World Leaders Wishes to PM Modi : లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మోదీకి అభినందనలు తెలిపారు. ఇటలీ, భారత్ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. భారత్‌తో బంధం మరింత బలోపేతం కోసం ఎదురు చూస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే తెలిపారు. నేపాల్ ప్రధాని ప్రచండ మరోసారి విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య కసరత్తు విజయవంతంగా పూర్తైనందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు.
మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ కుమార్ జుగ్నౌత్ కూడా చరిత్రాత్మక విజయం సాధించారంటూ మోదీకి అభినందనలు తెలియజేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ మరింత ఉన్నతి సాధిస్తూనే ఉంటుందన్నారు. ప్రధానికి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వివరించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ‌్గే కూడా మోదీకి అభినందనలు తెలియజేశారు. ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్న భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
అమెరికా, చైనా శుభాకాంక్షలు
భారత్ ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసిందని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల సన్నిహిత సంబంధాలు ఇకపైనా కొనసాగుతాయని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్‌నెస్, బార్బొడోస్ ప్రధానమంత్రి మియా అమోర్ మోట్లీ కూడా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి చైనా అభినందనలు తెలియజేసింది. ఇరుదేశాల ప్రయోజనాల కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధమని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. శాంతి, సుస్థిరతల కోసం పరస్పర సహకారం అవసరమని ఆమె వివరించారు. తనకు అభినందనలు తెలిపిన నాయకులు, దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయా దేశాలతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.