తెలంగాణ

telangana

ETV Bharat / international

టారిఫ్​ వార్​లో ట్రంప్​దే విక్టరీ!- వలసదారుల విమానాలకు కొలంబియా అనుమతి - AMERICA VS COLOMBIA

అమెరికా, కొలంబియా టారిఫ్ వార్- యూఎస్​దే పైచేయి

america vs colombia
america vs colombia (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2025, 11:49 AM IST

America Vs Colombia : అమెరికా, కొలంబియా మధ్య జరిగిన టారిఫ్ వార్​లో అగ్రరాజ్యమే పైచేయి సాధించింది!. అమెరికా నుంచి వచ్చే అక్రమ వలసదారుల విమానాలను అనుమతిస్తామని కొలంబియా పేర్కొంది. అలాగే అక్రమ వలసదారులపై ట్రంప్ విధించిన నిబంధనలను సైతం అంగీకరించింది. భారీగా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో కొలంబియా వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో కొలంబియాపై విధించిన సుంకాలను అమెరికా నిలిపివేసింది. ఈ మేరకు వైట్ హౌస్ పేర్కొంది.

"అమెరికా నుంచి వచ్చే వలసదారుల విమానాలను తమ దేశంలోకి అనుమతించేందుకు కొలంబియా అధ్యక్షుడు అంగీకరించారు. అక్రమవలసదారులపై ట్రంప్ విధించిన నిబంధనలను కొలంబియా ప్రభుత్వం అంగీకరించింది. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక శక్తి చట్టం ప్రకారం కొలంబియా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై విధించిన సుంకాల ఆదేశాలను రిజర్వ్​లో ఉంచాం. కొలంబియా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే టారిఫ్​లు అమలవుతాయి. అమెరికా నుంచి వెళ్లిన వలసదారుల విమానం కొలంబియా నుంచి తిరిగి వచ్చే వరకు వీసా పరిమితులపై ఆంక్షలు ఉంటాయి" అని ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు

అసలేం జరిగిందంటే?
అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కఠినంగా వ్యవహరిస్తున్నారు. యూఎస్​లోని అక్రమ వలసదారులను గుర్తించి ప్రత్యేక విమానాల్లో వారి స్వదేశాలకు పంపిస్తున్నారు. ఇలా వచ్చే వలసదారుల విమానాలను అనుమతించమని కొలంబియా స్పష్టం చేసింది.

విమానాలను వెనక్కి పంపిన కొలంబియా
కొలంబియా వలసదారులను తీసుకువచ్చే అమెరికా విమానాలను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నానని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో స్పష్టం చేశారు. వలసదారులను గౌరవంగా పంపించేందుకు అమెరికా నిబంధనలు రూపొందిస్తేనే వాటిని అనుమతిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా సైనిక విమానాలను వెనక్కి పంపించినట్లు వెల్లడించారు. అయితే, నేరస్థులుగా చిత్రించకుండా, అమెరికా పౌర విమానాల్లో పంపిస్తే మాత్రం వాటిని అనుమతిస్తామని స్పష్టం చేశారు.

కొలంబియాపై ట్రంప్ ఫైర్
అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను తీసుకువెళ్లిన విమానాలను తిప్పి పంపినందుకు కొలంబియాపై కొరడా ఝలిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కొలంబియా నుంచి తమ దేశానికి దిగుమతి అయ్యే వస్తువులపై ఇప్పటికిప్పుడు 25 శాతం టారిఫ్‌ విధిస్తామని హెచ్చరించారు. ఇది వారంలో 50 శాతానికి పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే వీసాపై కూడా పరిమితులు విధిస్తామని తెలిపారు.

"కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో నిర్ణయం అమెరికా జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టివేసింది. అందుకే కొలంబియాపై చర్యలు తీసుకుంటున్నాం. కొలంబియా ప్రభుత్వం తాము అమెరికాలో నుంచి తరలించిన వలసదారుల విమానాన్ని తమ దేశంలోకి రానివ్వలేదు. ఆ విమానాలను తిరిగి పంపడం చట్టపరమైన బాధ్యతలను ఉల్లంఘించడమే" అని తన సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్ ట్రూత్​లో ట్రంప్ పోస్టు చేశారు.

తొలుత అమెరికా తమ దేశంపై విధించిన సుంకాలపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో మండిపడ్డారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకాలను విధించారు. ఆ తర్వాత అమెరికా భారీ ఆంక్షలు నేపథ్యంలో వెనక్కి తగ్గారు. అమెరికా నుంచి వచ్చే అక్రమ వలసదారుల విమానాలను అనుమతిస్తామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details