తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ vs హారిస్​- ఎవరికీ స్పష్టమైన అధిక్యం లేదు! అమెరికా ఓటర్లు ఏమనుకుంటున్నారంటే? - US Presidential Election 2024

US Presidential Election 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా, ఇద్దరు ప్రధాన అభ్యర్థులు కమలా హారిస్, డొనాల్డ్​ ట్రంప్​నకు స్పష్టమైన అధిక్యం కనిపించడం లేదు. ఈ మేరకు ఆసోసియేటెడ్ ప్రెస్​ నిర్వహించిన సర్వేలో ఓటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు ఏమిటి? ఓటర్ల మనోగతం ఏమిటి? ఇద్దరికీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడం దేనికి దారితీస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

US Presidential Election 2024
US Presidential Election 2024 (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2024, 2:15 PM IST

US Presidential Election 2024 :అమెరికాలో అధ్యక్ష పోరు రసవత్తరంగా మారింది. డెమొక్రటిక్​ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ క్యాండిడేట్​​ డొనాల్డ్​ ట్రంప్ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను తమ వైపునకు అకర్షించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఇద్దరు ప్రధాన అధ్యక్ష అభ్యర్థులకు స్పష్టమైన మెజారిటీ లేదు. ఈ మేరకు 'అసోసియేటెడ్​ ప్రెస్- NORC సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్' సర్వే ద్వారా తెలిసింది. ఈ సంస్థ చేసిన కొత్త పోల్ ప్రకారం, 10మంది రిజస్టర్డ్​ ఓటర్లలో నలుగురు, డొనాల్డ్​ ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించగలరని అభిప్రాయపడ్డారు. కమలా హారిస్​ కూడా మెరుగ్గానే ఎకానమీని హ్యాండిల్ చేయగలరని అంతే మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. మిగిలిన వారిలో ఒకరు, ఇద్దరినీ విశ్వసించడం లేదు. మరొకరు ట్రంప్​, కమలా ఇద్దరికీ మద్దతు ఇచ్చారు.

ట్రంప్​నకు హెచ్చరిక!
ఇది ఒక విధంగా ట్రంప్​నకు వార్నింగ్​ లాంటిదని 'ఏపీ సర్వే' నివేదిక పేర్కొంది. ఎందుకంటే, ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్​ ఆర్థిక వ్యవస్థను సరిగా నిర్వహించలేదని, అందులో హారిస్​ కూడా భాగమే అని ఓటర్లను నమ్మించడానికి ట్రంప్​ ప్రయత్నించారు. అయితే, ట్రంప్​నకు​ అనుకూలంగా మారిన ఆ విమర్శల నుంచి కమలా హారిస్​ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తాజా పోల్​ తెలిపింది.

కొత్త పోల్​ ప్రకారం, 10మంది ఓటర్లలో 8మంది ఓటర్లు, ఆరోగ్య సంరక్షణ, నేరాలు కన్నా ఎకానమీనే ప్రధాని సమస్యగా పరిగణిస్తున్నారు. ఈ విషయంలో ఉత్తమంగా ఉన్న అభ్యర్థలకు మద్దతిస్తామంటున్నారు. తాజా సర్వే ప్రకారం, కేవలం మూడింట ఒక వంతు మంది మాత్రమే జాతీయ ఆర్థిక వ్యవస్థ కొంతమేర లేదా చాలా బాగుందని అభిప్రాయడ్డారు. అందులో కొంత మంది మాత్రం తమ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిపై సానుకూలంగా ఉన్నారు. 10మందిలో ఆరుగురు తమ ఆర్థిక పరిస్థితి కొంతమేర లేదా చాలా బాగుందని తెలిపారు.

ఎన్నికలను ప్రభావితం చేసే కీలక సమస్యలివే!
ఈ ఎన్నికల్లో ప్రజల అభిప్రాయాన్ని మార్చే అంశాల్లో ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఉంది. సర్వేలో పాల్గొన్న ఓటర్లలో సగం మందికిపైగా ఆరోగ్య సంరక్షణ తమ టాప్​ ప్రయారిటీగా తెలిపారు. సగం మంది నేరాలు, ఇమ్మిగ్రేషన్, అబార్షన్ పాలసీ, గన్ పాలసీ ఆందోళన చెందాల్సిన అంశాలని పేర్కొన్నారు. ఇక మూడింట్లో ఒకవంతు మంది, వాతావరణ మార్పు, పావు వంతు మంది ఇజ్రాయెల్, హమాస్​ యుద్ధాన్ని ఓటు వేయడానికి ప్రధాన అంశంగా భావిస్తున్నట్లు తెలిపారు. గాజాలో యుద్ధాన్ని ఎవరు సమర్థంగా హ్యండిల్​ చేసేవారని అడిగిన ప్రశ్నకు, ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయి. ఇమ్మిగ్రేషన్​ను హారిస్ కంటే ట్రంప్​​ మెరుగ్గా నిర్వహిస్తారని కొందరు అభిప్రాయపడ్డారు. బైడెన్ హయాంలో మెక్సికోతో బార్డర్​ వద్ద అక్రమ వలసలు సవాలుగా మారాయి. ఈ విషయంలో ట్రంప్​దే పైచేయిగా నివేదిక పేర్కొంది.

