన్నారులను ప్రోత్సహిస్తున్న సమయంలో, వారిని ఓదార్చుతున్న సమయంలో ఇలాంటి కౌగిలింతలు సర్వసాధారణమేనని వివరిస్తున్నారు.
మర్యాదగా:మన ముఖంపై సంతోషం, చిరునవ్వు ఉన్నప్పుడు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడాన్ని పొలైట్ హగ్‌గా పిలుస్తారని చెబుతున్నారు. ఇలాంటి కౌగిలింతలు సాధారణంగా స్నేహితులు, పేరెంట్స్-పిల్లలకు మధ్య కనిపిస్తుంటాయని అంటున్నారు. ఇలా ఎవరైనా మిమ్మల్ని కౌగిలించుకుంటే 'నీకు నేనున్నాననే భరోసా ఇస్తున్నట్లు' అర్థం చేసుకోవాలని వివరిస్తున్నారు.