ద్రవ్యోల్బణం- ఎన్నికల్లో కీలక అంశం
అమెరికాలో 2022లో ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్ఠానికి చేరింది. ఓ ప్రభావం ప్రజలపై పడింది. తమ నిత్యావసరాల ఖర్చుల​ గురించి ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. అధిక వడ్డీ రేట్ల- ఇళ్లు, మోటారు వాహనాల కొనుగోలుదారులను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. తక్కువ 4.2 శాతం నిరుద్యోగం, స్టాక్​ మార్కెట్​ లాభాల కన్నా ద్రవ్యోల్బణం విషయమే ప్రజలు పరిగణనలోకి తీసుకుంటున్నారు.

ఆర్థిక వ్యవస్థపై ఇద్దరూ ఇద్దరే!
ఇద్దరు ప్రధాన అభ్యర్థులు కమల, ట్రంప్​కు దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా చక్కదిద్దాలనే దానిపై విభిన్న ఆలోచనలు ఉన్నాయి. అయితే ఇందులో ఏ ఒక్కరు కూడా తమ ప్రణాళికలను ఎలా అమలు చేస్తారో పూర్తిగా వివరించలేదు. కమలా హారిస్​ మాత్రం తమ ప్రణాళికలన్నింటికీ పూర్తిగా బడ్జెట్​ నుంచే నిధులు సమకూరుస్తామని చెబుతున్నారు. మరోవైపు, ట్రంప్​ చాలా ఆర్థిక నమూనాలకు విరుద్ధంగా- తమ ప్రణాళికల కోసం ఒకవేళ అప్పు చేసినా, ఆ ఖర్చును భర్తీ చేయడానికి తగినంత వృద్ధి ఉంటుందని వాదిస్తున్నారు.

పన్నుల విషయంలో భిన్న ద్రువాలు!
సంపన్నులకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా వృద్ధి​ వస్తుందని ట్రంప్ అంటున్నారు. తద్వారా వారు మరిన్ని పెట్టుబడులు పెడతారని చెబుతున్నారు. ఇక 20 శాతం యూనివర్సల్​ టారిఫ్​, యూఎస్​ ఫ్యాక్టరీలను నిర్మించడానికి పెట్టుబడిని నిర్దేశిస్తుందన్నారు. దీనికి విరుద్ధంగా, సంపన్నులపై అధిక పన్నులు విధించడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు నిధులు సమకూరి మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఇది ఖర్చులు అదుపులో ఉండటానికి, వృద్ధి రేటు పెరగడానికి సహాయపడుతుందని వాదిస్తున్నారు. ట్రంప్ ప్రేవేశపెట్టదలచుకున్న టారిఫ్​లు అధిక ధరలకు దారితీస్తాయని డెమొక్రాట్లు హెచ్చరిస్తున్నారు.

ఇదీ ఓటర్ల మనోగతం
ఫిలడెల్ఫియాలో మెడికల్ రికార్డ్స్​లో పని చేస్తున్న మార్క్​ కార్లోఫ్(33) కమలా హారిస్​కు ఓటేయాలనుకుంటున్నాడు. దిగుమతులపై ట్రంప్​ ప్రతిపాదించిన పన్నుల వల్ల వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతాయని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. ఇందుకు భిన్నంగా, టెక్సాస్​లోని హంట్స్​ విల్లేకు చెందిన రిచర్డ్​ టన్నెల్(32), ట్రంప్​నకు ఓటేస్తానని చెప్పాడు. ఆనేక సార్లు దివాలా ప్రక్రియ ఫైల్​ చేసినా, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ట్రంప్​ ఉన్నారని చెప్పాడు. లూసియానాలోని లాఫాయెట్‌కు చెందిన చాంటెల్ బ్రూక్స్, ఇద్దరిలో ఓ అభ్యర్థికీ ఆర్థిక వ్యవస్థపై సరైన పట్టు లేదని అభిప్రాయపడింది. తాను ఇష్టపడే వ్యక్తి అధ్యక్ష రేసులోకి వస్తే తప్ప, ఓటేయనని బ్రూక్స్ చెప్పింది.

ముందస్తు ఓటింగ్​ షూరూ
అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం మూడు రాష్ట్రాల్లో శుక్రవారం ముందస్తు ఓటింగ్ ప్రారంభం కానుంది. డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాల్జ్ సొంత రాష్ట్రం మిన్నెసొటా, వర్జీనియా, సౌత్ డకోటా రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రారంభకానుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. ఓటర్లు పోలింగ్​కు కేంద్రాలకు వెళ్లి వ్యక్తిగతంగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నవంబర్ 5న జరగే అధ్యక్ష ఎన్నికల ఆరువారాలు ముందు నుంచే ఈ మూడు రాష్ట్రాల్లో ఇన్ పర్సన్ ఔటింగ్ జరుగుతుంది. అక్టోబర్ నెల మధ్య నాటికి దాదాపు డజనుకు పైగా రాష్ట్రాల్లో ఇన్ పర్సన్ ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓట్లను నవంబర్ 5వ తేదీన అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే లెక్కిస్తారు.

ABOUT THE AUTHOR

...view details